ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
నారాయణపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన గురువారం మొత్తం 3,803 మంది విద్యార్థులకుగాను 3724 మంది పరీక్షలకు హాజరయ్యారు. 79 మంది గైర్హాజరయ్యారు. అలాగే, జనరల్ విద్యార్థులు 3,335 మందికిగాను 3,277 మంది, ఒకేషనల్‌లో 468 మందికిగాను 447 మంది హాజరయ్యారు.
బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత డ్రైవింగ్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తెలంగాణ బీసీ సహకార ఆర్థికసంస్థ ఆధ్వర్యంలో జిల్లా లోని బీసీ నిరుద్యోగ యువతకు డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఇందిర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 38 రోజులు శిక్షణ ఉంటుందని, ఉచిత భోజనంతో పాటు వసతి కల్పించనున్న ట్లు పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారు 8వ తరగతి పాస్ అయిన వారు అర్హులని తెలిపారు. ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం దరఖాస్తుతో పాటు కలెక్టరేట్‌లోని రెండవ అంతస్తులోని రూం నంబర్ 205 బీసీ అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉందని, ఇతర వివరాలను బీసీ అభివృద్ధి శాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పేరుపై రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రదానం చేయనున్నట్లు చేనేత, జౌళి శాఖ డీడీ బాబు గురువారం ఓ ప్రకనటలో తెలిపారు. చేనేత, డిజైనింగ్ వృత్తుల్లో నైపుణ్యం ఉన్న చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పోచంపల్లి, గద్వాల చీరలు, నారాయణపేట చీరలు, డర్రీస్, జనరల్ వైరెటీస్ రంగాల్లో నైపుణ్యం ఉండాలని సూచించారు. వీవింగ్ కేటగిరి, డిజైనింగ్ కేటగిరిలో అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు చేనేత, జౌళి శాఖ డీడీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment