విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచాలి
నారాయణపేట: విద్యార్థులలో సృజనాత్మకతను పెంచే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీ గార్డెన్ ఫంక్షన్ హల్‌లో జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల నైపుణ్యాల ప్రదర్శన వేదిక విద్యా కదంబం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమలు జరుగుతున్న మౌలిక భాషా గణిత సామార్థ్యాల సాధన కార్యక్రమాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్ పరిశీలించారు. అనర్గళంగా ఆంగ్లం మాట్లాడిన విద్యార్థులతోపాటు మౌఖిక గణిత ప్రదర్శన చేసిన వారిని అభినందించారు. ఏడాదిపాటు నిర్వహించిన కార్యక్రమాలను ఈ విధంగా ఘనమైన ముగింపు కార్యక్రమం చేయడం బాగుందని, ఇదే స్ఫూర్తితో రానున్న విద్యాసంవత్సరం మరింత మెరుగ్గా పనిచేయాలన్నారు. విద్యాశాఖ పట్ల ప్రత్యేక దృష్టి ఉన్న కారణంగానే మన జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన సాగుతుందని, ఇలాంటి మరెన్నో వినూత్న కార్యక్రమలు జిల్లా విద్యాశాఖ నుంచి చేయాలని, అందుకోసం తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించుటకు ప్రవేశపెట్టిన యంగ్ ఆరేటర్స్ కార్యక్రమం ఆరంభంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, బాలల దినోత్సవం రోజు నిర్వహించిన కార్యక్రమం ద్వారా కొంత మెరుగుపడినట్లు, నేడు ఒక స్థాయి మేరకు ఫలితాలు సాధించిందని, ఉపాధ్యాయలలో కొంత కొత్తదనం కనిపించిందని, ఇది ఒక నిరంతర ప్రక్రియ అన్నారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు, సహకరిస్తున్న అలోకిత్ ఫౌండేషన్ సభ్యులైన సాయి ప్రమోద్, యదునందన్ తదితరులను ఆమె అభినందించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి కలెక్టర్ వీక్షించారు. డీఈఓ గోవింద రాజులు, ఏఎంఓ విద్యాసాగర్ ఎంఈఓలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
కోస్గి రోడ్డు విస్తరణ పనులు వేగవంతం
జిల్లాలోని కోస్గి మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు విస్తరణ లో మిగిలిన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. కోస్గి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్థల సేకరణకు వచ్చిన అభ్యంతరాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన గడువు 60 రోజులకు మరో వారం రోజులే గడువు ఉందని అంతలోపు అభ్యంతరాలను క్లియర్ చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్, ఆర్డీవో రామచందర్ నాయక్, ఆర్ అండ్ బి డి ఈ రాములు,కొస్గి తహసిల్దార్ బక్క శ్రీనివాస్, కమిషనర్ నాగరాజు పాల్గొన్నారు.
గడువులోగా భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి
జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. రూ.5 కోట్ల నిధులతో జిల్లా కేంద్ర సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి కలెక్టర్ సమాఖ్య భవన నిర్మాణ పనులను పరిశీలించి, నిర్ణీత సమయంలోగా నిర్మాణ పనులను పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. కలెక్టర్‌తో పాటు డిఆర్డిఏ మొగులప్ప, అడిషనల్ డిఆర్డిఏ అంజయ్య, పీ ఆర్ ఈఈ హీర్యా నాయక్, ఏ. ఈ ధర్మరాజు పాల్గొన్నారు.


