ఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది శ్రీలంక. తినడానికి సరైన తిండి దొరకని పరిస్థితులో జీవనం వెళ్లదీస్తున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికే పలు విధాలుగా సాయం అందించింది భారత్. శ్రీలంకలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభంపై చర్చించేందుకు మరోమారు అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. వచ్చే మంగళవారం ఈ సమావేశం ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు.
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఆల్‌పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అనంతరం శ్రీలంక సంక్షోభంపై అఖిల పక్ష సమావేశం అంశాన్ని వెల్లడించారు జోషీ. శ్రీలంక పరిస్థితులపై భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతారని చెప్పారు. శ్రీలంక సంక్షోభంలో భారత్ కలుగజేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కోరినట్లు తెలిపారు.
గొటబయ రాజపక్స రాజీనామా చేసిన క్రమంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం ప్రక్రియ ప్రారంభించింది శ్రీలంక పార్లమెంట్. ఈనెల 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం అఖిల పక్ష భేటీకి పిలుపునివ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తమకు సాయం చేసిన ఏకైక దేశం భారత్ మాత్రమేనని శ్రీలంక మంత్రి ఒకరు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అమెరికాలో 'గొటబయ' కుమారుడి ఇంటి ముందు ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment