dalit girl
-
టీడీపీ నేతల వేధింపులతో దళిత యువతి ఆత్మహత్య!
సాక్షి, నరసరావుపేట/పిడుగురాళ్ల రూరల్: టీడీపీ నేతల వేధింపులు తాళలేక ఓ దళిత యువతి మంగళవారం సాగర్ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. జూలకల్లుకు చెందిన రాముడు, కుమారి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. ప్రభుత్వ రేషన్ డిపో నడిపే రాముడు గతేడాది అక్టోబర్ 6న చనిపోయాడు. అప్పటినుంచి మూడో కుమార్తె మనీషా ఆ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఎన్నికల్లో మనీషా కుటుంబం వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటు వేసిందన్న కక్షతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఆయన అనుచరులైన ఆమె సమీప బంధువులు రేషన్ షాపు వదులుకోవాలని బెదిరించి, దాడులకు దిగారు. వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ దగ్గరకు పిలిపించి షాపు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయడంతో ఆమె అంగీకరించక తప్పలేదు. ఆ దుకాణం మనీషా తల్లి పేరిట ఉండటంతో ఆమె చేత వేలి ముద్ర వేయించుకొని గత నెల నుంచి రేషన్‌ను టీడీపీ నాయకులే పంపిణీ చేశారు. అది చాలదన్నట్టు మనీషా కుటుంబం రేషన్ వాడుకున్నారని, దానికి డబ్బులు చెల్లించాలని అధికారులు, టీడీపీ నాయకులు హుకుం జారీ చేశారు. అంత డబ్బు ఇవ్వలేమని, కొంత కడతామని చెప్పినా వినకుండా వరుసకు అన్న అయ్యే లంజపల్లి వెంకటేశ్వర్లు, ఆయన తండ్రి పిచ్చయ్య మనీషాపై దాడిచేసి, మానసికంగా హింసించారు. అప్పటి నుంచి చనిపోతానంటూ మనీషా ఏడుస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆమె కనిపించకపోవడంతో బంధువులు, గ్రామస్తులు వెతగ్గా సాగర్ కెనాల్ గట్టుపై చెప్పులు, చున్నీ, ఓ లేఖ కనిపించాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రేషన్ షాపు వదులుకోకపోతే ఏం చేస్తారోనన్న భయంతోనే తన బిడ్డ చనిపోయిందని తల్లి కుమారి కన్నీరు మున్నీరవుతోంది. -
టీడీపీ కార్యాలయంలో లైంగిక దాడి నిందితుడు
పట్నం బజారు (గుంటూరు), పెదకాకాని: ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో మోసగించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై శుక్రవారం గుంటూరులో టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కానిస్టేబుళ్లను నిర్బంధించే యత్నం చేశారు. సీఐ స్థాయి అధికారి వారిస్తున్నా వినకుండా బరి తెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం గుంటూరు స్వర్ణభారతీనగర్‌లో నివాసం ఉంటున్న టీడీపీ నేత చల్లా లక్ష్మీనారాయణ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో వంచించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు నాగార్జున వర్సిటీలో చదివిన సమయంలో అక్కడ కాంట్రాక్టర్‌గా పని చేసిన లక్ష్మీనారాయణ పరిచయం పెంచుకుని శారీరకంగా లొంగదీసుకున్నాడు. అప్పటికే అతడికి వివాహం అయిందని తెలియడంతో నిలదీసిన బాధితురాలిని నగ్న వీడియోలు, ఫోటోలు చూపించి బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం పెళ్లి చేసుకున్న బాధితురాలి భర్తను కూడా బెదిరించి వారి కాపురాన్ని విచ్ఛిన్నం చేశాడు. తన కుమార్తె జీవితం అన్యాయమైందనే బాధతో బాధితురాలి తండ్రి ఈ ఏడాది ఆగస్టులో గుండెపోటుతో మరణించాడు. దీంతో నిందితుడు లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. టీడీపీ కార్యాలయంలో నక్కిన నిందితుడు: సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడి లైవ్ లొకేషన్‌ను గుర్తించిన కానిస్టేబుళ్లు ఇర్ఫాన్, మణిప్రసాద్ అతడి కారును వెంబడిస్తూ గుంటూరు అరండల్‌పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులను గుర్తించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ సమక్షంలోనే దాడికి యత్నించారు. తాము పోలీసులమని చెబుతున్నా వినకుండా దాడికి పాల్పడ్డారు. అనంతరం సీఐ సురేష్‌బాబు అక్కడకు చేరుకోవడంతో నిందితుడు చల్లా లక్ష్మీనారాయణ ఇక్కడ లేడంటూ బుకాయించారు. అయితే లక్ష్మీనారాయణను టీడీపీ కార్యాలయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మెల్లగా జారుకున్నారు. -
దళిత యువతిపై దాడి
జక్రాన్‌పల్లి: ప్రేమ పేరుతో దళిత యువతిని వేధించి, హత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జక్రాన్‌పల్లికి చెందిన దళిత యువతిని అదే గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శనివారం రాత్రి ఆమెను బలవంతంగా తన బైక్‌పై ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో యువతి ప్రతిఘటించి బైక్‌పై నుంచి కిందకు దూకింది. దీంతో ఆగ్రహించిన సదరు యువకుడు మద్యం మత్తులో యువతిని కొట్టి రోడ్డు పక్కన పడేశాడు. ఆమెను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. గ్రామంలో ఆందోళన.. యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి దళిత సంఘాల ప్రతినిధులు, బాధిత యువతి కుటుంబ సభ్యులు గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. జక్రాన్‌పల్లి అంబేడ్కర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
‘ఉన్నావ్’ బాధితురాలిపై నిందితుల దాడి, ఇంటికి నిప్పు..ఇద్దరికి తీవ్ర గాయాలు
ఉన్నావ్: యూపీలోని ఉన్నావ్ దళిత బాలిక అత్యాచార ఘటనలో నిందితులు మళ్లీ రెచ్చిపోయారు. మరికొందరితో కలిసి బాధితురాలిపై దాడికి తెగబడ్డారు. ఆమె ఉంటున్న గుడిసెకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో బాధితురాలి ఆరు నెలల కొడుకుతోపాటు, రెండు నెలల వయస్సున్న సోదరి తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉన్నావ్‌కు చెందిన 11 ఏళ్ల బాలికపై గత ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భం దాల్చి, కుమారుడికి జన్మనిచ్చింది. ఈ కేసులో జైలుకు వెళ్లిన నిందితులు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. కేసును వెనక్కి తీసుకునేందుకు బాధితురాలు నిరాకరించిందనే కోపంతోనే దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన శిశువుల పరిస్థితి విషమంగా మారడంతో కాన్పూర్ తరలించినట్లు పోలీసులు చెప్పారు. తమ కుమార్తెను అంతం చేసేందుకే నిందితులు ఇంటికి నిప్పుపెట్టారంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఉండగా, ఈ కేసులో నిందితులతో రాజీకి నిరాకరిస్తున్నాడనే కారణంతో గత నెలలో బాధితురాలి తాత, మామ కలిసి జరిపిన దాడిలో బాధితురాలి తండ్రి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ఉన్నాడు. -
‘ఆ మృగాలకు వేసే శిక్షతో వెన్నులో వణుకు పుట్టాలి’
లక్నో: అక్కాచెల్లెలపై జరిగిన ఘోర కలితో యావత్ యూపీ రగిలిపోతోంది. లఖింపూర్ ఖేరీలో ఇద్దరమ్మాయిలపై హత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులను ఇప్పటికప్పుడే ఉరి తీయాలని, ఎన్కౌంటర్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ అక్కాచెల్లెల హత్యాచార ఘటనలో దర్యాప్తు శరవేగంగా ముందుకెళ్తోంది. పైగా బాధితులు దళితులు కావడంతో యూపీ పోలీసులపై ఒత్తిడి మరింతగా పెరిగింది. నిందితులు సుహేయిల్, జునైద్, హఫీజుల్ రెహమాన్, కరీముద్దీన్, ఆరిఫ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు, బాధితుల పక్కింట్లో ఉండే చోటును సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాథక్ స్పందించారు. ఈ ఘటనపై యోగి సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరగతిన పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. నిందితులకు విధించే శిక్షతో రాబోయే తరాల్లో ఇలాంటి నేరాలు చేయడానికి వెన్నులో వణుకుపుట్టాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. #WATCH | Junaid, Sohail, Hafizul, Karimuddin & Arif involved. Girls were strangled to death & then hanged. Govt will take such an action that the souls of their coming generations will also shiver. Justice will be given; proceedings via fast-track court: UP Dy CM Brajesh Pathak https://t.co/QoNlxHFwYq pic.twitter.com/dDqAtdxQ2o — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 15, 2022 మరోవైపు శవపరీక్షలో మైనర్లపై అఘాయిత్యం జరిగిందని, చెరుకు తోటలో ఇద్దరమ్మాయిలపై సుహేయిల్, జునైద్‌లు రేప్‌కి పాల్పడగా.. మిగతావాళ్లు ఆధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఎస్పీ సంజీవ్ సుమన్ వెల్లడించారు. వాళ్ల దుపట్టాలతోనే ఉరేశారని, ఆపై చెరుకుతోటలోనే ఓ చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారని ఎస్పీ అన్నారు. అయితే.. ఆ అక్కాచెల్లెళ్లు తమంతట తామే నిందితులతో వెళ్లారని పోలీసులు చెబుతుంటే.. బాధిత కుటుంబం మాత్రం వాళ్లు కిడ్నాప్‌కు గురయ్యారని వాపోతోంది. బలవంతంగా తమ బిడ్డలను బైకులపై తీసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షి, బాధితురాళ్ల తల్లి చెబుతోంది. ఇంకోవైపు పోస్ట్‌మార్టం కోసం వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు గ్రామస్తులు. రాత్రంతా హైడ్రామా నడిచింది ఆ ఊరిలో. మరోవైపు ఈ ఘటన.. 2014లో బదౌన్ గ్యాంగ్‌రేప్ కేసును ఇది గుర్తుచేస్తోందని పలువురు అంటున్నారు. ఇదీ చదవండి: పొలంలో చెట్టుకు విగతజీవులుగా వేలాడుతూ ఇద్దమ్మాయిలు! -
పొలంలో చెట్టుకు వేలాడుతూ ఇద్దరమ్మాయిలు.. ఏం జరిగింది?
ఇద్దరు యువతులు చెట్టుకు వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. దళిత వర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి ఆ తర్వాత వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. లఖింపూర్ ఖేరీలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అయితే, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైకులపై వచ్చి తమ కూతుళ్లను కిడ్నాప్ చేశారని బాధితురాలి తల్లి ఆరోపించింది. అనంతరం, తన బిడ్డల కోసం వెతుకుతుండగా.. ఓ చోట పొలం వద్ద విగతజీవులుగా చెట్టుకు వేలాడుతూ కనిపించారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ కూతుళ్లు ఇద్దరిని.. దుంగడులు కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన తర్వాత ఇలా చెట్టుకు వేలాడదీశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. इस खबर पर इतनी चुप्पी क्यों है? pic.twitter.com/5nZRWhfJl5 — Meena Kotwal (मीना कोटवाल) (@KotwalMeena) September 14, 2022 ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి అదే గ్రామానికి చెందిన అనుమానం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. విచారణ జరగుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని విషయాలు తెలుసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు స్పందించారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా.. ఇద్దరు దళిత అమ్మాయిలను కిడ్నాప్ చేసి, హత్య చేయడం దుర్మార్గమైన చర్య. లఖింపూర్‌లో గతంలో రైతుల దుర్ఘటన జరిగిన తర్వాత, ఇప్పుడు దళితులను చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. యూపీలో శాంతిభద్రతలు సరిగా లేవని ఆరోపించారు. గత ప్రభుత్వాలతో పోల్చితే యూపీలో మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందని ప్రశ్నించారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లను చంపిన ఘటన ఆవేదనకు గురిచేసిందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. लखीमपुर डबल मर्डर पर एक्शन में यूपी पुलिस, थोड़ी देर में प्रेस कॉन्फ्रेंस कर दी जाएगी मामले की जानकारी@manishtv9 दे रहे हैं पूरी जानकारी@iamdeepikayadav @spbhattacharya #LakhimpurKheri #UPPolice #UttarPradesh pic.twitter.com/cs3tpGJ173 — Times Now Navbharat (@TNNavbharat) September 15, 2022 -
జర్నలిస్టు సిద్దిఖికి బెయిల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ జైల్లో రెండేళ్లుగా మగ్గిపోతున్న కేరళ జర్నలిస్టు సిద్దిఖి కప్పన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతీవ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందన్న అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ హథ్రాస్‌లో 2020 సెప్టెంబర్‌లో 19 ఏళ్ల దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురై మరణించిన దుర్ఘటనని కవర్ చేయడానికి వెళుతున్న సిద్దిఖిని యూపీ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఉగ్రవాద సంస్థలకు ఆయన నిధులు అందిస్తారన్న ఆరోపణలపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం (యూఏపీఏ) కింద అదుపులోనికి తీసుకున్నారు. మూడు రోజుల్లోగా కప్పన్‌ను ట్రయల్ కోర్టులో హాజరు పరిచి ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరువారాలు కప్పన్ ఢిల్లీలోనే ఉండాలని, ప్రతీ సోమవారం పోలీసు స్టేషన్ కావాలని షరతులు విధించింది. ఆ తర్వాత కేరళలో తన సొంత గ్రామానికి వెళ్లవచ్చునని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. 2020 సెప్టెంబర్ 14న హథ్రాస్‌లో ఒక దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బాధితురాలి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన పోలీసులు అర్థరాత్రి హడావుడిగా అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో అనుమానాలు రేకెత్తి నిరసనలు భగ్గుమన్నాయి. సంచలనం సృష్టించిన ఈ ఉదంతాన్ని కవర్ చేయడానికి యూపీ వెళుతుండగా మార్గమధ్యలోనే కప్పన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే పాపులర్ ఫ్రంట్ ఇండియాతో సంబంధాలున్నాయని వాదిస్తూ వచ్చారు. -
దళిత యువతిపై అమానుషం.. జుట్టుపట్టుకొని కొడుతూ.. వీడియో వైరల్
లక్నో: యూపీలో దారుణం చోటుచేసుకుంది. బాలిక పట్ల కొందరు వ్యక్తులు సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యూపీలోని అమేథీ పరిధిలో ఒక యువతి తమ ఇంట్లో చోరీ చేసిందనే ఆరోపణలతో కొందరు బాలికపట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఆమెను జుట్టుపట్టుకొని లాక్కొచ్చి ఇంటిలో బంధించారు. ఆ తర్వాత.. ఇద్దరు వ్యక్తులు ఆమెను నేలపై తొసేసి.. మరో వ్యక్తి ఆమెపై కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారు. పాపం బాలిక దెబ్బలకు తాళలేక ఏడుస్తూ ఉంటే వారు ఏమాత్రం జాలిచూపడం లేదు. ఇద్దరు మహిళలు కూడా బాలికను తీవ్రంగా దూషిస్తున్నారు. బాలికను కొడుతూ ఉంటే అక్కడ ఉన్నవారు వీడియో తీస్తూ పైశాచికంగా ప్రవర్తించారు. బాలిక దెబ్బలకు తట్టుకోలేక ఏడుస్తు ఉండే దుర్మార్గులు మాత్రం ఏ మాత్రం జాలీ చూపలేదు. కాగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అమేథీ పోలీసులు నిందితులపై పోక్సో, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులను నమోదు చేశారు. బాలికను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం యూపీలో తీవ్ర దుమారాన్ని రేపుతుంది. దీనిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీటర్లో మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు. యోగీ ప్రభుత్వం నిద్రపోతుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ట్వీటర్ వేదికగా స్సందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. అమేథీ పోలీసు అధికారి అర్పిత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగతావారికోసం గాలిస్తున్నట్టు తెలిపారు. యోగి ప్రభుత్వం కేవలం అధికారం కోసం మాత్రమే చూస్తుందని.. ప్రజల భద్రతను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన ప్రస్తుతం యూపీలో కలకలం రేపుతుంది. अमेठी में दलित बच्ची को निर्ममता से पीटने वाली ये घटना निंदनीय है। @myogiadityanath जी आपके राज में हर रोज दलितों के खिलाफ औसतन 34 अपराध की घटनाएं होती हैं, और 135 महिलाओं के ख़िलाफ़, फिर भी आपकी कानून व्यवस्था सो रही है।…1/2 pic.twitter.com/mv1muAMxkr — Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 29, 2021 -
