
సీఎంకు ట్వీట్: 'దయుంచి నన్ను చంపేయండి'
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఓ దళిత రేప్ బాధితురాలు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగ్రాకు చెందిన ఆమెపై కొద్ది రోజుల క్రితం గ్యాంగ్‌రేప్ జరిగింది. నిందితులను ఇంకా శిక్షించకపోవడంపై ప్రశ్నిస్తూ యోగి ఆదిత్యనాథ్‌కు ఆమె ట్వీట్ చేసింది. ఒక్కొ క్షణం నరకం అనుభవిస్తున్నానని తనపై దారుణానికి ఒడిగట్టిన వాళ్లు మాత్రం యథేచ్చగా తిరుగుతున్నారని పేర్కొంది.
ఆమె ట్వీట్‌లో ఏం ఉందంటే.. 'నేనొక దళిత అమ్మాయిని. నాపై ఈ ఏడాది మే నెల 2వ తేదీన గ్యాంగ్‌రేప్ జరిగింది. ఈ రోజు వరకూ నిందితులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. దయచేసి నాకు న్యాయం చేయండి (లేదా) కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి' అని బాధితురాలు తన గోడును వెళ్లబోసుకుంది. ట్వీట్‌లో పోలీసు ఫిర్యాదు, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్‌కు చేసిన ఫిర్యాదుల పత్రాలను కూడా బాధితురాలు జత చేసింది. బాధితురాలి ట్వీట్ అనంతరం రాష్ట్రంలో ప్రతిపక్షం అధికార పార్టీపై విరుచుకుపడింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని పేర్కొంది.