Rafale fighter jet
-
ఇంఫాల్ గగనతలంలో కలకలం.. రంగంలోకి రఫెల్
ఇంఫాల్: ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై గుర్తు తెలియని వస్తువు(యూఎఫ్ఓ)ను గాలించేందుకు భారత వాయుసేన రఫెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. హసిమారా నుంచి రెండు రఫెల్ విమానాలను ప్రయోగించింది. కానీ రఫెల్ విమానాలు ఆ అనుమానిత వస్తువును గుర్తించలేకపోయాయి. ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో తిరిగొచ్చాయని అధికారులు తెలిపారు. గగనతలంలో గుర్తుతెలియని వస్తువులు ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్‌వే పరిసరాల్లో ఎగురుతూ కనిపించినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు. అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ కమాండ్ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత ఆ వస్తువు కనిపించకుండా పోయిందని తెలిపారు. గుర్తు తెలియని వస్తువులను పసిగట్టడానికి వాయు సేన హషిమార నుంచి రఫెల్ యుద్ధ విమానాన్ని పంపించింది. అత్యాధునిక సెన్సార్లు కలిగిన ఈ విమానం అత్యంత ఎత్తులో గాలించినప్పటికీ ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో వెనక్కి వచ్చింది. కాసేపటికీ మరో రఫెల్‌ను అధికారులు పంపించారు. అప్పుడు కూడా ఎలాంటి వస్తువు కనిపించకలేదని అధికారులు తెలిపారు. యూఎఫ్‌వో కారణంగా మూడు గంటల పాటు విమానరాకపోకలకు అంతరాయం కలిగింది. ఇదీ చదవండి: Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు -
మళ్లీ రచ్చకెక్కిన రఫేల్ గొడవ
ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధవిమానాల తయారీసంస్థ డసాల్ట్ ఏవియేషన్ నుంచి భారత్ ‘రఫేల్’జెట్ విమానాలను కొనుగోలు చేసిన వ్యవహారం మళ్లీ పతాక శీర్షికలకెక్కింది. మీ హయాంలోనే అవినీతి జరిగిందంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం మళ్లీ మొదలుపెట్టాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలం(2007–12)లో సుశేన్ మోహన్ గుప్తా అనే మధ్యవర్తికి 75 లక్షల యూరోలు(దాదాపు రూ.65 కోట్లు) ముడుపులుగా అందాయని ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధనాత్మక జర్నల్ ‘మీడియాపార్ట్’తాజాగా బహిర్గతం చేయడం బీజేపీకి కొత్త విమర్శనాస్త్రంగా మారింది. యూపీఏ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి 36 ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం 2016 సెప్టెంబర్‌లో రూ.59వేల కోట్లతో మోదీ సర్కార్, డసాల్ట్ ఏవియేషన్ మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెల్సిందే. ‘ఐ నీడ్ కమిషన్(ఐఎన్‌సీ)గా మార్చుకోండి: బీజేపీ ఎద్దేవా న్యూఢిల్లీ: ‘రఫేల్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన ముడుపుల చెల్లింపులు మీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. బహూశా ఈ చెల్లింపుల నగదు మొత్తాలతో కాంగ్రెస్, గాంధీల కుటుంబాలు సంతృప్తి చెందలేదేమో. అందుకే కాంగ్రెస్ హయాంలో కొనుగోలు చర్చలు విఫలమయ్యాయి’అని కాంగ్రెస్‌పై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తీవ్ర విమర్శలు చేశారు. మీడియాపార్ట్ కథనం నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ముడుపులు తీసుకునే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్‌సీ) పేరును ఇకపై ఐ నీడ్ కమిషన్(ఐఎన్‌సీ)గా మార్చాలి. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రా అందరూ కమిషన్లు అడిగేవారే ’అని సంబిత్ విమర్శించారు. రఫేల్ కొనుగోళ్లలో మోదీ సర్కార్ అవినీతికి పాల్పడిందంటూ ఇన్నాళ్లూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలు, చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలు అని మీడియాపార్ట్ కథనంతో తేలిపోయిందని సంబిత్ స్పష్టంచేశారు. మీడియాపార్ట్ తాజాగా వెల్లడించిన వాస్తవాలపై రాహుల్ మాట్లాడాల్సిందేనని సంబిత్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతిపై మీ ప్రభుత్వమెందుకు దర్యాప్తు చేయలేదు? అన్న మీడియా ప్రశ్నకు సంబిత్ సమాధానమిచ్చారు. ‘ఆ మధ్యవర్తి సుశేన్ గుప్తాను ఇదివరకే అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్‌చేసింది. ఈ అంశాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకోవాలి’అని ఆయన అన్నారు. ‘మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదు. సుప్రీంకోర్టు, కాగ్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి కూడా’అని ఆయన చెప్పారు. మీరెందుకు దర్యాప్తు చేయట్లేదు?: కాంగ్రెస్ ఎదురుదాడి కాంగ్రెస్ హయాంలోనే ముడుపులు చేతులు మారాయన్న బీజేపీ వాదనలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ‘అదే వాస్తవమైతే బీజేపీ హయాంలో కేసు దర్యాప్తు ఎందుకు చేయలేకపోయారు? నిజాలను దాచే ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది’అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ‘రహస్య కమిషన్లు అందాయని 2018లోనే సీబీఐ, ఈడీలకు సమాచారం ఉంది. అయినా ఆ దర్యాప్తు సంస్థలు దర్యాప్తునకు ఎందుకు మొగ్గుచూపలేదు? 2018లోనే అవినీతిపై ఇద్దరు బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, ఒక సీనియర్ లాయర్ సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కానీ, కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకే బీజేపీ సర్కార్.. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను రాత్రికి రాత్రి పదవి నుంచి తొలగించింది. తమ అవినీతి బయటపడుతుందనే కేంద్రం దర్యాప్తునకు ఆదేశించలేదు. బీజేపీ ‘ఆపరేషన్ కవర్ అప్’కొనసాగిస్తోంది. అత్యంత ఎక్కువ ధరకు జెట్లను మోదీ సర్కార్ కొనుగోలుచేయడంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పర్యవేక్షణతో దర్యాప్తు జరిపించాలి. జేపీసీకి మోదీ సర్కార్ ఎందుకు భయపడుతోంది? ’అని ఖేరా ప్రశ్నించారు. నిజం మనవైపే.. భయపడకండి: రాహుల్ అవినీతిమయ మోదీ ప్రభుత్వంపై పోరులో భయపడాల్సిన పని లేదని కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ధైర్యం చెప్పారు. ‘ప్రతీ అడుగులో నిజం మనవైపే ఉన్నపుడు, మనం భయపడాల్సిన పనే లేదు. ‘ఆగకండి. అలసిపోకండి. భయపడకండి’అంటూ #RafaleScam హ్యాష్‌ట్యాగ్‌తో రాహుల్ గాంధీ మంగళవారం హిందీలో ట్వీట్‌చేశారు. రఫేల్ వివాదానికి జేపీసీ దర్యాప్తే అసలైన పరిష్కారమని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. -
చైనా, పాక్‌లతో యుద్ధానికి సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆయుధ శ్రేణిలో రఫేల్ యుద్ధ విమానాలు చేరడంతో ప్రత్యర్ధులపై మనం పైచేయి సాధించామని, తొలిసారిగా ప్రభావవంతంగా దాడిచేసే సామర్థ్యం అందివచ్చిందని వైమానిక దళం చీఫ్ ఆర్కేఎస్ భదూరియా అన్నారు. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్లతో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఇరు దేశాలతో ఏకకాలంలో యుద్ధం చేసేందుకు సిద్థమని ఆయన స్ప్టష్టం చేశారు. లడఖ్‌లో చైనా దూకుడును ఈ ఏడాది మేలోనే తాము గుర్తించామని, అప్పటినుంచి మన సైనం, వైమానిక దళం వేగంగా స్పందిస్తున్నాయని భదూరియా పేర్కొన్నారు. చదవండి : రఫేల్ రాక.. చైనాకు స్ట్రాంగ్ కౌంటర్ సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా సేనలు మోహరించి విస్తృతంగా సైనిక విన్యాసాలు చేపడుతున్నాయని చెప్పారు. పలు అంశాల్లో పాకిస్తాన్ చైనాపై ఆధారపడుతోందని చెప్పుకొచ్చారు. యుద్ధం వస్తే భారత్‌పై చైనా పైచేయి సాధించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లడఖ్ సహా కీలక ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించిందని, పాక్-చైనాలతో తలపడేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు భారీగా సేనలను మోహరించామని వెల్లడించారు. కాగా ఐదు రాఫేల్ యుద్ధవిమానాలు సెప్టెంబర్ 10న భారత వాయుసేన అమ్ములపొదిలో చేరిన సంగతి తెలిసిందే. -
జూలై 27 నాటికి ‘రఫేల్’ రాక!
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల సరఫరా త్వరలో మొదలు కానుంది. తొలి దశలో భాగంగా జూలై 27 నాటికి ఆరు రఫేల్ యుద్ధవిమానాలు అందనున్నాయని భారత వాయుసేన వర్గాల ద్వారా తెలిసింది. సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో రఫేల్ యుద్ధ విమానాల రాక వాయుసేన నైతిక స్థైర్యాన్ని పెంచేదేనని ఆ వర్గాలు తెలిపాయి. దేశంలోనే అత్యంత వ్యూహాత్మక వాయుసేన స్థావరంగా భావించే అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో రఫేల్ యుద్ధవిమానాలు ఉంటాయని సమాచారం. భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016 సెప్టెంబరులో రూ.58,000 కోట్లతో ఒక ఒప్పందం చేసుకోవడం తెల్సిందే. కోవిడ్ నేపథ్యంలో వీటి సరఫరా ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఈ నెల రెండవ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో ఫోన్లో మాట్లాడారు. సకాలంలో యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని రాజ్‌నాథ్‌కు పార్లే హామీ ఇచ్చినట్లు సమాచారం. రఫేల్ యుద్ధ విమానాలు అత్యాధునిక ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. యూరోపియన్ క్షిపణి తయారీ సంస్థ ఎంబీడీఏ తయారు చేసే మిటియోర్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణితోపాటు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు రఫేల్‌లోని ముఖ్యమైన ఆయుధాలు. దీంతోపాటు ఇజ్రాయెల్ తయారీ హెల్మెట్లు, రాడార్ వార్నింగ్ రిసీవర్లు, లోబ్యాండ్ జామర్లు, పది గంటల ఫ్లయిట్ డేటా రికార్డింగ్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్స్ వంటివి భారత్ కోసం ప్రత్యేకంగా చేర్చారు. రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి భారత్ ఇప్పటికే పైలెట్ల శిక్షణ మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను పూర్తి చేసింది. తొలి దఫా సరఫరా కానున్న యుద్ధ విమానాలు అంబాలా కేంద్రంగా పనిచేయనుండగా రెండో దఫా సరఫరా అయ్యేవాటిని పశ్చిమ బెంగాల్‌లోని హసిమార వైమానిక కేంద్రంలో ఉంచేందుకు రూ.400 కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన విమానాల్లో 30 యుద్ధ విమానాలు కాగా ఆరు శిక్షణ విమానాలు. -
జూలై నెలాఖరులోగా 6 రఫెల్ జెట్ ఫైటర్లు
సాక్షి, న్యూ ఢిల్లీ: భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వాయుసేన యుద్ధ విమానాలను సమకూర్చుకోడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన రఫెల్ యుద్ద విమానాలను జూలై నెలాఖరులోగా వాయుసేన పొందనున్నట్లు తెలుస్తోంది. పరిస్థిలను బట్టి ఐఎఎఫ్ పైలెట్లు ఫ్రాన్స్‌లో తీసుకుంటున్న శిక్షణ అనంతరం పూర్తి స్థాయిలో తయారు చేయబడిన ఆరు రఫెల్ యుద్ధ విమానులను భారత్ ఎయిర్ ఫోర్స్(ఐఎఎఫ్) పొందనుంది. నాలుగు రఫెల్ జెట్ విమానాల్లో మూడు ట్విన్ సీటర్ వెర్షన్‌కి సంబంధించిన పైలెట్లు అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో శిక్షణ పొందుతున్నారు. భారత్‌లో ఇది మొదటి రఫెల్ జెట్ విమానాల ఎయిర్ బేస్. రెండో రఫెల్ ఎయిర్ బేస్ పశ్చిమ బెంగాల్‌లోని హషిమారాలో ఉన్నది. (‘చైనా, పాక్ కుట్రను అప్పట్లోనే బయటపెట్టారు’) చైనా సరిహద్దులో ఉద్రిక్తత, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే నేపథ్యంలో ఈ యుద్ధ విమానాలు భారత్‌కు చేరనున్నాయి. రఫెల్ యుద్ధ విమానాలు జూలై నెలాఖరులో భారత్ చేరుతాయని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. అదే విధంగా మొదటి ఎయిర్ ఫోర్స్ పైలెట్ల బృందం ట్రైనింగ్ పూర్తి కాగా, రెండో పైలెట్ల బృందం శిక్షణ లాక్డౌన్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2016లో భారత్.. 36 రఫెల్ యుద్ద విమానాలకు సంబంధించి ఫ్రాన్స్‌తో రూ.60 వేల కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. -
భారత్ చేతికి మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: భారత్ చేతికి ఇప్పటి వరకూ మూడు రాఫెల్ యుద్ధ విమానాలు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం భారత వాయు సేన సిబ్బందికి (ఐఏఎఫ్) ఫ్రాన్స్‌లో శిక్షణ అందుతోందని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా రక్షణ శాఖ సహాయక మంత్రి శ్రీపాద్ నాయక్ బుధవారం చెప్పారు. తొలి విమానాన్ని రాజ్‌నాథ్ అక్టోబర్ 8న స్వీకరించారు. రాఫెల్ విమానాలను ఫ్రాన్స్‌లోని డసోల్ట్ ఏవియేషన్ తయారు చేస్తోంది. ప్రస్తుతం భారత్ అందుకున్న 3 విమానాల్లో చివరి రెండు ఎప్పుడు అందుకున్నదన్న విషయాన్ని ఆయన చెప్పలేదు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో కేంద్ర ప్రభుత్వం 2016లో దాదాపు రూ.59 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొదటి బ్యాచ్‌కు చెందిన 4 రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే ఏడాది మే నెలలో మన దేశానికి రానున్నాయి. -
