రేషన్.. పరేషాన్
చౌకధర దుకాణాలు లేని గ్రామాల్లో లబ్ధిదారుల ఇక్కట్లు
మక్తల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రతి నెలా చౌకధర దుకాణాల ద్వారా ఉచితంగా బియ్య పంపిణీ చేస్తున్నాయి. సొంత గ్రామాల్లో చౌకధర దుకాణాలు లేని లబ్ధిదారులు ప్రతి నెల పొరుగూరికి వెళ్లి బియ్యం తెచ్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 11 మండలాలు, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 1.52 లక్షల లబ్ధిదారుల కోసం 298 రేషన్ దుకాణాలను మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేశారు. సుమారు 80 గ్రామాల్లో రేషన్ దుకాణాలు లేవు. దీంతో రెండు మూడు గ్రామాల లబ్ధిదారులకు కలిపి వేరు ప్రాంతంలో రేషన్ దుకాణం కేటాయించారు. దీంతో వారంతా నిత్యం కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో కొందరు.. కాలినడకన మరికొందరు వెళ్లి బరువు మోస్తూ ఇక్కట్లు అనుభవిస్తున్నారు.
సన్న బియ్యంపై ఆశలు
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని పేర్కొనడంతో లబ్ధిదారులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నా.. దూర భారంపై ఆందోళన చెందుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని తాము ఉదయాన్నే కూలి పనులు, పొలం పనులకు వెళ్తామని, రేషన్‌దుకాణం మరో గ్రామంలో ఉంటుందని, సన్న బియ్యం ఇచ్చే సమయంలో సమాచారం అందక తమకు అందుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. మక్తల్ మండలంలో 39 గ్రామ పంచాయతీలు ఉండగా 14 గ్రామాలకు మాత్రం రేషన్ షాపులు లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుర్లపల్లి, సామాన్‌పల్లి,ఏర్నాగాన్‌పల్లి, ఏర్సాన్‌పల్లి, ఉప్పర్‌పల్లి, గార్లపల్లి, వనాయికుంట, బోందల్‌కుంట, తిర్మలాపూర్, మాదన్‌పల్లి, అకేన్‌పల్లి, దాదాన్‌పల్లి, గడ్డంపల్లితో పాటు మరి గ్రామాల్లో రేషన్ దుకాణాలు లేక పొరుగున ఉన్న గ్రామాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసి ఇబ్బందులను తీర్చాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
జిల్లాలో మొత్తం 80 గ్రామాల్లో రేషన్ షాపులు ఏర్పాటుచేయని వైనం
ఒక గ్రామం నుంచి మరో
గ్రామానికి వెళ్లి పడిగాపులు
సన్న బియ్యం అందుతాయా
లేదా అని ఆందోళన
రేషన్.. పరేషాన్


