లక్నో: హథ్రాస్ అత్యాచార కేసు విచారణకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బృందానికి ప్రభుత్వం మరో పది రోజుల గడువును పొడిగించింది. వాస్తవానికి ఈ ఘటనకు సంబంధించి ‘సిట్’ బుధవారమే తన నివేదికను సమర్పించాల్సి ఉంది. మరింత లోతుగా కేసు దర్యాప్తు చేసేందుకు సిట్ బృందానికి మరో 10 రోజుల గడువును పెంచినట్లు తెలుస్తోంది. హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందంలో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులు సహా బాధితురాలి కుటుంబసభ్యులకు కూడా నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయాల్సిందిగా భావిస్తున్నారు. (హథ్రాస్ ఘటన.. రూ.50 లక్షలు ఇస్తామన్నారట!)
ఇక ఈ కేసులో ఇప్పటికే సిట్ సూచనల మేరకు జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్‌లను యోగి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, హథ్రాస్ గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న దళిత యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం ఆమె మరణించింది. అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు జరిపించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా హడావుడిగా అంత్యక్రియలు ముగించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (హథ్రాస్ రేప్ కేసులో అనుమానాలెన్నో)
Comments
Please login to add a commentAdd a comment