సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్నుకు సంబంధించి 2018-19 రిటర్న్స్ దాఖలుకు తుది గడువును ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) మరో రెండు నెలలు పొడిగించింది. ఈ మేరకు బుధవారం ఒక ట్వీట్ చేసింది. నిజానికి ఈ గడువు సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. కోవిడ్-19 నేపథ్యంలో రిటర్న్స్ దాఖలు విషయంలో కొన్ని అవరోధాలు ఏర్పడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది. గడువు పొడిగింపు ఇది నాల్గవసారి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి అసెస్‌మెంట్ ఇయర్ 2019–20 అవుతుంది. అంటే 2020 మార్చినాటికి 2018–19 ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనిని తొలుత జూన్ 30 వరకూ సీబీడీటీ పొడిగించింది. మళ్లీ జూలై 31 వరకూ పెంచింది. జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కొన్ని అధిక విలువలు కలిగిన లావాదేవీలు జరిగాయని పేర్కొంటూ, కొందరికి ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్‌ను పంపుతోంది.
జీఎస్‌టీ రిటర్న్స్ గడువు అక్టోబర్ 31 వరకూ...
మరోవైపు 2018-19 వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వార్షిక రిటర్న్స్, ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు (జీఎస్‌టీఆర్-9, జీఎస్‌టీఆర్ 9సీ) గడువును మరోనెల అంటే అక్టోబర్ 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు సీబీఐసీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్డ్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్) మరో ట్వీట్‌లో ప్రకటించింది. మేలో ఈ గడువును సీబీఐసీ మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్ వరకూ పొడిగించింది. కరోనా ప్రేరిత అంశాలు దీనికి నేపథ్యం.
Comments
Please login to add a commentAdd a comment