వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
నారాయణపేట: జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో హౌసింగ్, డీఆర్డీఓ, విద్యాశాఖ, ఆరోగ్య, పీఆర్, డీపీఓ, మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సొంత స్థలాలు ఉన్న 859 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. వాటి గ్రౌండింగ్ వివరాలపై కలెక్టర్ ఆరా తీయగా.. ఇప్పటి వరకు 165 గ్రౌండింగ్ అయ్యాయని హౌసింగ్ పీడీ శంకర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలోనే జిల్లా 6వ స్థానంలో ఉందన్నారు. మిగతా ఇళ్ల నిర్మాణాలను కూడా త్వరగా మొదలుపెట్టి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
● జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై కలెక్టర్ సమీక్షిస్తూ.. మహిళా సంఘాల సభ్యులకు సోలార్ పవర్ ప్లాంట్లు, బస్సులు, న్యూ ఎంటర్ ప్రైజెస్ యూనిట్ల మంజూరు వివరాలను డీఆర్డీఓ మొగులప్పతో తెలుసుకున్నారు. అయితే బ్యాంకు లింకేజీలో రాష్ట్రంలోనే జిల్లా ర్యాంకు 32వ స్థానంలో ఉండటంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పనితీరు సరిగ్గా లేని ఏపీఎంలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓను ఆదేశించారు. అదే విధంగా 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు స్కూల్ యూనిఫాం కుట్టే ప్రక్రియపై కలెక్టర్ చర్చించారు. 2024–25లో జరిగిన పొరపాట్లు, లోటుపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. డీఆర్డీఓ, విద్యాశాఖ అధికారు లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు గడువులోగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల వివరాలను ఈఈ హీర్యానాయక్‌తో కలెక్టర్ తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల ఏర్పాట్లు, బాబుజీ జాతర, ఆస్తిపన్ను వసూలు, ఎల్‌ఆర్‌ఎస్, ఈజీఎస్ పనులపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎంహెచ్‌ఓ డా.సౌభాగ్యలక్ష్మి, డీఈఓ గోవిందరాజులు, జీసీడీఓ నర్మద, డీపీఓ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment