ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధవిమానాల తయారీసంస్థ డసాల్ట్ ఏవియేషన్ నుంచి భారత్ ‘రఫేల్’జెట్ విమానాలను కొనుగోలు చేసిన వ్యవహారం మళ్లీ పతాక శీర్షికలకెక్కింది. మీ హయాంలోనే అవినీతి జరిగిందంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం మళ్లీ మొదలుపెట్టాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలం(2007–12)లో సుశేన్ మోహన్ గుప్తా అనే మధ్యవర్తికి 75 లక్షల యూరోలు(దాదాపు రూ.65 కోట్లు) ముడుపులుగా అందాయని ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధనాత్మక జర్నల్ ‘మీడియాపార్ట్’తాజాగా బహిర్గతం చేయడం బీజేపీకి కొత్త విమర్శనాస్త్రంగా మారింది. యూపీఏ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి 36 ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం 2016 సెప్టెంబర్‌లో రూ.59వేల కోట్లతో మోదీ సర్కార్, డసాల్ట్ ఏవియేషన్ మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెల్సిందే.
‘ఐ నీడ్ కమిషన్(ఐఎన్‌సీ)గా మార్చుకోండి: బీజేపీ ఎద్దేవా
న్యూఢిల్లీ: ‘రఫేల్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన ముడుపుల చెల్లింపులు మీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. బహూశా ఈ చెల్లింపుల నగదు మొత్తాలతో కాంగ్రెస్, గాంధీల కుటుంబాలు సంతృప్తి చెందలేదేమో. అందుకే కాంగ్రెస్ హయాంలో కొనుగోలు చర్చలు విఫలమయ్యాయి’అని కాంగ్రెస్‌పై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తీవ్ర విమర్శలు చేశారు. మీడియాపార్ట్ కథనం నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ముడుపులు తీసుకునే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్‌సీ) పేరును ఇకపై ఐ నీడ్ కమిషన్(ఐఎన్‌సీ)గా మార్చాలి. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రా అందరూ కమిషన్లు అడిగేవారే ’అని సంబిత్ విమర్శించారు. రఫేల్ కొనుగోళ్లలో మోదీ సర్కార్ అవినీతికి పాల్పడిందంటూ ఇన్నాళ్లూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలు, చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలు అని మీడియాపార్ట్ కథనంతో తేలిపోయిందని సంబిత్ స్పష్టంచేశారు.
మీడియాపార్ట్ తాజాగా వెల్లడించిన వాస్తవాలపై రాహుల్ మాట్లాడాల్సిందేనని సంబిత్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతిపై మీ ప్రభుత్వమెందుకు దర్యాప్తు చేయలేదు? అన్న మీడియా ప్రశ్నకు సంబిత్ సమాధానమిచ్చారు. ‘ఆ మధ్యవర్తి సుశేన్ గుప్తాను ఇదివరకే అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్‌చేసింది. ఈ అంశాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకోవాలి’అని ఆయన అన్నారు. ‘మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదు. సుప్రీంకోర్టు, కాగ్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి కూడా’అని ఆయన చెప్పారు.
మీరెందుకు దర్యాప్తు చేయట్లేదు?: కాంగ్రెస్ ఎదురుదాడి
కాంగ్రెస్ హయాంలోనే ముడుపులు చేతులు మారాయన్న బీజేపీ వాదనలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ‘అదే వాస్తవమైతే బీజేపీ హయాంలో కేసు దర్యాప్తు ఎందుకు చేయలేకపోయారు? నిజాలను దాచే ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది’అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ‘రహస్య కమిషన్లు అందాయని 2018లోనే సీబీఐ, ఈడీలకు సమాచారం ఉంది. అయినా ఆ దర్యాప్తు సంస్థలు దర్యాప్తునకు ఎందుకు మొగ్గుచూపలేదు? 2018లోనే అవినీతిపై ఇద్దరు బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, ఒక సీనియర్ లాయర్ సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కానీ, కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకే బీజేపీ సర్కార్.. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను రాత్రికి రాత్రి పదవి నుంచి తొలగించింది. తమ అవినీతి బయటపడుతుందనే కేంద్రం దర్యాప్తునకు ఆదేశించలేదు. బీజేపీ ‘ఆపరేషన్ కవర్ అప్’కొనసాగిస్తోంది. అత్యంత ఎక్కువ ధరకు జెట్‌లను మోదీ సర్కార్ కొనుగోలుచేయడంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పర్యవేక్షణతో దర్యాప్తు జరిపించాలి. జేపీసీకి మోదీ సర్కార్ ఎందుకు భయపడుతోంది? ’అని ఖేరా ప్రశ్నించారు.
నిజం మనవైపే.. భయపడకండి: రాహుల్
అవినీతిమయ మోదీ ప్రభుత్వంపై పోరులో భయపడాల్సిన పని లేదని కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ధైర్యం చెప్పారు. ‘ప్రతీ అడుగులో నిజం మనవైపే ఉన్నపుడు, మనం భయపడాల్సిన పనే లేదు. ‘ఆగకండి. అలసిపోకండి. భయపడకండి’అంటూ #RafaleScam హ్యాష్‌ట్యాగ్‌తో రాహుల్ గాంధీ మంగళవారం హిందీలో ట్వీట్‌చేశారు. రఫేల్ వివాదానికి జేపీసీ దర్యాప్తే అసలైన పరిష్కారమని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment