బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో నరమాస భక్షక తోడేళ్లనన్నింటినీ పట్టుకున్నామని అటవీశాఖ అధికారులు చేసిన ప్రకటన మరువకముందే మరో తోడేలు ఓ చిన్నారిపై దాడి చేసింది. మహసీ ప్రాంతంలో నరమాంస భక్షక తోడేళ్ల దాడులు ఇంకా ఆగడంలేదు. ఇంటి వరండాలోని గదిలో నిద్రిస్తున్న ఏడేళ్ల చిన్నారి అంజుపై తోడేలు దాడి చేసింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తోడేలు దాడికి దిగిన వెంటనే అంజు కేకలు వేయడంతో అది ఆ చిన్నారిని వదిలి పారిపోయింది. బాధితురాలిని ప్రథమ చికిత్స కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స అందించాక ఆ చిన్నారిని మెరుగైన వైద్యం కోసం బహ్రాయిచ్ మెడికల్ కాలేజీకి తరలించారు.
రాత్రి 11.30 గంటల సమయంలో తోడేలు చిన్నారి అంజు మెడ పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లింది. అంజు కేకలు వేయడంతో తోడేలు బాలికను వదిలి పారిపోయింది. కాగా ఆ చిన్నారికి అయిన గాయాన్ని పరిశీలించిన బహ్రాయిచ్ డీఎఫ్‌ఓ అజిత్ ప్రతాప్ సింగ్ చిన్నారిపై తోడేలు దాడి చేసిందన్న కుటుంబ ఆరోపణను ఆయన ఖండించారు. ఇది కుక్క దాడిలా కనిపిస్తున్నదన్నారు.
బహ్రాయిచ్ ప్రాంతంలో తోడేళ్లు ఇప్పటివరకూ పదిమందిని పొట్టనపెట్టుకున్నాయి. తోడేళ్ల దాడుల్లో 50 మందికి పైగా జనం గాయపడ్డారు. ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహ్రాయిచ్‌కు వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రభుత్వ సహాయం అందించారు. నరమాంస భక్షక తోడేళ్లు కనిపించగానే చంపేయాలని ముఖ్యమంత్రి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. బహ్రాయిచ్ మహసీ ప్రాంతంలో ఆరు తోడేళ్లు ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. అందులో ఐదింటిని తొలుత పట్టుకున్నారు. మిగిలిన ఆరో తోడేలును కూడా పట్టుకున్నామని అటవీ శాఖ ప్రకటించినంతలోనే మరో తోడేలు దాడి చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: హమాస్ చీఫ్ బతికే ఉన్నాడు: ఇజ్రాయెల్ మీడియా
Comments
Please login to add a commentAdd a comment