పేదల బియ్యం పక్కదారి..!
నర్వ: చౌకధర దుకాణాల్లో పేదలకు అందించే బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ కార్డుదారుల నుంచి బియ్యం సేకరణతో మొదలుకుని రైస్‌మిల్లులకు తరలింపు వరకు గుట్టుచప్పుడు కాకుండా అక్రమ దందా సాగుతోంది. కరోనా కాలం తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం వరకు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. తర్వాత దొడ్డు బియ్యం రావడంతో ఎక్కువగా వినియోగం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు.. జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో కిలో బియ్యాన్ని రూ. 12 నుంచి రూ. 15 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని ఒక చోట చేరుస్తుండగా.. ఏజెంట్ల ద్వారా వ్యాపారులు కొంటున్నారు.
దాడులు జరుగుతున్నా..
జిల్లాలో కొన్ని రోజులుగా టాస్క్‌ఫోర్స్, మండల పోలీసుల తనిఖీల్లో రేషన్ బియ్యం పట్టుబడుతూనే ఉంది. ఇందులో ఎక్కువగా వనపర్తి జిల్లా అమరచింత, జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి నర్వ మీదుగా కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న బి య్యం పోలీసుల పెట్రోలింగ్‌లో పట్టుబడుతున్నా యి. రేషన్ బియ్యం అక్రఓమ రవాణాకు సంబంధించి ఈ ఏడాది ఇప్పటి వరకు 13 కేసులు నమోదయ్యాయి. పోలీసులు దాడులు నిర్వహించి రేషన్ బియ్యాన్ని పట్టుకుంటున్నా అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. కొందరు మిల్లర్లు రేషన్ బియ్యం దందానే తమ ఆదాయ వనరుగా ఎంచుకున్నారని తెలుస్తోంది.
జిల్లాలో జోరుగాసాగుతున్న అక్రమ దందా
● నేరుగా లబ్ధిదారుల నుంచి కొనుగోలు
● కిలోకు రూ. 15 వరకు చెల్లిస్తున్న ఏజెంట్లు
● కేసుల నమోదుకే పరిమితమవుతున్న అధికారులు
రూ.లక్షల్లో అక్రమార్జన..
బియ్యం వ్యాపారులు ఏజెంట్ల ద్వారా లబ్ధిదారులతో కిలోకు రూ.15కు రేషన్ బియ్యం కొనుగోలు చేసి.. మిల్లర్లకు రూ. 25కి పైగా విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని రైస్‌మిల్లులో పాలిషింగ్ చేపట్టి సన్నబియ్యంగా బహిరంగ మార్కెట్లు, హాస్టళ్లు, హోటళ్లకు కిలో రూ. 43 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు, గుర్మిటకల్, బెంగళూరు, మహారాష్ట్రలోని ముంబాయి, తమిళనాడు రాష్ట్రం చైన్నెలలో ఈ బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా మార్కెటింగ్ చేపట్టిన మిల్లర్లు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు.
పేదల బియ్యం పక్కదారి..!
Comments
Please login to add a commentAdd a comment