చదువుల తల్లికి కోర్టు అండ.. అడ్మిషన్ ఫీజు అందించిన వైనం
లక్నో: ప్రతిష్టాత్మక ఐఐటీ బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)కి అర్హత సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అడ్మిషన్ కోల్పోతున్నాను అంటూ దళిత సామాజిక వర్గానికి చెందిన బాలిక సంస్కృతి రంజన్ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది. అయితే ఆమె జేఈఈ ఉమ్మడి పరీక్షలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, షెడ్యూల్డ్ కులాల విభాగంలో రెండు వేల ర్యాంకును సాధించింది. ఈ మేరకు సంస్కృతి రంజన్ హైకోర్టుకు హాజరై... ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా గణితం, కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన ఐదేళ్ల కోర్సు ప్రవేశ రుసుము మొత్తం రూ 15 వేలు చెల్లించలేకపోతున్నాను. నా తండ్రి కిడ్ని వ్యాధి కారణంగా మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతోంది’’ అని తెలిపింది. (చదవండి: జపాన్‌లో తొలి ఒమిక్రాన్ కేసు..!!) అంతేకాక ‘‘నేను నా పరిస్థితిని వివరిస్తూ..అడ్మిషన్ గడువు తేదిని పొడిగించండి అంటూ జాయింట్ సీట్ల కేటాయింపు అథారిటీకి చాలాసార్లు లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందువల్ల నన్ను కాలేజీలో చేర్చుకునేలా విశ్వవిద్యాలయానికి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సీట్ల కేటాయింపు సంస్థకు ధర్మాసనం ఆదేశాలు ఇవ్వాలి" అని పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన దినేష్ కుమార్ సింగ్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ యూనివర్సిటిలో మూడు రోజుల్లో రిపోర్టు చేయాల్సిందిగా పిటిషన్లో కోరింది. అయితే ధర్మాసనం ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించడమేకాక తన తండ్రి ఆరోగ్య దృష్ట్యా కిడ్ని మార్పిడి చేయించుకోమని సలహా సూచించింది. ఈ క్రమంలో న్యాయమూర్తి దినేశ్‌సింగ్ మాట్లాడుతూ..."అంతేకాదు మేము ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని డబ్బుని అందజేస్తాం. పైగా ఒక దళిత యువతి ఐఐటీలో ప్రవేశం పొందాలనే తన కలను సాకారం చేసుకునేందుకు తనకు న్యాయం చేయమని కోరుతూ ఈ కోర్టు ముందుకి వచ్చింది. అందువల్లే ఈ కోర్టు స్వయంగా సీటు కేటాయింపు కోసం రూ. 15,000 విరాళంగా ఇస్తోంది." అని న్యాయమూర్తి దినేశ్ సింగ్ అన్నారు. (చదవండి: బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!) -
ఆ పాప ఊపిరాడక చనిపోయింది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని కంటోన్మెంట్‌కు చెందిన తొమ్మిదేళ్ల దళిత బాలిక అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు బుధవారం అభియోగాలు నమోదు చేశారు. ఆ బాలికపై లైంగిక దాడి జరిగినప్పుడు ఊపిరాడక చనిపోయిందని కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పూజారి రాధేశ్యామ్ ఆ బాలికపై గతంలోనూ అత్యాచారానికి పాల్పడ్డాడని తమ విచారణలో తేలినట్టుగా పోలీసులు వెల్లడించారు. శ్మశాన వాటిక సమీపంలో ఉన్న కూలర్లో మంచినీళ్లు తాగడానికి వచి్చన ఆ బాలిక అరవకుండా గట్టిగా నోరు నొక్కి పెట్టి ఉంచిన పూజారి రాధే శ్యామ్ ఆమెపై బలవంతంగా అత్యాచారం జరపాడని, దీంతో ఊపిరాడక ఆ బాలిక మరణించిందని పోలీసులు చార్జిషీటులో వివరించారు. ఎలక్ట్రిక్ షాక్ తగలడం వల్లే ఆ బాలిక మరణించిందని అతడు ఆమె తల్లిదండ్రుల్ని మభ్య పెట్టాలని చూశాడని, ఆ పాపకి విద్యుతాఘాతం తగిలినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. -
కాంగ్రెస్ – ట్విట్టర్ వార్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, సామాజిక మాధ్యమం ట్విట్టర్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారిక అకౌంట్, పార్టీ నేతలు, కార్యకర్తల ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసిందని ఆ పార్టీ గురువారం వెల్లడించింది. ఢిల్లీలో అత్యాచారం, హత్యకి గురైనట్టుగా అనుమానిస్తున్న దళిత బాలిక కుటుంబం ఫొటోలను కాంగ్రెస్ నేత రాహుల్ ఇటీవల ట్విట్టర్లో షేర్ చేసినందుకు ఆయన ఖాతాను తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాని బ్లాక్ చేయడంతో ఆ పార్టీ ట్విట్టర్‌పైనా, కేంద్రంలో మోదీ ప్రభుత్వంపైనా విరుచుకుపడింది. కేంద్రం ఆదేశాల మేరకే ట్విట్టర్ ఇలా వ్యవహరిస్తోందని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు సుర్జేవాలా, అజయ్ మాకెన్, లోక్‌సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మిత దేవ్ తదితరుల ఖాతాలను ట్విట్టర్ నిలిపివేసింది. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలకు చెందిన మొత్తంగా 5,000 ఖాతాలను ట్విట్టర్ స్తంభింపజేసిందని కాంగ్రెస్ సోషల్‌మీడియా విభాగం చీఫ్ రోహన్ గుప్తా అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ట్విట్టర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల అకౌంట్లు బ్లాక్ చేసే అంశంలో ఆ సంస్థ తన సొంత నిబంధనలు పాటిస్తుందా లేదంటే మోదీ ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకుంటుందా అని ప్రశ్నించారు. కాగా, ట్విట్టర్ తమ చర్యల్ని సమర్థించుకుంది. -
దేశ రాజధానిలో దారుణం జరిగితే స్పందించరా?
న్యూఢిల్లీ: సాక్షాత్తూ దేశ రాజధానిలో తొమ్మిదేళ్ల దళిత బాలిక అత్యాచారం, హత్యకు గురైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు నోరువిప్పడం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆదివారం నిలదీసింది. ఈ దారుణంపై ఆయన ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేసింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేకూర్చాలని విన్నవించింది. భారత ప్రభుత్వ ఒత్తిడితోనే ట్విట్టర్ యాజమాన్యం తమ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా స్తంభింపజేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. దళిత బాలిక తల్లిదండ్రులను పరామర్శిస్తున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసిన రాహుల్ గాంధీ ఖాతాను ట్విట్టర్ యాజమాన్యం తాత్కాలికంగా స్తంభింపజేసినట్లు కాంగ్రెస్ శనివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబానికి అండగా నిలిచినందుకు ఇలా చేయడం సరైంది కాదని ఆ పార్టీ పేర్కొంది. ప్రభుత్వానికి భయపడాల్సిన పనేం లేదని (డరో మత్) ట్విట్టర్‌కు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే సూచించారు. పార్టీ నేత రాగిణి నాయక్‌తో కలిసి ఆమె ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దళిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి సాయం అందించలేదని విమర్శించారు. బాలిక తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచిన నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడానికి బదులు వారిని అణచివేయడానికే అధికారాలను ఉపయోగిస్తోందని రాగిణి నాయక్ మండిపడ్డారు. న్యాయం కోరడం నేరమా? దేశంలో మహిళల భద్రత, వారికి ఎదురవుతున్న సమస్యలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించాలని ఢిల్లీ కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా డిమాండ్ చేశారు. ఒక రోజంతా ఈ అంశానికి కేటాయించాలన్నారు. దళిత బాలిక మరణానికి దుండగులకు ఆరు నెలల్లోగా మరణ శిక్ష అమలు చేయాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమృతా ధావన్ అన్నారు. ఈ దారుణాన్ని రాహుల్ గాంధీ లేవనెత్తకపోతే ఎప్పుడో తెరమరుగు అయ్యేదని వెల్లడించారు. బాలిక తల్లిదండ్రుల ఫొటోలను కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కాదు, బీజేపీ నాయకులు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ (ఎన్సీఎస్సీ) సభ్యులు కూడా ట్విట్టర్లో షేర్ చేశారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా గుర్తుచేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని రాహుల్ గాంధీ కోరడం నేరమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సూర్జేవాలా తాజాగా ట్వీట్ చేశారు. -
పేదరికపు కాటు: ఇల్లు ఉంటే ఇలాగయ్యేది కాదు
తిరువంతపురం: ఆదిత్య పదేళ్ల పాపాయి. అమ్మానాన్న, తను మాత్రమే ఉన్నామనుకుంది. తమతోపాటు మరో ప్రాణి కూడా తమ ఇంటికి వస్తూ పోతూ ఉందని ఆ పాపాయికి తెలియదు. ఆ ప్రాణి ఓ రోజు నాన్న ఇంట్లో లేనప్పుడు వచ్చింది. ఐదవ తరగతి చదువుతున్న ఆదిత్య హోమ్‌వర్క్ చేసుకుని, అమ్మ పెట్టిన అన్నం తిని నేల మీద పరుపు పరుచుకుని నిద్రపోయింది. ఆమె పడుకున్న తర్వాత ఆ ప్రాణి ఎప్పుడు వచ్చిందో తెలియదు. వచ్చి పాపాయిని కాటేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు ఆదిత్య పడుకున్న పరుపు కిందకు దూరింది. తెల్లవారింది. ఆదిత్య ఎప్పటిలాగ నిద్రలేవలేదు. తల్లి సింధు ఆమెను నిద్రలేపుతుంటే బలవంతంగా కళ్లు తెరుస్తోంది, అంతలోనే కళ్లు మూతలు పడుతున్నాయి. ముఖం ఉబ్బి ఉంది. ఆదిత్య తల్లికి ఏదో అనుమానం వచ్చింది. రాత్రి ఏదో కుట్టినట్లు అనిపించిన మాట నిజమేనని, చీమ కాబోలని చెప్పింది ఆదిత్య. నిజానికి అది చీమ కాదు. పరిస్థితులు ఎదురుతిరిగినప్పుడు చలిచీమల చేత చిక్కి నిస్సహాయంగా ప్రాణాలు వదిలే విషసర్పం. ఆదమరిచి నిద్రపోతున్న ఆదిత్య దగ్గర తన ప్రతాపం చూపించిందా సర్పం. పాపాయిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ ఆమెను కాటేసినది అత్యంత విషపూరితమైన సర్పం. మనిషి ఒంట్లోకి చేరగానే నరాల మీద ప్రభావం చూపిస్తుంది. న్యూరోపెరాలసిస్‌కు దారి తీస్తుంది. ఆదిత్య పరిస్థితి మరింతగా విషమించడంతో శనివారం నాడు పుష్పగిరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు మార్చారు. ఆదిత్య ప్రాణాలు కాపాడడం కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. శాశ్వత నిద్రలోకి జారిపోయింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లా, పాథనాపురం, అంబేద్కర్ కాలనీలో జరిగింది. ఇల్లు ఉంటే ఇలాగయ్యేది కాదు ఆదిత్య తండ్రి రాజీవ్ కంటికి మంటకి ఏకధాటిగా ఏడుస్తున్నాడు. నా బంగారు తల్లిని పొట్టనపెట్టుకున్నది పాము కాదు ప్రభుత్వం అంటున్నాడు. ‘‘మాకు పక్కా ఇల్లు ఇచ్చి ఉంటే మా పరిస్థితి ఇలాగయ్యేది కాదు. పక్కా ఇంటికోసం ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నప్పటికీ ప్రభుత్వానికి పట్టనేలేదు. ఇప్పుడు నా బిడ్డ బలయిపోయింది’’ అని కన్నీళ్ల పర్యంతం అవుతున్నాడు ఆదిత్య తండ్రి. అతడి ఆవేదనలో అర్థం ఉంది. ఆ కుటుంబం నివసిస్తున్న ఇల్లు అత్యంత దయనీయంగా ఉంది. బొంతరాళ్లను గోడలుగా పేర్చుకుని, పైన నీలం రంగు పాలిథిన్ పట్ట పరుచుకున్నాడు. గోడలకు ఉన్న రంధ్రాల నుంచి తేళ్లు, జెర్రుల వంటివి ఇంట్లోకి ప్రవేశించడం కష్టమేమీ కాదు. ఇప్పుడు ఏకంగా పామే వచ్చింది. పేదరికానికి పేగుబంధాన్ని బలి చేసింది. పైకి పాము కాటుగా కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది పేదరికపు కాటు. పేదరికం మీద ప్రభుత్వ వేసిన నిర్లక్ష్యపు వేటు. -
హథ్రాస్ కేసు : గ్రామ పెద్ద సంచలన ఆరోపణలు
లక్నో : దేశవ్యాప్తంగా కలకలం రేపిన హథ్రాస్ హత్యాచార ఘటనపై గ్రామ పెద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో బాధితురాలు, ప్రధాన నిందితుడు చాలా కాలంగా ఫోన్లో సంప్రదింపులు జరిపారని, వారి సన్నిహిత సంబంధం పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు. నిందితుడే బాలికకు సెల్ ఫోన్ ఇచ్చాడని, కుటుంబ సభ్యులే బాధితురాలిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. హిందూ మతంలో అలాంటి హేయమైన నేరానికి (సామూహిక లైంగికదాడి) ఎవరూ పాల్పడరని, నిందితులంతా నార్కో పరీక్షకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇతరుల నేరానికి మరో వ్యక్తి ని శిక్షించరాదని అన్నారు. నిందితులపై నేరాన్ని ముందుగా రుజువు చేయాలని కోరారు. బాధితురాలికి నిందితుడితో సంబంధం ఉందని, దీన్ని బాధితురాలి కుటుంబం సహించలేదని ఆయన ఆరోపించారు. బాలికను కలిసేందుకు నిందితుడు రాగా పట్టరాని కోపంతో కుటుంబ సభ్యులు ఆమెపై దాడిచేశారని ఆరోపించారు. ఇక బాధితురాలు కుటుంబం, నిందితుడి మధ్య పలుమార్లు ఫోన్ సంభాషణలు జరిగాయని, ఈ కేసులో బాలిక సోదరుడిని పోలీసులు ప్రశ్నించాలని బీజేపీ నేత అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు. ఇక ఈ కేసు నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామనే పేరుతో గ్రామంలో ఉన్నారని, ఇది గ్రామంలో శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమిస్తుందని గ్రామ పెద్ద హథ్రాస్ ఎస్డీఎంకు లేఖ రాసినట్టు సమాచారం. చదవండి : మరో పరువు హత్య కలకలం! సెప్టెంబర్ 14న బాధితురాలు పొలంలో పని చేసుకుంటూ ఉండగా.. దుండగులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేసి.. నాలుక కోసి తీవ్రంగా హింసించిన్నట్టు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెడ, వెన్నెముకకు తీవ్ర గాయాలయిన బాధితురాలిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె రెండు వారాలపాటు ప్రాణాలతో పోరాడి చివరకు సెప్టెంబర్ 29న కన్ను మూసింది. -
హథ్రాస్ : ‘సిట్’కు గడువు పొడిగింపు
లక్నో: హథ్రాస్ అత్యాచార కేసు విచారణకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బృందానికి ప్రభుత్వం మరో పది రోజుల గడువును పొడిగించింది. వాస్తవానికి ఈ ఘటనకు సంబంధించి ‘సిట్’ బుధవారమే తన నివేదికను సమర్పించాల్సి ఉంది. మరింత లోతుగా కేసు దర్యాప్తు చేసేందుకు సిట్ బృందానికి మరో 10 రోజుల గడువును పెంచినట్లు తెలుస్తోంది. హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందంలో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులు సహా బాధితురాలి కుటుంబసభ్యులకు కూడా నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయాల్సిందిగా భావిస్తున్నారు. (హథ్రాస్ ఘటన.. రూ.50 లక్షలు ఇస్తామన్నారట!) ఇక ఈ కేసులో ఇప్పటికే సిట్ సూచనల మేరకు జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్లను యోగి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, హథ్రాస్ గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న దళిత యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం ఆమె మరణించింది. అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు జరిపించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా హడావుడిగా అంత్యక్రియలు ముగించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (హథ్రాస్ రేప్ కేసులో అనుమానాలెన్నో) -
నిందితులను వెంటనే ఉరితీయండి
ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటనలో దోషులను వీలైనంత త్వరగా ఉరితీయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ఈ విషయంలో యూపీ ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు. వారికి విధించే శిక్షతో అలాంటి నేరం చేయాలన్న ఆలోచన కూడా రాకూడదు. ఆ బిడ్డ ఆత్మకు శాంతి లభించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ సీఎం పేర్కొన్నారు. హత్రాస్ నిర్భయ ఘటనపై యూపీ ప్రభుత్వతీరుకు నిరసనగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ,భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరనస ర్యాలీలో పాల్గొన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా వందలాది మంది ప్రజలు నిరసన గళం వినిపించారు. ఇంత దారుణమైన నేరం జరిగినా అక్కడి ప్రభుత్వం స్పందించక పోవడం వారి నేర చరిత్రకు అద్దం పడుతుందని సిపిఐ (ఎం) నాయకుడు సీతారాం ఏచూరీ అన్నారు. యెగి ఆదిత్యనాథ్‌కు అధికారంలో కొనసాగడానికి హక్కు లేదంటూ విమర్శించారు. (యూపీ నిర్భయ పట్ల అమానవీయం) కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెకు తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. (యూపీ సర్కార్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు) -
ఇదేమి సంస్కృతి?
ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్ జిల్లాలో దుండగుల అమానుషత్వానికి బలైన పందొమ్మిదేళ్ల దళిత యువతికి మరణానంతరం కూడా అగౌరవమూ, అవమానమూ తప్పలేదు. ఇందుకు సాక్షాత్తూ రాజ్యమే కారణం కావడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఊహకందనిది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో పది రోజులపాటు మృత్యువుతో పోరాడి మంగళవారం ఉదయం కన్నుమూసిన ఆ యువతి భౌతిక కాయాన్ని కుటుంబసభ్యుల ప్రమేయం లేకుండా పోలీసులే అర్థరాత్రి ఆమె గ్రామానికి తరలించుకు పోవడం, కుటుంబసభ్యులెవరూ లేకుండా వారే అంత్యక్రియలు పూర్తి చేయడం ఎలాంటివారికైనా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. వాహనానికి అడ్డొచ్చిన యువతి తల్లిదండ్రుల్నీ, ఆమె అన్నాచెల్లెళ్లనూ పక్కకు నెట్టి, ఆ తర్వాత వారిని వారింట్లోనే బంధించి ఈ తతంగమంతా పూర్తిచేయడం దేశం మొత్తం సిగ్గుతో తలదించుకునే విషయం. ఆమె భౌతికకాయాన్ని అప్పగిస్తే ఇంటికి తీసుకెళ్తామని ఆ యువతి తల్లిదండ్రులు అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో పోలీసుల కాళ్లావేళ్లాపడిన తీరు హృదయ విదారకమైనది. ఆ దృశ్యాలు చాన్నాళ్లవరకూ అందరినీ వెంటాడుతూనే వుంటాయి. అసలు ఆ మృత దేహం పోలీసులు స్వాధీనం చేసుకున్న తీరే పెద్ద మిస్టరీగా వుంది. తెల్లారుజామున 4 గంటలకు ఆమె మరణించిందని తెలిసి, స్వగ్రామానికి తీసుకెళ్లడానికి కుటుంబం ఏర్పాట్లు చేసుకుని 6 గంటల సమయంలో అడిగేసరికే ఆసుపత్రి అధికారులు పోలీసులకు అప్పగించామని చెప్పారు. ఆ సమయం నుంచి అర్థరాత్రి వరకూ ఆ యువతి భౌతికకాయం ఎక్కడుంచారో తెలియదు. కనీసం స్వాధీనం చేసుకున్న వెంటనే ఆమె స్వస్థలానికి తరలించినా మధ్యాహ్నానికి అంత్యక్రియలు పూర్తయ్యేవి. ఈ మొత్తం వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టు గురువారం సుమోటాగా తీసుకుని ఉన్నతాధికారులను తన ఎదుట హాజరుకావాలని ఆదేశించడం మంచి పరిణామం. ఆ మృతదేహానికి పోలీసులు నిర్వ హించినవి ఏ ప్రమాణాలతో చూసినా అంత్యక్రియలు కాదు. మీడియా కథనాలనుబట్టి పోలీసులు తమవెంట తెచ్చిన ప్లాస్టిక్ డబ్బానుంచి ఒక ద్రవాన్ని చితిపై పోసి నిప్పుపెట్టారు. తాము నమ్మే హిందూ మత విశ్వాసాల ప్రకారం పవిత్ర జలాలను చితిపై జల్లి, అనంతరం దహనం చేయాలని... దానికి ముందు ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులు చెబుతున్నారు. పైగా అర్థరాత్రి శవదహనం చేయడం తమ ఆచారానికి విరుద్ధమని జిల్లా మేజిస్ట్రేట్ కాళ్లావేళ్లా పడ్డారు. తమ కుమార్తెను చివరి సారి చూసుకోలేకపోయామని చింతిస్తున్నారు. శాంతిభద్రతల పరిస్థితి తలెత్తకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్న కారణం చెల్లదు. అలాంటి సమస్య తలెత్తుతుందనుకుంటే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత వారిదే. అంతేతప్ప ఆ మాటున పౌరుల విశ్వాసాలను కాలరాసే హక్కు వారికి లేదు. హథ్రాస్‌లో అమానుషంగా వ్యవహ రించిన పోలీసులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఉండకపోవచ్చుగానీ... ఏ మతస్తులకైనా చావుపుట్టు కల సమయాల్లో పాటించాల్సిన విధివిధానాలపై విశ్వాసాలుంటాయి. వాటిని నిర్వర్తించలేకపోవ డాన్ని వారు అపచారంగా భావిస్తారు. అది జీవితాంతం వారిని వెంటాడుతుంది. కశ్మీర్లో ఉగ్రవా దులు పోలీసుల చేతుల్లో మరణించిన సందర్భాల్లో ఈ విధానం అమలవుతోందని చెబుతున్నారు. కానీ ఈ ఉదంతంలో మరణించినామె ఒక సాధారణ దళిత కుటుంబానికి చెందిన యువతి. అసలు అత్యాచారం జరిగిందని ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు వ్యవహరించిన తీరు అక్కడి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికిగానీ, పోలీసు విభాగానికి గానీ ప్రతిష్ట తెచ్చేది కాదు. గత నెల 14న ఫిర్యాదు వస్తే ఎంతో జాప్యం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది. తొలుత అత్యాచారం ఆరోపణ చేర్చడానికి పోలీసులు సిద్ధపడలేదు. ఆ యువతికి చెందిన వాల్మీకి కులస్తులు ఒత్తిడి చేశాకే ఆ పనిచేశారు. ఇప్పుడు ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు కూడా అయ్యాక అత్యాచారం జరగలేదని, తీవ్ర గాయాలు కూడా లేవని పోలీసులు మాట్లాడుతున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఫోరెన్సిక్ నివేదికను అందుకు సాక్ష్యంగా చూపుతున్నారు. యువతి చావుబతుకుల్లో వుండగా ఇచ్చిన వాంగ్మూలంలో తనపై నలుగురు యువకులు అత్యాచారం చేశారని చెప్పింది. మరణ వాంగ్మూలాన్ని మన చట్టాలు నూరుశాతం నమ్ముతాయి. ఆఖరి ఘడియల్లో వున్నవారు అబద్ధం చెప్పరన్నది దానికి ప్రాతిపదిక. పైగా యువతి మర్మావయవంపై తీవ్ర గాయాలున్నాయని తొలుత పరీక్షించిన లేడీ డాక్టర్ నిర్ధారించారు. అత్యాచారం జరిగిందో లేదో తేల్చాల్సింది ఫోరెన్సిక్ నిపుణులే. అయితే నిర్భయ చట్టం ప్రకారం అత్యాచారానికి సంబంధించిన ఇతరత్రా సాక్ష్యం లభ్యం కానప్పుడు మర్మావయవంపై గాయం ఆధారంగా అత్యాచారం జరిగిందని భావించవచ్చు. అంటే దుండగులపై అత్యాచారం కేసు పెట్టడానికి లేడీ డాక్టర్ ఇచ్చిన నివేదికే సరిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది గమ నిస్తే యువతికి న్యాయం చేయడం కంటే ఆ దుండగులను కాపాడటానికే పోలీసులు ప్రాధాన్య మిస్తున్నట్టు కనబడుతోంది. ఒకపక్క హథ్రాస్ ఉదంతాన్ని చల్లార్చడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగానే బలరాంపూర్ అనేచోట కాలేజీలో చేరడానికి ఇంటినుంచి వెళ్లిన 22 ఏళ్ల దళిత యువతి అత్యాచారానికి గురై, శవమై ఇంటికొచ్చింది. ఆమె ఒంటినిండా గాయాలున్నాయని మీడియా కథనాలు చెబుతుండగా హథ్రాస్ మాదిరే ఇక్కడ కూడా పోలీసులు వేరే కథనం వినిపిస్తున్నారు. ఆమె ఒంటిపై గాయాలే లేవంటు న్నారు. గత రెండు మూడు నెలలుగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అత్యాచారాల పరంపరపై ఇప్పటి కైనా యోగి ప్రభుత్వం మేల్కొనాలి. అమానుష ఘటనలు జరిగినప్పుడు ఫిర్యాదు సమయంలోనే కప్పెట్టే ప్రయత్నాలు, అది సాధ్యంకాకపోతే అసలు అత్యాచారమే జరగలేదన్న దబాయింపులు పరి స్థితిని ఏమాత్రం మెరుగుపరచవు. అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి, బాధితులపట్ల సున్ని తంగా వ్యవహరించే సంస్కృతిని పెంపొందిస్తే తప్ప అది సాధ్యం కాదు. -
‘హత్రాస్ రేప్’ కేసులో మరో కోణం
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో అత్యాచారానికి గురై అన్యాయంగా అసువులు బాసిన 19 ఏళ్ల దళిత యువతి పేరును చట్ట ప్రకారం ఎవరు వెల్లడించడానికి వీల్లేదు. ఒకవేళ బాధితురాలు స్వయంగా అనుమతిస్తే పేరు బహిర్గతం చేయవచ్చు. ఈ కేసులో బాధితురాలు మరణించినందున ఆమె సమీప బంధువుల అంగీకారం తీసుకోవడంతోపాటు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన స్వచ్ఛంద సంక్షేమ సంఘం నుంచి అనుమతి తీసుకోవాలి. ఇలాంటివేవి లేకుండానే ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆ యువతి పేరును బహిర్గతం చేశారు. (హథ్రాస్ హైటెన్షన్ : రాహుల్, ప్రియాంక అరెస్ట్) ఠాకూర్ కులానికి చెందిన సందీప్, రాము, లవ్కుష్, రవి అనే యువకులు దారుణ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించినందున , పైగా ఆమె మరణించినందున బాధితురాలి పేరును బహిర్గతం చేయాల్సి వచ్చిందని అక్కడి పోలీసు వర్గాలు సమర్థించుకుంటున్నాయి గానీ అది సమంజసం కాదు. అయితే ఆ దళిత యువతి పేరు బయటకు రావడం వల్లనే హత్రాస్ జిల్లాలోని ఛాంద్‌పా ప్రాంతంలోని బూలగార్హిలో ఆమె కుటుంబం నివసిస్తోన్న విషయం మీడియాకు తెల్సింది. (నడుం, కాళ్లు విరిచి.. వరుస అఘాయిత్యాలు) ఆ గ్రామంలో అంటరానితనం ఇంకా రాజ్యమేలుతోంది. అందుకని అక్కడ ఠాకూర్లకు, దళితులకు అసలు పడదు. బాధితురాలి దళిత కుటుంబం నివసిస్తోన్న రోడ్డుకు ఆవలి పక్కనే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఠాకూర్ల కుటుంబం నివసిస్తోంది. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం బాధితురాలి తాతను ఆ ఠాకూర్ కుటుంబం పిలిపించి పశువుల కాపలా విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో చేతి వేళ్లు తెగ నరికారని తెల్సింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య కోపతాపాలు రగులుతూనే ఉన్నాయి. అయితే ఠాకూర్లదే ఎప్పుడు పైచేయిగా ఉంటూ వస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఠాకూర్లకు రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది. (యూపీ నిర్భయ పట్ల అమానవీయం) -
బాధితురాలిని చిత్రహింసలకు గురిచేశారు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై ఆధిపత్య కులానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. యువతి గర్భాశయం వద్ద తీవ్రమైన గాయాలున్నట్లు తేలింది. ఈ పైశాచిక దాడి అనంతరం యువతిని గొంతునులిమి చంపే ప్రయత్నం చేశారు. ఈ మేరకు బాధితురాలి మెడపై గుర్తులు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. (యూపీ సర్కార్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు) ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతం, శరీరంలోని ప్రధాన భాగాలన్నీ తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు కన్నుమూసింది. అయితే అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు జరిపించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితురాలు అయినందున బాధితురాలి పట్ల మరణంలోనూ క్రూరంగా వ్యవహరించిందని మండిపడ్డాయి. (యూపీ నిర్భయ పట్ల అమానవీయం) -
చంద్రశేఖర్ ఆజాద్ గృహ నిర్భందం
నోయిడా : ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా ర్యాలీ చేపట్టిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఆర్పిసి సెక్షన్ 144ను అతిక్రమించిన కారణంగా గృహ నిర్భందం చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన తమ పోరాటం ఆగదని ఆజాద్ స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని పేర్కొన్నారు. దళిత యువతి(19)పై జరిగిన దమనకాండకు నిరసనగా ఆజాద్ సమాజ్ పార్టీ, దళిత్ అనుకూల భీమ్ ఆర్మీ సంయుక్తంగా మంగళవారం దేశ రాజధానిలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి బయట నిరసనలు చేశారు. ఆంక్షలను ఉల్లంఘించిన కారణంగా నిరసనకారులను అరెస్ట్ చేస్తున్నట్లు అలీఘడ్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ జన సమూహాన్ని ఏర్పాటు చేసిన కారణంగా సహారన్పూర్లో పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. (అమ్మను బాధపడవద్దని చెప్పండి..) ఢిల్లీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన దళిత యువతి(19)కి అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు జరిపించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. తాజా పరిణామంపై రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితురాలు అయినందున బాధితురాలి పట్ల మరణంలోనూ పోలీసులు క్రూరంగా వ్యవహరించించారని మండిపడ్డాయి. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. (యూపీ నిర్భయ పట్ల అమానవీయం) -
హత్రాస్ ఉదంతం : ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో యువతిపై హత్యాచార ఘటనకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ నాలుగు వారాల్లోగా యూపీ ప్రభుత్వ యంత్రాంగం దీనిపై బదులివ్వాలని కోరింది. బాధిత బాలిక కుటుంబానికి, సాక్షులకు సరైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. రెండు వర్గాల మధ్య వివాదం నెలకొనే పరిస్ధితుల నేపథ్యంలో బాధిత మహిళ కుటుంబానికి హాని జరగకుండా చర్యలు చేపట్టాలని కోరింది. నిందితులకు ఎలాంటి జాప్యం లేకుండా శిక్ష పడేలా విచారణను వేగవంతం చేసేందుకు వ్యక్తిగతంగా ఈ అంశంపై చొరవ చూపాలని యూపీ డీజీపీని కమిషన్ కోరింది. చదవండి : హత్రాస్ హారర్ : యోగి రాజీనామాకు ప్రియాంక డిమాండ్ కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెకు తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను కోరారు. మరోవైపు హత్రాస్ హత్యాచార ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. -
హత్రాస్ హారర్ : యోగి రాజీనామాకు ప్రియాంక డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : యూపీలోని హత్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటనకు సంబంధించి యోగి సర్కార్‌పై విపక్షాలు విమర్శలు కురిపించాయి. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుస ట్వీట్లలో యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరోవైపు సామూహిక అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచిన యువతి భౌతిక కాయాన్ని పోలీసులు హడావిడిగా దహనం చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. (యూపీలో ‘నిర్భయ’) దళితులను అణిచివేస్తూ సమాజంలో వారి స్ధానం ఏంటో యూపీ ప్రభుత్వం చూపుతోందని, ఇది సిగ్గుచేటని రాహుల్ పేర్కొన్నారు. ‘భారత కుమార్తె లైంగిక దాడికి గురైంది..వాస్తవాలను దాచి ఆపై అంత్యక్రియలు జరుపుకునే హక్కును సైతం బాధిత కుటుంబానికి ఇవ్వకుండా వేధించారు..ఇది తీవ్ర అన్యాయ’మని రాహుల్ మరో ట్వీట్లో యోగి సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై రాహుల్ సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యోగి వైదొలగాలి : ప్రియాంక హత్యాచార ఘటనపై తాను బాధితురాలి తండ్రితో మాట్లాడానని ఆమె చెప్పారు. తన బిడ్డకు న్యాయం జరగాలని ఆయన తనతో చెప్పారని ప్రియాంక ట్వీట్ చేశారు. తన కుమార్తె భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపే అవకాశాన్నీ తనకు ఇవ్వలేదని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చివరికి మరణంలోనూ వారి మానవ హక్కులను కాలరాశారని ప్రియాంక యూపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కును మీరు కోల్పోయారని యోగి ఆదిత్యానాథ్‌ను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. కాగా, యూపీలోని హత్రాస్‌లో పశుగ్రాసం కోసం తల్లితో కలిసి ఈనెల 19న పొలానికి వెళ్లిన యువతిపై దుండగులు దారుణానికి ఒడిగట్టారు. లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఆమెను తీవ్రంగా గాయపరిచారు. రెండు వారాల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన బాధితురాలు మంగళవారం రాత్రి మరణించారు. చదవండి : కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం! -
యూపీలో ‘నిర్భయ’
న్యూఢిల్లీ/హాథ్రస్: నిర్భయ ఘటనను తలపించే మరో దారుణం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. 19 ఏళ్ల దళిత యువతిని నలుగురు అగ్రవర్ణ యువకులు అత్యంత దారుణంగా గాయపర్చి, పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ యువతి చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చనిపోయింది. తెగిన నాలుక, విరిగిన ఎముకలు, పూర్తిగా చచ్చుపడిపోయిన కాళ్లు, పాక్షికంగా పక్షవాతానికి గురైన చేతులు, మెడకు, వెన్నెముకకు అయిన తీవ్ర గాయాలు.. ఆ యువతిపై ఆ రాక్షసులు సాగించిన దమనకాండకు సాక్ష్యాలుగా నిలిచాయి. దేశవ్యాప్తంగా నిరసనలకు, నిర్భయ చట్టానికి కారణమైన 8 ఏళ్ల క్రితం నాటి నిర్భయ అత్యాచార ఘటనను ఈ దారుణం గుర్తుకు తెచ్చింది. దళిత యువతి మృతిపై పౌర సమాజ కార్యకర్తలు, దళిత సంఘాలు, భీమ్ ఆర్మీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించాయి. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వెలుపల భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో వేలాది మంది ధర్నాకు దిగారు. ఆ దళిత యువతికి న్యాయం చేయాలని, దోషులను బహిరంగంగా ఉరి తీయాలని నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా దళితులంతా వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఆజాద్ పిలుపునిచ్చారు. ఆటవిక రాజ్యం నడుస్తున్న యూపీలో మరో దళిత యువతి బలి అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో, యూపీలోని హాథ్రస్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని హాథ్రస్ ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. సందీప్, రాము, లవ్‌కుశ్, రవి తనపై అత్యాచారం చేశారని, వారిని అడ్డుకుంటుండగా, గట్టిగా గొంతు నులిమారని, అప్పుడు నాలుక తెగిందని బాధిత యువతి మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించింది. బాధిత మహిళను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించకుండా.. పరిస్థితి పూర్తిగా విషమించిన తరువాత, సోమవారం సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అలాగే, బాధితుల ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించలేదని, నాలుగైదు రోజుల తరువాత కేసు నమోదు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. అసలేం జరిగింది.. సుమారు రెండు వారాల క్రితం, సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాథ్రస్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం, బాధితురాలి సోదరుడు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఆ రోజు ఉదయం పశువులకు గడ్డి కోసేందుకు తల్లి, అన్నతో కలిసి ఆమె పొలంకు వెళ్లింది. కాసేపయ్యాక గడ్డిమోపుతో ఆమె సోదరుడు ఇంటికి తిరిగి వెళ్లాడు. యువతి తల్లికి కొద్ది దూరంలో ఉండి గడ్డి కోస్తుంది. ఇంతలో, వెనక నుంచి వచ్చిన ముష్కరులు ఆమె నోరు మూసి, చున్నీని మెడకు చుట్టి దూరంగా లాక్కెళ్లారు. కాసేపటికి కూతురు కనిపించడం లేదని గుర్తించిన తల్లి వెతకగా.. దారుణంగా అత్యాచారానికి గురై, రక్తమోడుతూ, ఒళ్లంతా గాయాలతో, అపస్మారక స్థితిలో కనిపించింది. మొదట, ఆమెను అలీçగఢ్లోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చేర్చారు. అయితే, చికిత్సకు స్పందించడం లేదని..మెడకు అయిన గాయం కారణంగా కాళ్లు పూర్తిగా, చేతులు పాక్షికంగా చచ్చుబడిపోయాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దాంతో, ఆమెను సోమవారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ వైద్యశాలకు తీసుకువచ్చారు. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందింది. అరెస్ట్ చేశాం.. నిందితులు అగ్రవర్ణాలకు చెందిన వారయినందున, ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదని వచ్చిన ఆరోపణలు సత్యదూరమని ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. ఆ నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని, బాధితురాలు మరణించినందున వారిపై పెట్టిన కేసుల్లో హత్యానేరం కింద ఐపీసీ 302 సెక్షన్‌ను కూడా చేరుస్తామన్నారు. 8 రోజులు ఏం చేశారు? ‘జవాబుల్లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఘటన జరిగిన తరువాత, ఫిర్యాదు అందిన తరువాత 8 రోజుల పాటు పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు? బాధిత యువతిని వెంటనే మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు? ఆ నలుగురు రాక్షసులపై ఎన్ఎస్ఏ(నేషనల్ సెక్యూరిటీ యాక్ట్) కింద కేసు ఎందుకు పెట్టలేదు? ఈ దారుణంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ ష్రినతే ప్రశ్నల వర్షం కురిపించారు. దళిత యువతి మృతికి మొత్తం సమాజం సిగ్గుతో తల దించుకోవాలని ఢిల్లీ సీఎంæ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ హత్యాచార ఘటనపై క్రికెటర్ కోహ్లి, బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, ఫర్హాన్ అఖ్తర్ ఆవేదనను వ్యక్తపరిచారు. వెల్లువెత్తిన నిరసనలు దళిత యువతి హత్యాచారంపై నిరసనలు వెల్లువెత్తాయి. ‘ప్రభుత్వం మా ఓపికను పరీక్షించవద్దు. వారిని ఉరి తీసేవరకు మేం విశ్రమించం’ అని భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ స్పష్టం చేశారు. ఆమెను ఎయిమ్స్‌కు మార్చి, మరింత మెరుగైన చికిత్స అందించాలన్న తన విజ్ఞప్తిని యూపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ యువతి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆజాద్ పేర్కొన్నారు. సమాచారం తీసుకున్నాం.. ఈ ఘటనకు సంబంధించి తీసుకున్న చర్యల వివరాలు చెప్పాలని పోలీసులను ఆదేశించామని జాతీయ మహిళాకమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
అమీన్పూర్లో మరో ‘ముజఫ్ఫర్‌పూర్’
-
అమీన్పూర్లో మరో ‘ముజఫ్ఫర్‌పూర్’
సాక్షి, హైదరాబాద్ : నిర్భయ వంటి చట్టాలు ఎన్ని వచ్చినా.. దిశ తరహా ఘటనలతో పోలీసు శాఖ గట్టి చర్యలు తీసుకుంటున్నా.. ఆడపిల్లలపై అకృత్యాలు మాత్రం ఆగడంలేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్ల చేతిలో అమాయకులైన అమ్మాయిలు బలైపోతూనే ఉన్నారు. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫ్ఫర్‌పూర్ షెల్టర్‌హోం కేసును తలపించే తరహా ఘటన మన రాష్ట్రంలోనే చోటుచేసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథాశ్రమంలో ఉంటున్న ఓ 14 ఏళ్ల దళిత క్రైస్తవ బాలిక కామాంధుడి చేతిలో ఏడాదిపాటు చిత్రహింసలు అనుభవించి.. చివరకు ప్రాణాలు కోల్పోయింది. చనిపోయే ముందు ఆమె అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. అనాథాశ్రమంలో ఏడాదిపాటు అత్యాచారానికి గురైన ఆ బాలిక.. అనంతరం దూరపు బంధువుల చేతిలో దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది. చివరకు సరైన వైద్యానికి నోచుకోక బుధవారం ప్రాణాలు విడిచింది. బాత్రూంలో జారిపడిందని... హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన ఓ బాలిక 2015లో తల్లిని, రెండేళ్లకు తండ్రిని కోల్పోయింది. ఈ క్రమంలో వరుసకు మేనమామ అయిన సామ్యూల్ అనే వ్యక్తి ఆమెను 2015లో నగర శివార్లలోని అమీన్పూర్ పరిధిలో ఉన్న మారుతి అనాథశ్రమంలో చేర్పించాడు. అక్కడే ఐదో తరగతి వరకు చదుకుంది. ప్రతి ఏటా సెలవుల్లో కొన్నిరోజులపాటు దూరపు బంధువులైన బావ అనిల్, పిన్ని ప్రీతి ఇళ్లలో ఉంటుండేది. ఈ నేపథ్యంలో ఆ బాలిక బాత్రూంలో జారిపడటంతో గాయమైందని, ఇంటికి తీసుకెళ్లాలని అనాథాశ్రమం నిర్వాహకులు నుంచి అనిల్‌కు ఫోన్ వచ్చింది. దీంతో ఆయన ఈ ఏడాది మార్చి 21న ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలిక.. నియంత్రణ లేకపోవడంతో బట్టల్లోనే మలవిసర్జన చేసేది. అన్నం తినేటప్పుడు వాంతులు చేసుకునేది. దీంతో వారు జూలై 29న తిరిగి ఆమెను అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. అయితే, అనాథశ్రమం నిర్వాహకురాలు విజయ ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించడంతో ప్రీతి ఇంటికి తీసుకెళ్లారు. బాలిక పరిస్థితిని చూసి ఆమె గట్టిగా ప్రశ్నించడంతో అనాథశ్రమంలో తనపై జరిగిన అకృత్యాలను బయటపెట్టింది. అనంతరం జూలై 31న బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జ్యూస్ తాగించి ఘాతుకం... అనాథశ్రయం నిర్వాహకురాలు, ప్రిన్స్‌పల్ విజయ ఆ బాలికను భవనంలోని ఐదో అంతస్తులోకి పంపించేది. అక్కడికి వేణుగోపాల్ అనే వ్యక్తి వచ్చి బాలికతో బలవంతంగా జ్యూస్ తాగించేవాడు. అది తాగిన వెంటనే ఆమె స్పృహ కోల్పోయేది. మెలకువ వచ్చేసరికి ఒంటిపై దుస్తులు లేకుండా తీవ్ర గాయాలతో ఉండేది. వివస్త్రగా స్పృహ లేకుండా పడి ఉన్న ఆ బాలికను తోటి బాలికలు లేపి దుస్తులు తొడిగేవారు. ఇలా ఏడాది పాటు విజయ సహకారంతో వేణుగోపాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక పేర్కొంది. వేణుగోపాల్ తనతో చెడుగా ప్రవర్తిస్తున్నాడని విజయ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె తనను బెదిరించినట్టు తెలిపింది. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిందని, దీంతో ఏ దిక్కూమొక్కూ లేని తనకు ఉన్న ఆశ్రయం కూడా పోతుందనే భయంతో ఏడాదిపాటు మౌనంగా భరించానని వెల్లడించింది. వేణుగోపాల్ నుంచి విజయ డబ్బులు తీసుకునేదని.. ఇతర దాతల నుంచి విరాళాలు కూడా తెచ్చి ఆమెకు ఇచ్చేవాడని తెలిపింది. వైద్యం అందక నరకయాతన.. బాత్రూంలో జారిపడి గాయపడిన బాలికకు అనాథశ్రమం నిర్వహకురాలు విజయ వైద్యం అందించలేదు. అనంతరం మార్చి 21న అనాథశ్రమం నుంచి ఆ బాలికను అనిల్ ఇంటికి తీసుకెళ్లగా.. అప్పటి నుంచి దాదాపు మూడు నెలలపాటు ఎలాంటి వైద్యం లేకుండానే తీవ్ర అనారోగ్యంతో గడిపింది. పలుమార్లు అత్యాచారానికి గురికావడంతో ఆమె మర్మాంగాల్లో ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో వ్యాపించింది. మలద్వారం వద్ద మలాన్ని నియంత్రించి ఉంచే కండరం పనిచేయడం మానేయడంతో ఆమె బట్టల్లోనే మలవిసర్జన చేసుకునేది. మూత్రాశ్రయంలో ఇన్ఫెక్షన్తో అప్పటికే బాలిక నడవలేని స్థితికి చేరుకుందని దూరపు బంధువులు పేర్కొంటున్నారు. జూలై 31న భరోసా కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్థారించారు. అయితే, బాలిక తీవ్ర అనారోగ్యంతో ఉన్నా భరోసా కేంద్రం నిర్వాహకులు ఆమెను ప్రీతితోపాటు ఇంటికి పంపించారు. ఈ విషయం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలియడంతో వారు బాలికను పిలిపించి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం నింబోలి అడ్డాలోని మరో బాలికల సంరక్షణ గృహానికి తరలించారు. ఆరోగ్యం పూర్తిగా విషమించిన తర్వాత ఈ నెల 4న ఆమెను నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. తలకు తగిలిన గాయం వల్ల మెదడులో రక్తం గడ్డకట్టడంతో బాలిక బ్రెయిన్‌డెడ్ అయిందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు దుస్తుల్లో మలవిసర్జన చేస్తుండటంతో అనిల్, అతడి భార్య కీర్తన ఆ బాలిక తీవ్రంగా కొట్టారనే ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుగోపాల్‌తోపాటు అతడికి సహకరించిన విజయ, ఆమె సోదరుడు జయపాల్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అనాథాశ్రమంలో ఉన్న 60 మందికి పైగా బాలికలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నగరంలోని ఇతర సంరక్షణ గృహాలకు తరలించింది. విచారణకు కమిటీ... అనాథాశ్రమంలో అత్యాచారానికి గురై బాలిక మృతిచెందడంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మేల్కొంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపడానికి బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బి.అపర్ణ, బాలల సంక్షేమ సంఘం కమిటీ సభ్యురాలు అన్నపూర్ణ దేవి, వుమెన్స్ సేప్టీ వింగ్ డి.ప్రతాప్, మహిళా కమిషన్ కార్యదర్శి జీకే సునందలతో కమిటీని ఏర్పాటు చేస్తూ స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ కమిషనర్ డి.దివ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి ఈ నెల 20లోగా నివేదిక సమర్పించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించి వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన అన్ని కేసులను ఒక చోట చేర్చి ఏఎస్పీ/ఏసీపీ స్థాయి అధికారితో దర్యాప్తు జరిపించాలని, నిందితులకు శిక్షణ పడేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశారు.