పట్నం బజారు (గుంటూరు), పెదకాకాని: ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో మోసగించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై శుక్రవారం గుంటూరులో టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కానిస్టేబుళ్లను నిర్బంధించే యత్నం చేశారు.
సీఐ స్థాయి అధికారి వారిస్తున్నా వినకుండా బరి తెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం గుంటూరు స్వర్ణభారతీనగర్‌లో నివాసం ఉంటున్న టీడీపీ నేత చల్లా లక్ష్మీనారాయణ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో వంచించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు నాగార్జున వర్సిటీలో చదివిన సమయంలో అక్కడ కాంట్రాక్టర్‌గా పని చేసిన లక్ష్మీనారాయణ పరిచయం పెంచుకుని శారీరకంగా లొంగదీసుకున్నాడు.
అప్పటికే అతడికి వివాహం అయిందని తెలియడంతో నిలదీసిన బాధితురాలిని నగ్న వీడియోలు, ఫోటోలు చూపించి బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం పెళ్లి చేసుకున్న బాధితురాలి భర్తను కూడా బెదిరించి వారి కాపురాన్ని విచ్ఛిన్నం చేశాడు. తన కుమార్తె జీవితం అన్యాయమైందనే బాధతో బాధితురాలి తండ్రి ఈ ఏడాది ఆగస్టులో గుండెపోటుతో మరణించాడు. దీంతో నిందితుడు లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
టీడీపీ కార్యాలయంలో నక్కిన నిందితుడు: సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడి లైవ్ లొకేషన్‌ను గుర్తించిన కానిస్టేబుళ్లు ఇర్ఫాన్, మణిప్రసాద్ అతడి కారును వెంబడిస్తూ గుంటూరు అరండల్‌పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు.
పోలీసులను గుర్తించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ సమక్షంలోనే దాడికి యత్నించారు. తాము పోలీసులమని చెబుతున్నా వినకుండా దాడికి పాల్పడ్డారు. అనంతరం సీఐ సురేష్‌బాబు అక్కడకు చేరుకోవడంతో నిందితుడు చల్లా లక్ష్మీనారాయణ ఇక్కడ లేడంటూ బుకాయించారు. అయితే లక్ష్మీనారాయణను టీడీపీ కార్యాలయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మెల్లగా జారుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment