
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి , కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ల భేటీ ముగిసింది. పోలవరం ప్రాజెక్ట్ను సత్వరం పూర్తి చేయడానికి తగిన సాయం చేయాల్సిందిగా భేటీలో మంత్రిని కోరారు. బుధవారం జల శక్తి మంత్రితో భేటీ అయిన సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను ఆమోదించాలని విన్నవించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం, 55,656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్ చేయాల్సిందిగా కోరారు. 2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. 44,574 కుటుంబాల నుంచి 1,06,006కు పెరిగిందని, అలాగే ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్న సీఎం.. దీనివల్ల ఆర్ అండ్ ఆర్‌కోసం పెట్టాల్సిన ఖర్చు భారీగా పెరిగిందన్నారు. (చదవండి: వడివడిగా.. అన్నీ పరిశీలిస్తూ)
పోలవరం నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా 1779 కోట్ల రూపాయలను రియింబర్స్ చేయాల్సి ఉందని సీఎం జగన్ భేటీలో వెల్లడించారు. 2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈబిల్లులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఖర్చు ఇంకా పెరిగిపోతుందని, ఏపీకి ప్రాణాధారమైన ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీఎం జగన్ అభ్యర్థనలపై షెకావత్ సానుకూలంగా స్పందించారు. అలానే నదుల అనుసంధానంపై ఏపీతో చర్చించాలని.. జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్‌ను షెకావత్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై చర్చించేందుకు.. ఏపీకి రావాలని జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్‌ను సీఎం జగన్ ఆహ్వానించారు.