
సాక్షి,న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో టూరిజం ప్రాజెక్టుల జాబితాలో తాజ్‌మహల్‌ను చేర్చకపోవడంతో యోగిని రాహుల్ టార్గెట్ చేశారు. యోగిని పనికిమాలిన పాలకుడని అభివర్ణించారు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరొందిన తాజ్‌మహల్‌ను యోగి సర్కార్ మతం దృష్టితోనే విస్మరించిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజ్‌మహల్ భారత సంస్కృతిని ప్రతిబింబించదని యోగి గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా విపక్షాలు ప్రస్తావించాయి.
గత వారం విడుదల చేసిన టూరిజం కేంద్రాలతో కూడిన బుక్‌లెట్‌లో నైమిషారణ్యం, అలహాబాద్, చిత్రకూట్ సహా ఇతర పేర్లున్నా ఆగ్రా లేదా తాజ్‌మహల్‌ల ప్రస్తావన లేకపోవడం వివాదాస్పదమైంది. ఈ ఉదంతంపై రాహుల్ సీఎం యోగిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. సూర్యుడి వద్ద కొవ్వొత్తి వెలిగించడంలో విఫలమైనంత మాత్రాన అది తన వెలుగును ఎంతమాత్రం కోల్పోదని ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాహుల్‌తో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు సైతం తాజ్‌మహల్‌ను యూపీ సర్కార్ విస్మరించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు చూడాలని భావించే ప్రదేశం తాజ్‌మహల్ అని, ఇది యూపీ ఆదాయానికీ ఉపకరిస్తుందని సీపీఐ(ఎం) నేత బృందాకరత్ అన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన తాజ్‌మహల్‌ను విస్మరించిన యూపీ సీఎం యోగి అమాయకత్వాన్ని చూసి ప్రజలంతా నవ్వుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మతపరమైన గుర్తింపు ఇవ్వాలని పాలక ప్రభుత్వం భావిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment