శ్రీనగర్: మీర్ యాసిర్ అదా.. ముద్దులొలికే ఐదేళ్ల పాప. ఇరుగు పొరుగు అందరూ ఆమెను అదా రాణి అని పిలుస్తారు. అలా పిలిపించుకోవడం ఆమెకు చాలా ఇష్టం. ఈ నెల 3న అదా సోదరుడు అలీ ఏడో జన్మదినం. ఈ వేడుకను ఇంట్లోనే ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం కేక్ కట్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. చిన్నారి అదా రాణి తనకెంతో ప్రీతిపాత్రమైన బార్బీ డ్రెస్ ధరించింది. తనను తాను బుల్లి యువరాణిగా ఊహించుకుంటూ తలపై కిరీటం కూడా పెట్టుకుంది. బుడిబుడి నడకలు నడుస్తూ చిరునవ్వులు చిందిస్తూ అందంగా మెరిసిపోతున్న పాపను చూసి విధికి కూడా కన్నుకుట్టిందో ఏమో! ఇంతలో చిరుతపులి రూపంలో మృత్యువు హఠాత్తుగా వారి ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించింది. పాపను నోట కరుచుకొని సమీపంలోని చిట్టడవిలోకి పరుగులు తీసింది.
చిన్నారి అమ్మానాన్న, ఇతర కుటుంబ సభ్యులంతా ఈ ఊహించని పరిణామంతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. వెంటనే తేరుకొని అడవిలో పాప కోసం గాలించారు. స్థానికులు, అటవీ అధికారులు కూడా ఈ గాలింపులో పాల్గొన్నారు. అడవిలో ఒకచోట కొన్ని మాంసం ముద్దలు, రక్తం మరకలు, పాప అడుకొనే ఒక బొమ్మ మాత్రమే కనిపించాయి. తమ గారాల పట్టి చిరుత పంజాకు బలైపోవడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ శివారులో ఈ విషాదం చోటుచేసుకుంది. జనాభా విపరీతంగా పెరుగుతుండడం, అడవుల విస్తీర్ణం భారీగా తగ్గుతుండడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు.
జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ శివారులో ఓంపురా ప్రాంతంలోని ‘మిర్ హౌస్’లో చోటుచేసుకున్న విషాదాంతం ప్రతి ఒక్కరినీ కలచి వేస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. చిన్నారి అదా రాణి మరణం పట్ల జనం సంతాపం వ్యక్తం చేస్తూ సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఇంటి సమీపంలో ఉండేవారంతా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. బాలిక జ్ఞాపకాలను గుర్తుచేసుకొని కంటతడి పెడుతున్నారు. అప్పటివరకు తన అమ్మమ్మ ఇంట్లో ఉన్న చిన్నారి తన అన్న అలీ పుట్టినరోజు వేడుక కోసం తమ ఇల్లు మీర్ హౌస్‌కు వచ్చిందని, పై అంతస్తులో ముస్తాబైన తర్వాత కిందకు వచ్చి లాన్‌లో ఆడుకుంటుండగా చిరుత ఎత్తుకుపోయిందని ఆమె మామ ఐజాజ్ అహ్మద్ చెప్పారు. ఈ నెల 5న చిన్నారి అంత్యక్రియలు పూర్తి చేశారు. ముద్దుల పాపకు కన్నీటి వీడ్కోలు పలికారు.
‘‘స్వర్గం ఇప్పుడు మరింత అందమైన ప్రాంతంగా మారి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడక్కడ అదా రాణి ఉంది కదా’’ అని నెటిజన్ ఒకరు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పాప తండ్రి ముదాసిర్ థాయ్‌ల్యాండ్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. కరోనా వ్యాప్తి వల్ల గత ఏడాది ఇండియాకు తిరిగి వచ్చాడు. అదా రాణి శ్రీనగర్‌లోని డీపీఎస్ స్కూల్‌లో చదువుతోంది. చిరుత పులి దాడిలో ఆమె మరణం పట్ల సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నారి మరణాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ పలువురు ఫారెస్టు అధికారులను సస్పెండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment