శుభాంశు వచ్చేశాడు  | Astronaut Shubhanshu Shukla Returns Home And Receives Grand Welcome In Delhi, Video Goes Viral | Sakshi
Sakshi News home page

శుభాంశు వచ్చేశాడు 

Aug 17 2025 7:07 AM | Updated on Aug 18 2025 6:28 AM

Astronaut Shubhanshu Shukla Returns Home Video

ఐఎస్‌ఎస్‌ వీరునికి అపూర్వ స్వాగతం 

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో పాదం మోపిన తొలి భారతీయునిగా సరికొత్త చరిత్ర సృష్టించిన వాయుసేన గ్రూప్‌ కెప్టెన్, వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి రెండు గంటలు దాటాక ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్లా భార్య కామ్నా, కుమారుడు కియష్‌తో పాటు అసంఖ్యాకులైన అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఇస్రో ఛైర్మన్‌ వి.నారాయణన్, పలువురు ఉన్నతాధికారులు ఎదురెళ్లి మరీ కరతాళ ధ్వనుల మధ్య శుభాంశును విమానాశ్రయం నుంచి బయటకు తీసుకొచ్చారు. 

త్రివర్ణ పతాకాలను చేబూని నినాదాలతో హోరెత్తించిన అభిమానులకు ఆయన చిరునవ్వుతో అభివాదం చేశారు. డప్పుచప్పుళ్లు, జయజయధ్వానాలతో పండుగ వాతావరణం నెలకొంది. ‘‘స్వదేశానికి తిరిగిరావడం ఎంతో సంతోషంగా ఉంది. మీరంతా ఇంతటి సాదర స్వాగతం పలకినందుకు కృతజ్ఞతలు’’ అని కేంద్ర మంత్రిని ఉద్దేశిస్తూ శుక్లా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాంశు జూన్‌ 25న అంతరిక్షంలోకి వెళ్లడం, ఆ మర్నాడు ఐఎస్‌ఎస్‌కు చేరుకోవడం తెలిసిందే. అక్కడ 18 రోజులపాటు ఆయన 20 ప్రత్యేక కార్యక్రమాలు, 60కి పైగా ప్రయోగాలుచేశారు. 

జూలై 15న భూమికి చేరుకున్నారు. నాసా క్వారంటైన్‌లో గడిపి తాజాగా స్వదేశం చేరారు. శుభాంశు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. అనంతరం సొంతూరు లఖ్‌నవూ వెళ్తారు. తర్వాత 22, 23వ తేదీల్లో ఢిల్లీలో జాతీయ అంతరిక్ష దినోత్సవాలో పాల్గొంటారు. శుభాంశు దిగ్విజయ అంతరిక్ష యాత్రపై సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement