
కవిత్వం ఉగాది పచ్చడిలా ఉండాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కవి కవిత్వం చెబితే ఉగాది పచ్చడిలా తీపి, చేదు, పులుపు, వగరు కలగలిసి ఉండాలని జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం స్థానిక పారిశ్రామికవాడలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవి కప్పి చెబితే కవిత్వం అవుతుందని, విప్పి చెబితే విమర్శ అవుతుందన్నారు. పచ్చడి తాగితే తెలుగు సంవత్సరాది, మద్యం తాగితే ఇంగ్లిష్ సంవత్సరాది అని చమత్కరించారు. ముఖ్యంగా కవిత్వం నిగూఢ అర్థానిచ్చేదిగా ఉండాలని, హృదయాలను తెరిచే కవాటంలా కావాలన్నారు. కాగా, సుమారు 25 మంది కవులు తమ కవితలు వినిపించగా ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాలమూరు సాహితి రాష్ట్ర అధ్యక్షుడు వల్లభాపురం జనార్దన్, విద్యావేత్త, కవి కె.లక్ష్మణ్‌గౌడ్, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, కార్యదర్శి నస్కంటి నాగభూషణం, సభ్యులు ఎ.రాజసింహుడు, తైలం బాలక్రిష్ణ, కవులు ప్రొద్దుటూరి ఎల్లారెడ్డి, ఖాజామైనొద్దీన్, సూర్యనారాయణ, పులి జమున, రావూరి వనజ తదితరులు పాల్గొన్నారు.