తిరువనంతపురం: హిందూత్వం ఓం శాంతి అని ప్రబోధిస్తే అధికార బీజేపీ మాత్రం దేశంలో అశాంతిని పెంచుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం కేరళలో భారత్ జోడో యాత్రలో కల్లంబలంలో భారీ జనసమూహాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు.
‘‘హిందూత్వంలో మనం మొట్టమొదటగా నేర్చుకునేది ‘ఓం శాంతి’ అనే రెండు పదాలే. అలాంటి శాంతియుత భారతావనిలో బీజేపీ అశాంతిని విస్తరింపజేస్తోంది. అశాంతిని పెంచే ఈ పార్టీ ఎలా హిందూత్వానికి ప్రతినిధిగా చలామణి అవుతుంది? రాజకీయంగా విద్వేషం రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవవచ్చని బీజేపీ నిరూపించింది’ అని దుయ్య బట్టారు. భారత్ జోడో యాత్రలో కదం తొక్కుతున్న తమ యాత్రకు పాదాలకు గాయాలు, బొబ్బలు ఆటంకం కాలేవని రాహుల్ అన్నారు.
మంగళవారం జడివానలోనూ యాత్ర కొనసాగింది. వందలాది మంది మద్దతుదారులు రాహుల్‌తో కలిసి ముందుకు కదిలారు. ‘దేశాన్ని ఐక్యం చేసే ఈ యాత్ర ఆగదు’ అని వీడియోను రాహుల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశారు. ‘భారత స్వప్నాన్ని ముక్కలుచేశారు. దాన్ని మేం ఒక్కటి చేస్తాం. ఆ ప్రయత్నంలో 100 కి.మీ. పూర్తయింది. ఇప్పుడే మేం మొదలుపెట్టాం’ అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment