భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఏఐకేఎస్ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో భూ సంరక్షణ కమిటీ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం న్యాయబద్ధంగా రైతుల నుంచి భూములు సేకరించకుండా.. పోలీసులను పెట్టి భూ సేకరణ చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం, సొంత జిల్లా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతుల కడుపు కొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే రైతులతో చర్చించి భూమికి బదులు భూమి ఇవ్వాలని.. లేదా బహిరంగ మార్కెట్ రేటుకు మూడింతలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతాంగానికి ఎర్రజెండా అండగా ఉంటుందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు వెన్నంటే ఉంటామని తెలిపారు. సదస్సులో మాజీ వైస్ ఎంపీపీ మహేశ్ కుమార్, రైతు సంఘం నాయకులు వెంకట్రామారెడ్డి, గోపాల్, అంజిలయ్య, మశ్చందర్, రాజు, కేశవ్‌గౌడు, నారాయణ, సాయికుమార్, నర్సింహులుగౌడ్, లక్ష్మీకాంత్, అరుణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment