తనకు వచ్చిన కరెంట్ బిల్లు చూపుతోన్న వృద్ధుడు గణ్‌పత్ నాయక్
ముంబై: సామాన్యంగా కరెంట్ బిల్లు వందల్లో వస్తుంది. వేసవికాలంలో ఏసీలు, కూలర్‌లు వినియోగించడంతో వేలల్లో వస్తుంది. సామాన్యులు వందల్లోపు ఉండే కరెంట్ బిల్లు కట్టడానికే ఇబ్బంది పడతారు. అలాంటిది ఏకంగా కోట్లలో కరెంట్ బిల్లు వస్తే.. గుండె ఆగిపోతుంది. తాజగా ఇలాంటి ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. కరెంట్ బిల్లు చూసి ఆ వృద్ధుడికి నిజంగానే షాక్ తగిలింది. బీపీ పెరిగి పడిపోయాడు. దాంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నలసోపారా టౌన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాలు.. గణ్‌పత్ నాయక్(80) అనే వృద్ధుడు నలసోపార్ టౌన్‌లోని నిర్మల్ గ్రామంలో రైస్ మిల్లు నడుపుతున్నాడు. ఈ క్రమంలో వచ్చిన కరెంట్ బిల్లు చూసి అతడికి నిజంగానే షాక్ తగిలింది. వేలల్లో కాదు ఏకంగా కోట్లల్లో కరెంట్ బిల్లు వచ్చింది. 80 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు చూసి అతడి బీపీ పెరిగింది. కింద పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎంఎస్‌ఈడీసీఎల్) స్పందించింది. ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమని.. తర్వలోనే బిల్లును సరి చేస్తామన్నారు. మీటర్ రీడింగ్ తీసుకునే ఏజెన్సీ చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది అని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యుత్ బోర్డు అధికారి సురేంద్ర మోనెరే మాట్లాడుతూ.. ‘‘ఏజెన్సీ ఆరు అంకెలకు బదులుగా తొమ్మిది అంకెల బిల్లును తయారు చేసింది. మేము అతడి విద్యుత్ మీటర్‌ను అధ్యయనం చేసి వారికి ఆరు అంకెల కొత్త బిల్లును ఇచ్చాము’’ అని తెలిపారు.
ఈ సందర్భంగా గణ్‌పత్ నాయక్ మనవడు నీరజ్ మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లు వచ్చినప్పుడు అక్కడ పని చేస్తున్న వారు దాన్ని చూసి షాక్ అయ్యారు అని తెలిపాడు. ‘‘ఈ బిల్లు చూసిన వెంటనే మొత్తం జిల్లాకు సంబంధించిన కరెంట్ బిల్లును మాకే పంపించారేమో అనుకున్నాం. దీని గురించి చెక్ చేయడంతో అది మా ఒక్కరి కరెంట్ బిల్లే అని తెలిసింది. విద్యుత్ బోర్టు లాక్‌డౌన్ కాలానికి సంబంధించి ప్రతి ఒక్కరి నుంచి బకాయిలు వసూలు చేయడం ప్రారంభించింది. మా దగ్గర నుంచి ఈ మొత్తం వసూలు చేస్తుందా ఏంటి అని భయపడ్డాం" అన్నాడు నీరజ్.
చదవండి:
షాకిచ్చిన కరెంటు బిల్లు.. నోటమాట రాలేదు..
ఏంది సార్ ఆ కరెంటు బిల్లు?: హీరో
Comments
Please login to add a commentAdd a comment