తన మనుగడను కొనసాగించేందుకు ప్రతీ జీవి సంతానోత్పత్తి చేస్తుంది. మనిషి జన్మించక మునుపు 9 నెలలు తల్లి గర్భంలో ఉంటాడు. అయితే కొన్ని జంతువులు ఏళ్ల తరబడి గర్భాన్ని మోసి పిల్లలకు జన్మనిస్తాయి. అటువంటి జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గాడిదను చాకిరీకి గుర్తుగా చెబుతారు. పూర్వం రోజుల్లో గాడిదను రవాణాకు, బరువులు మోసేందుకు విరివిగా వినియోగించేవారు. ఇది 12 నెలల పాటు గర్భాన్ని మోసి, పిల్లకు జన్మనిస్తుంది.
ఎడారి ఓడగా పేరుగాంచిన ఒంటె చాలాకాలం పాటు నీటిని తాగకపోయినా బతుకుతుంది. ఇది 13 నుంచి 15 నెలల పాటు గర్భం మోస్తుంది. సుమారు 410 రోజుల తరువాత పిల్లకు జన్మనిస్తుంది.
పొడవైన మెడ కలిగిన జిరాఫీ చూపరులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ఇది 13 నుంచి 16 నెలల పాటు గర్భాన్ని మోస్తుంది. అనంతరం పిల్లకు జన్మనిస్తుంది. పుట్టినప్పుడు దాని పిల్ల కూడా పొడవుగా ఉండటం విశేషం.
ఖడ్గమృగం చూడటానికి ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇది 15 నుంచి 16 నెలల పాటు గర్భాన్ని మోస్తుంది. తెల్ల ఖడ్గమృగాలు 16 నుంచి 18 నెలల పాటు గర్భాన్ని మోస్తాయి.
ఏనుగు దీర్ఘకాలం పాటు గర్భధారణ కలిగివుంటుంది. ఇది గర్భాన్ని ధరించిన 680 రోజులకు పిల్లకు జన్మనిస్తుంది. దీర్ఘకాలం పాటు గర్భధారణ కలిగివుండే జంతువులలో ఏనుగు ముందు వరుసలో నిలుస్తుంది.
ఇది కూడా చదవండి: పొరుగింటిలో 34 పెంపుడు కుక్కలు వీరంగమాడుతున్నాయని..
Comments
Please login to add a commentAdd a comment