రాజ్‌నాథ్ స్వీకరించిన విమానం ఇదే. ఆయుధ పూజ చేస్తున్న రాజ్‌నాథ్(ఇన్‌సెట్లో)
ప్యారిస్: రఫేల్ యుద్ధ విమానాల చేరికతో భారతీయ వాయుసేన యుద్ధ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని, శత్రుదేశాలు దాడులకు తెగబడకుండా ఉండేందుకు, తమని తాము రక్షించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఫ్రాన్స్ నుంచి తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని రాజ్‌నాథ్ మంగళవారం లాంఛనంగా అందుకున్నారు. శస్త్ర పూజ పేరుతో యుద్ధ విమానానికి పూజలు చేసిన తరువాత ఆయన సుమారు 25 నిమిషాలపాటు రఫేల్ విమానంలో చక్కర్లు కొట్టారు.
ఆ తరువాత ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాత్మకంగా వ్యవహరించిన కారణంగానే ఇదంతా సాధ్యమైందని అన్నారు. భారత్... మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొదటివిడత 18 విమానాలు 2021 నాటికి, మిగిలినవి 2022 ఏప్రిల్, మే నెల నాటికి అందుతాయని అంచనా. రఫేల్ యుద్ధ విమానాల్లో భారత వాయుసేన నిర్దిష్టంగా ప్రతిపాదించిన 13 ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
ఫలవంతమైన చర్చలు..
రక్షణ రంగంలో భారత్, ఫ్రాన్స్‌లు పరస్పరం సహకరించుకునే విషయంలో తాము ఆ దేశ రక్షణ మంత్రితో జరిపిన చర్చలు ఫలవంతమైనట్లు రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. బుధవారం ఫ్రెంచ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కేంద్ర కార్యాలయంలో రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో చర్చలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment