చివరి విడతకు కొనసాగుతున్న నీటి విడుదల
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం వరక నీటి మట్టం 17 అడుగులకు చేరింది. వానాకాలం ముగిసిన తరువాత డిసెంబర్‌లో యాసంగి సీజన్ నీటిని వదలక ముందు ప్రాజెక్టు నీటి మట్టం 31.6 అడుగులు వద్ద ఉండగా.. డిసెంబర్ 25 నుంచి విడతల వారీగా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తూ వచ్చారు. ఈనెల 21వ తేదీ చివరి విడత నీటిని విడుదల ప్రారంభించగా.. 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు కింద వేసిన వరి పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. పాత ఆయకట్టు కింద ఉన్న వరి పంటలకే నీటిని విడుదల కొనసాగిస్తున్నారు. ఐదు విడతలు కలిపి ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి 14.6 అడుగుల నీటిని యాసంగి పంటలకు వినియోగించారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఈఈ ప్రతాప్‌సింగ్ మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం నీటిని విడుదల చేశామని, ఈనెల 30వ తేదీన ఐదో విడత గడువు ముగుస్తుందని, 31 నుంచి నీటి విడుదల నిలిపివేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 17 అడుగులకు నీటి మట్టం పడిపోయిందని, ఉన్న నీటిని వేసవిలో మిషన్ భగీరథ కింద తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు.


