శక్తిపీఠంలో ‘ఉగాది’ పురస్కారాలు
నారాయణపేట: జిల్లాలోని శక్తి పీఠం ఆధ్వర్యంలో సామాజిక, ఆధ్యాత్మిక సేవకులకుగాను పలువురికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ఆదివారం ఉగాది పండుగ నేపథ్యంలో శక్తిపీఠం వ్యవస్థాపకుడు డాక్టర్ స్వామి శాంతానంద పురోహిత్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, పచ్చడి ప్రసాద వితరణ చేశారు. శక్తిపీఠం జీవన సాఫల్య పురస్కారం లయన్ నారాయణ బట్టడ్, బ్రహ్మశ్రీ నారాయణబట్ పూజారి కృష్ణ క్షేత్ర పురోహితులు, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్‌రెడ్డి, శక్తి ఫౌండేషన్ చైర్మన్ చింతనపల్లి శివప్రసాద్‌రెడ్డి, డాక్టర్ ప్రసాద్‌శెట్టి, శ్రీ అనంత శయనస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు కులకర్ణి శ్రీపాదరావుకు పురస్కారాలను అందజేసి సన్మానించారు. అలాగే, ఉగాదిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఆలేరు నరసింహచార్య ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి పల్లెసేవ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష్యుడు రఘు ప్రేమ్ జోషి పంచాంగ శ్రవణం చేశారు. రాశి ఫలాలను విశ్వావసు నామ సంవత్సర విశేషాలను వివరించారు.


