నోయిడా : ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా ర్యాలీ చేపట్టిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఆర్‌పిసి సెక్షన్ 144ను అతిక్రమించిన కారణంగా గృహ నిర్భందం చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన తమ పోరాటం ఆగదని ఆజాద్ స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని పేర్కొన్నారు. దళిత యువతి(19)పై జరిగిన దమనకాండకు నిరసనగా ఆజాద్ సమాజ్ పార్టీ, దళిత్ అనుకూల భీమ్ ఆర్మీ సంయుక్తంగా మంగళవారం దేశ రాజధానిలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి బయట నిరసనలు చేశారు. ఆంక్షలను ఉల్లంఘించిన కారణంగా నిరసనకారులను అరెస్ట్ చేస్తున్నట్లు అలీఘడ్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ జన సమూహాన్ని ఏర్పాటు చేసిన కారణంగా సహారన్‌పూర్‌లో పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. (అమ్మను బాధపడవద్దని చెప్పండి..)
ఢిల్లీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన దళిత యువతి(19)కి అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు జరిపించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. తాజా పరిణామంపై రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితురాలు అయినందున బాధితురాలి పట్ల మరణంలోనూ పోలీసులు క్రూరంగా వ్యవహరించించారని మండిపడ్డాయి.
కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. (యూపీ నిర్భయ పట్ల అమానవీయం)
Comments
Please login to add a commentAdd a comment