రఫెల్ అంశంలో కేంద్రానికి ఊరట
-
‘అది మన ఆచారం.. పాటిస్తే తప్పేంటి’
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానం స్వీకరించిన అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దానికి ఆయుధ పూజ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే రాజ్‌నాథ్ చర్యల పట్ల ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలపై స్పందించారు రాజ్‌నాథ్ సింగ్. ‘జనాలు తమకు నచ్చినట్లు మాట్లాడతారు. నేను చేసే పని సరైంది అని నాకు అనిపించినప్పుడు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పనిని నేను కొనసాగిస్తాను. ఓ గొప్ప అతీతశక్తి ఉందని చిన్నతనం నుంచి నేను నమ్ముతాను. నాతో పాటు దేశంలో చాలా మంది దీన్ని విశ్వసిస్తారు. మన దేశంలో వాహనాలు, ఆయుధాలు కొన్న తర్వాత పూజ నిర్వహించడం.. దానిపై ఓంకారాన్ని రాయడం పరిపాటి. ఇది మన ఆచారం. అదే నేను చేశాను. నచ్చిన దైవాన్ని ప్రార్థించే హక్కు రాజ్యాంగమే మనకు కల్పించింది. ఈ విషయంలో ఎవరి విమర్శలు పట్టించుకోను’ అని స్పష్టం చేశారు. భారత్, ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమనాలు కొనుగోలు చేస్తోన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2021నాటికి ఫ్రాన్స్ 18 రఫేల్ యుద్ధ విమానాలను భారతకు అందజేస్తుంది. మే 2022 నాటికి దేశం మొత్తం మీద 36 రఫేల్ జెట్లు ఉండబోతున్నాయి. (చదవండి: ‘ఏ దేశంపై దాడి చేసే ఉద్దేశం లేదు’) -
రఫేల్‌తో పెరిగిన వాయుసేన సామర్థ్యం
ప్యారిస్: రఫేల్ యుద్ధ విమానాల చేరికతో భారతీయ వాయుసేన యుద్ధ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని, శత్రుదేశాలు దాడులకు తెగబడకుండా ఉండేందుకు, తమని తాము రక్షించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఫ్రాన్స్ నుంచి తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని రాజ్‌నాథ్ మంగళవారం లాంఛనంగా అందుకున్నారు. శస్త్ర పూజ పేరుతో యుద్ధ విమానానికి పూజలు చేసిన తరువాత ఆయన సుమారు 25 నిమిషాలపాటు రఫేల్ విమానంలో చక్కర్లు కొట్టారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాత్మకంగా వ్యవహరించిన కారణంగానే ఇదంతా సాధ్యమైందని అన్నారు. భారత్... మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొదటివిడత 18 విమానాలు 2021 నాటికి, మిగిలినవి 2022 ఏప్రిల్, మే నెల నాటికి అందుతాయని అంచనా. రఫేల్ యుద్ధ విమానాల్లో భారత వాయుసేన నిర్దిష్టంగా ప్రతిపాదించిన 13 ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఫలవంతమైన చర్చలు.. రక్షణ రంగంలో భారత్, ఫ్రాన్స్‌లు పరస్పరం సహకరించుకునే విషయంలో తాము ఆ దేశ రక్షణ మంత్రితో జరిపిన చర్చలు ఫలవంతమైనట్లు రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. బుధవారం ఫ్రెంచ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కేంద్ర కార్యాలయంలో రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో చర్చలు జరిపారు. -
రఫేల్‌తో బలీయ శక్తిగా ఐఏఎఫ్
పారిస్: అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల చేరికతో భారత వైమానిక దళ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని యూరోప్‌కు చెందిన క్షిపణి తయారీ సంస్థ ఏంబీడీఏ పేర్కొంది. తాము తయారు చేసిన మెటియొర్, స్కాల్ప్ క్షిపణులను రఫేల్ యుద్ధ విమానాలు ప్రయోగించగలవంది. ‘ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలపైకి మెరుపువేగంతో, కచ్చితత్వంతో దాడి చేయగల మెటియొర్, ఆకాశం నుంచి భూమిపై సుదూర లక్ష్యాలను ఛేదించగల స్కాల్ప్ క్షిపణులు భారత వైమానిక దళాన్ని మరింత శక్తిమంతం చేస్తాయి. ఈ సామర్థ్యం భారత్‌కు గతంలో లేదు’ అని ఎంబీడీఏ ఇండియా చీఫ్ పీడ్వాచ్ వ్యాఖ్యానించారు. ‘రఫేల్ అద్భుతమైన యుద్ధ విమానం. ఇది ఆధునిక ఆయుధ శ్రేణితో ఉంది. ఈ ఒప్పందంలో మేం కూడా భాగస్వాములం కావడం సంతోషకరం’ అన్నారు. ఫ్రాన్స్ నుంచి రూ. 58 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధవిమానాలను భారత్ కొనుగోలు చేస్తుండటం తెలిసిందే. అందులో తొలి విమానాన్ని మంగళవారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్స్ మిలటరీ అధికారుల నుంచి స్వీకరించనున్నారు. కంటికి కనిపించని లక్ష్యాలను ఛేదించడంలో మెటియొర్ క్షిపణి సామర్థ్యం అమోఘమని పీడ్వాచ్ పేర్కొన్నారు. అలాగే, లక్ష్యాల ఛేదనలో స్కాల్ప్‌కు తిరుగులేదని కితాబిచ్చారు. ఈ రెండు క్షిపణులతో కూడిన రఫే ల్ చేరికతో భారత వైమానిక దళం ప్రాంతీయంగా బలీయ శక్తిగా మారుతుందన్నారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మెటియొర్ కచ్చితత్వంతో పనిచేస్తుందని, ఫైటర్ జెట్స్ నుంచి చిన్నవైన మానవ రహిత విమానాల వరకు అన్నింటినీ కచ్చితత్వంతో కూల్చివేయగలదన్నారు. ఆకాశం నుంచి ప్రయోగించి భూమిపై ఉన్న సుదూర లక్ష్యాలను ముందస్తు ప్రణాళికతో ఛేదించడంలో స్కాల్ప్ సామర్థ్యం తిరుగులేనిదన్నారు. భారత్ అవసరాలకు అనుగుణంగా రఫేల్‌లో మార్పులు చేశారు. ఫ్రాన్స్‌లో రాజ్‌నాథ్ ఆయుధ పూజ న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాలను స్వీకరించేందుకు ఫ్రాన్స్ వెళ్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. దసరా సందర్భంగా అక్కడే పారిస్‌లో ఆయుధ పూజ చేయనున్నారు. దసరా రోజు ఆయుధ పూజ చేయడం సంప్రదాయం. దసరాతో పాటు భారత వైమానిక దళ వ్యవస్థాపక దినోత్సవం కూడా కావడం విశేషం. రఫేల్ యుద్ధ విమానాన్ని స్వీకరించిన అనంతరం.. పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రాజ్‌నాథ్ అందులో ప్రయాణించనున్నారు. 36 యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని మంగళవారమే స్వీకరించినప్పటికీ.. తొలి నాలుగు రఫేల్ యుద్ధవిమానాలు భారత్‌కు వచ్చే ఏడాది మేలోనే వస్తాయి. రఫేల్‌ను భారత్‌కు అందించే కార్యక్రమంలో ఫ్రాన్స్ మిలటరీ ఉన్నతాధికారులు, డసో ఏవియేషన్ సీనియర్ అధికారులు పాల్గొంటారు. రూ. 58 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016లో ఒప్పందం కుదిరింది. పలు ఆధునిక ఆయుధాలు, క్షిపణులను ఈ యుద్ధవిమానం నుంచి ప్రయోగించవచ్చు. మొదట వచ్చే యుద్ధవిమానాలను అంబాలాలోని వైమానిక దళ స్థావరంలో మోహరించనున్నారు. -
యుద్ధవిమానాలతో సెల్ఫీ
మాంటే-డీ-మార్సన్: భారత్‌కు చెందిన యుద్ధవిమానం సుఖోయ్‌ని ఫ్రాన్స్ పైలట్ నడపగా, ఫ్రాన్స్ యుద్ధవిమానం రఫేల్‌ను భారత పైలట్ నడిపారు. అంతేనా ఈ ఇద్దరు పైలట్లు యుద్ధవిమానాలని నడుపుతూ దిగిన సెల్ఫీలను ఇరుదేశాల వైమానిక విభాగాలు ట్వీట్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నాయి. ఈ అరుదైన సంఘటన ఫ్రాన్స్‌లోని మాంటే-డీ-మార్సన్ ఎయిర్‌బేస్‌లో చోటుచేసుకుంది. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య జులై 1 నుంచి 14 వరకు గరుడ-6 పేరిట ఇరుదేశాలకు చెందిన యుద్ధ విమానాల సంయుక్త విన్యాసాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ అత్యున్నత యుద్ధవిమానం సుఖోయ్‌ని ఫ్రాన్స్ ఫైలట్ నడపగా, భారత్ కొనుగోలు చేస్తున్న రఫేల్‌ను భారత ఫైలట్ నడిపారు. ఈ విన్యాసాలు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఫ్రాన్స్ ఎయిర్‌ఫోర్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ విన్యాసాలలో భాగంగా ఇరుదేశాల మధ్య మంచి అవగాహన కుదిరిందని, తమ సామర్థ్యాలను మరింత మెరుగపర్చుకోవడానికి అవకాశం కలిగిందని పేర్కొంది. అంతేగాక రెండు దేశాల సైనికుల మధ్య కూడా వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఏర్పడ్డాయని తెలిపింది. భారత్, ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలుచేసిన విషయం తెలిసిందే. అయితే రఫేల్ కొనుగోలులో అవినీతి జరిగిందంటూ భారత్‌లో తీవ్ర రాజకీయదుమారం రేగినా ప్రభుత్వం రఫేల్‌ను కొనడానికే సిద్దపడింది. ఇప్పటికే భారత్ దగ్గర నాలుగు సుఖోయ్-30లను కలుపుకొని మొత్తం 124 యుద్దవిమానాలు ఉన్నాయి. ఇప్పుడు రఫేల్ వచ్చి చేరితే భారత వాయుసేన మరింత శక్తివంతం కానుంది. సెప్టెంబర్19 నాటికి తొలి రఫేల్‌ను భారత్‌కు ప్రాన్స్ ఇవ్వనుంది. మిగతా వాటిని రెండు సంవత్సరాలలోపు ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఈ విన్యాసాలు భారత్ ఫైటర్లకు రఫేల్‌పై అవగాహన కల్పిస్తాయని, అలాగే భారత ఫైటర్లకు అంతర్జాతీయ వాతావరణంపై అవగాహన కలగడమేగాక రష్యా తయారీ భారత సుఖోయ్‌ని యుద్ధ క్షేత్రంలో రఫేల్‌తో అనుసంధానించడంపై వీరికి నైపుణ్యం వస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రష్యా తయారీ అత్యున్నత యుద్ధ విమానం సుఖోయ్ భారత్ తరపున ఫ్రాన్స్ గగనతలంపై చక్కర్లు కొట్టడమేగాక, ఒక ఫ్రెంచ్ ఫైటర్ ఆ విమానాన్ని నడపడం ఆసక్తికరవిషయమని అంటున్నారు. -
రఫేల్ ప్లాంట్‌లో రక్షణ మంత్రి
పారిస్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రఫేల్ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. పారిస్ సమీపంలోని ఈ ఉత్పత్తి కేంద్రంలో ఫ్రెంచ్ కంపెనీ డసో ఏవియేషన్ తయారుచేసే విమానాలనే భారత్‌కు సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా డసో కంపెనీ ప్రతినిధులతో ముచ్చటించిన నిర్మలా సీతారామన్, విమానాల తయారీ పురోగతిని పరిశీలించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి పలు దశల్లో రఫేల్ విమానాలు భారత్‌కు అందుతాయి. అంతకుముందు, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో సమావేశమైన నిర్మలా సీతారామన్..ఇరు దేశాల వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంపై చర్చించారు. వీరి మధ్య రఫేల్ ఒప్పందం ప్రస్తావనకు వచ్చిందో? రాలేదో? తెలియరాలేదు. ఆగని విమర్శలు, ప్రతివిమర్శలు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అబద్ధాలకోరు, వదంతుల సృష్టికర్త అని బీజేపీ మండిపడింది. రఫేల్ ఒప్పందంపై ఆయన తరచూ చెబుతున్న అబద్ధాలు నిజాన్ని కప్పిపుచ్చలేవని పేర్కొంది. డసో ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..ఫ్రాన్స్ ప్రభుత్వం రాహుల్ మాటల్లోని డొల్లతనాన్ని బహిర్గతంచేసిందని, ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. మరోవైపు, బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. రఫేల్ ఒప్పందంపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, ఎవరు అబద్ధాలు చెబుతున్నారో అప్పుడే తెలుస్తుందని పేర్కొంది. గోయల్ చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా స్పందిస్తూ ‘వాస్తవాల ఆధారంగానే మేము ప్రశ్నలు అడిగాం. మీరు కూడా వాస్తవాలతో కూడిన సమాధానాలు ఇవ్వాలి. దేశానికి నిజాలు కావాలి. రాహుల్‌కు మీరు ఆపాదిస్తున్న విశేషణాలు కాదు. అప్పుడు ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధాలాడుతున్నారు? అన్నది ప్రజలు నిర్ణయిస్తారు’ అని అన్నారు. -
రఫేల్ ఫైటర్‌జెట్‌లో అనిల్ అంబానీ విహారం
యలహంక (బెంగళూరు): ఏరో ఇండియా–17 వైమానిక ప్రదర్శనలో రెండో రోజైన బుధవారం రిలయన్స్ గ్రూప్(అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీ ఫ్రాన్స్‌లో తయారైన అత్యాధునిక ఫైటర్‌జెట్ రఫేల్‌లో విహరించారు. ఆ యుద్ధ విమానంలో సుమారు అర్ధగంటపాటు ఆకాశంలో దూసుకెళ్లారు. రఫేల్‌లో విహారం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని అనిల్ చెప్పారు. -
59వేల కోట్లతో రఫెల్ జెట్ ఫైటర్స్
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి రఫెల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను త్వరలోనే కొనుగోలు చేయనున్నట్టు బీజేపీ తెలిపింది. ఈ వివరాలను బీజేపీ తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించింది. 8.8 బిలియన్ డాలర్లు(రూ.59,000 కోట్లు) కు డీల్ కుదిరిందని తెలిపింది. తాజా ఒప్పందంతో ప్రభుత్వానికి 3.2బిలియన్ డాలర్లు(రూ.21,000 కోట్లు) ఆదా అయినట్లు వెల్లడించింది. గతంలో 12బిలియన్ డాలర్లు(రూ.80,000 కోట్లు) కు రఫెల్ ఒప్పందం కుదిరింది. అనంతరం అనేకసార్లు బేరసారాలు జరిగాయి. చివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో 3.2బిలియన్ కోట్లు ఆదా అయినట్లు బీజేపీ తెలిపింది. రక్షణ శాఖ సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్ మాట్లాడుతూ.. 36 జెట్ విమానాల కొనుగోలుకు మార్గం సుగమమైందని త్వరలోనే ఈ ప్రతిపాదన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్పిల్(డాక్) ముందుకు వెళ్లనుందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ విమానాలను కొనుగోలు చేయాలనే ఒప్పందం (ఎంఓయూ) ఈ ఏడాది ప్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకొయిస్ హోలండ్ భారత పర్యటనలో ఉండగా ఖరారైంది. కాగా బీజేపీ వెల్లడించిన కొనుగోలు ఒప్పందం సంఖ్యలతో రక్షణ శాఖ విభేదించడం కొసమెరుపు. మరోవైపు విమానాల కొనుగోలు వివరాలను బీజేపీ ఫేస్ బుక్ ఖాతాలో ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.