రిచ్‌ బెగ్గర్‌ భరత్‌ జైన్‌.. నెల సంపాదన ఎంతంటే? | Bharat Jain world Richest Beggar With 7 crore | Sakshi
Sakshi News home page

రిచ్‌ బెగ్గర్‌ భరత్‌ జైన్‌.. నెల సంపాదన ఎంతంటే?

Published Thu, Dec 12 2024 1:56 PM | Last Updated on Thu, Dec 12 2024 3:50 PM

Bharat Jain world Richest Beggar With 7 crore

నెల సంపాదన రూ.75,000

ఆస్తులు రూ.7.5 కోట్లు

మాఫియా తెలుసు.. ముష్టియా  తెలుసా... అంటాడు ఆలీ ఓ సినిమాలో.. ఆయన చిటికేస్తే వందమంది బిచ్చగాళ్ల బిలబిలమంటూ వస్తారు. రూపాయి గట్రా ఇస్తే తీసుకోడు.. ఓన్లీ కరెన్సీ నోట్లు మాత్రమే బొచ్చెలో వేయాలి. హార్లిక్స్ మాత్రమే తాగుతాడు.. ఆరోగ్యం కోసం అంత జాగ్రత్త మరి.  

బిచ్చగాళ్ళు అంటే అందరికీ లోకువే. బిచ్చగాడు అంటే డబ్బులు లేని వాళ్ళని అనుకోకండి. ముంబై కి చెందిన భారత్ జైన్  అనే ఓ బిచ్చగాడు మహా రిచ్.. రిచ్ అంటే అలాంటి ఇలాంటి రిచ్ కాదమ్మా.. కోటీశ్వరుడు.. అక్షరాల రూ.7.50  కోట్ల ఆస్తులు.. షాపులు వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆయన రోజువారి సంపాదన రెండున్నర వేల పైనే. నెలకు 75000 సంపాదిస్తాడు. అంటే దాదాపుగా ఓ ఐటీ ఉద్యోగి సంపాదన అంత.. ఓ గవర్నమెంట్ ఆఫీసర్ జీతం అంత ఉంటుంది ఈ బెగ్గర్ గారి ఆదాయం

ఆరోజు తాను తిరిగిన ప్రాంతం.. జనంలో ఉన్న దాతృత్వపు లక్షణాన్ని బట్టి తన ఆదాయంలో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయని ఆయన అంటున్నారు. బాల్యం నుంచే ఇదే వృత్తిని నమ్ముకున్న ఈ 54 ఏళ్ల భరత్ జైన్ ముంబై లోని చత్రపతి శివాజీ టెర్మినస్, అజాద్ మైదాన్ వంటి రద్దీ ప్రాంతాల్లో నిత్యం యాచిస్తూ తిరుగుతుంటారు. రోజులో 10-12 గంటలు ఈ పనిలో ఉంటూ ఒక్కోరోజు 4000 వరకూ సంపాదిస్తారట. ఇన్నేళ్ల సంపాదనతో వచ్చిన ఆదాయాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తారు.

రూ.1.4 కోట్లతో ముంబాయిలో రెండు ఫ్లాట్స్ కొన్నారు. తండ్రి, తమ్ముడు, భార్య, ఇద్దరు పిల్లలతో సొంత ఫ్లాట్ లో విలాసంగా బతికే బెగ్గర్ గారికి రెండు దుకాణాలు కూడా ఉన్నాయి. వాటి నుంచి నెలకు రూ.30,000 అద్దెలు కూడా వస్తున్నాయి. పేదరికం కారణంగా తాను సరిగా చదువుకోలేకపోయినా తన ఇద్దరు బిడ్డలను మంచి కాన్వెంట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. భవిష్యత్తు కోసం ఇంకొన్నాళ్ళు ఇదే వృత్తిలో ఉంటానని అంటున్నారు.

ఇదే సమయంలో తనకు ఆశ.. దురాశ లేదని.. పిసినారిని కూడా కానని చెప్పిన జైన్ అప్పుడప్పుడు గుళ్లలో దానాలు.. విరాళాలు కూడా ఇస్తుంటానని అన్నారు. దేశంలో మొత్తం 4,13,670 మంది బిచ్చగాళ్ల ఉన్నట్లు జనగణనలో తేలింది. జైన్‌తో పాటు సంభాజి కాలే రూ.1.5 కోట్ల ఆస్తులు.. లక్ష్మి దాస్ రూ.1 కోటి ఆస్తులతో బిచ్చగాళ్లలో రిచ్చు గాళ్ళుగా రికార్డు సాధించారు. సో.. బిచ్చగాళ్లను తేలికగా చూడకండి. వాళ్ళు మీకన్నా రిచ్చు గాళ్ళు కూడా కావచ్చు. 
-సిమ్మాదిరప్పన్న.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement