సాంకేతిక వ్యవస్థపైఅవగాహన కలిగి ఉండాలి
నారాయణపేట: జిల్లా పరిధిలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నూతన సాంకేతిక వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీతో తయారుచేసిన సిసిటిఎన్ ఎస్ 2.0 వెర్షన్ పై ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలన్నారు. పెండింగ్ కేసులను తగ్గించేందుకు అధికారులు సమర్థవంతంగా కోర్టు డ్యూటీ అధికారులతో, న్యాయ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. పోక్సో ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన, సత్వర సేవలు అందించాలని, వేసవికాలంలో చాలామంది సొంతూళ్లకు వెళ్తుంటారని, పెట్రోల్ కార్ మొబైల్స్, బ్లూ కోట్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించి నేరాలు జరగకుండా కాలనీలో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలపై పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే, 2025లో 9 కేసులలో నేరస్తులకు శిక్ష పడ్డాయని (కన్వేషన్స్) అందులో నాలుగు కేసులలో నేరస్తులకు యావజ్జీవ శిక్ష పడడం జరిగిందని ఆ కేసుల్లో కృషి చేసిన వారిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, రామ్‌లాల్, రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జిని కలిసిన ఎస్పీ
నారాయణపేట: జిల్లా నూతన జడ్జి బోయ శ్రీనివాసులును శనివారం ఎస్పీ యోగేష్ గౌతమ్, డీఎస్పీ ఎన్ లింగయ్య పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో నేరాల నమోదు, దర్యాప్తు, కోర్టు క్యాలెండర్ నంబర్, కేసు ట్రయల్స్ లోక్ అదాలత్ నిర్వహణ, కేసులలో నేరస్తులకు శిక్షల అమలు తదితర అంశాలపై చర్చించారు. కోర్టు అధికారులు పోలీసులు సమన్వయంతో పనిచేసి త్వరగా కేసుల పరిష్కారం చూపాలని జడ్జి సూచించారు. వారితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల బాలప్ప ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలి
● ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల సమయంలో అధ్యాపకులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. పీయూలో కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అధ్యాపకులకు ఎంపీ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రారంభం నుంచి పనిచేస్తున్న అధ్యాపకులకు వెంటనే న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే అధ్యాపకులకు పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం దారణమైన విషయమన్నారు. సెట్, నెట్, పీహెచ్‌డీ ఉన్న అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని, జీఓ నంబర్ 21ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీరి క్రమబద్ధీకరణ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే యూజీసీతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. భూమయ్య, శ్రీధర్‌రెడ్డి, వేణు, ఈశ్వర్ పాల్గొన్నారు.


