
అమ్మా, నాన్న అందరూ ఆమె నుంచి దూరమయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కూలీ కోసం పట్టణం వెళ్లిందా దళిత యువతి. అక్కడ ఓ తాపీ మేస్త్రీ ప్రేమించానని నమ్మబలికాడు. కపట ప్రేమను ఒలకబోశాడు. అతడి మాయలో ఆమె గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోవాలని అడగడంతో కొంత డబ్బు ముట్టజెప్పి వదిలించుకుందామని ప్లాన్ చేశాడా మేస్త్రీ. నిస్సహాయ స్థితిలో ఉన్న యువతి వేదన ఆమె మాటల్లోనే..
మంచిర్యాలక్రైం: మాది మందమర్రి మండలం రామకృష్ణాపూర్. నాకు ఊహ తెలియని వయసులో మా నాన్న చనిపోయాడు. నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. తోబుట్టువులు ఎవ్వరూ లేరు. అనాథనైన నన్ను మా పెద్దమ్మ పెంచి పెద్ద చేసింది. వాళ్లకు నేను భారం కావద్దని కూలీ పని చేసుకుంటూ బతకాలని నిర్ణయించుకున్నా. రామకృష్ణాపూర్ నుంచి రోజూ మంచిర్యాలకు కూలీ పనికి వెళ్లొచ్చేదాన్ని. నాతో పాటు తాపీ మేస్త్రీగా పని చేస్తున్న మంచిర్యాలలోని ఎడ్ల వాడకు చెందిన చౌదరి శంకర్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నా అనే వాళ్లేవరూలేక ఆయన ప్రేమ పొందానని సంతోషపడ్డాను. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల తర్వాత మేం మంచిర్యాలలోని ఓ అద్దె ఇంట్లో సహజీవనం సాగించాం. ఈ క్రమంలో నేను గర్భం దాల్చాను. ఆ తర్వాత శంకర్‌పై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాను. వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని తప్పించుకు తిరిగాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెంచడంతో వాళ్ల సంబందీకులతో నన్ను చంపేస్తానని బెదిరించాడు.
శీలానికి వెల కట్టి..
అబార్షన్ చేయించుకొమ్మని శంకర్ జోలికి రాకుండా ఉండాలని రూ.2.25 లక్షలు ఇప్పిస్తామని చెప్పి లక్ష రూపాయలు బ్యాంకులో వేశారు. అబార్షన్ చేయించేందుకు పెద్ద మనుషులు నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికి నేను ఎనిమిది నెలల గర్భవతిని, డాక్టర్లు అబార్షన్ చేయడం కుదరదని చెప్పారు.
శంకర్ జైలుకు పోతే నాకు దిక్కెవరు?
న్యాయం చేయాలని నేను పోలీసులను ఆశ్రయించాను. పంచాయతీ చెప్పిన పెద్ద మనుషుల మీద, నన్ను ప్రేమించిన శంకర్ మీద కేసులు పెట్టిండ్రు. రోజూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. నాకు దిక్కు.. దీము ఎవరూ లేరు. శంకర్ జైలుకు పోతే నాకు దిక్కెవరు. నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటే ఏమని చెప్పాలి? నా గోడు వినేదేవరు? శంకర్ జైలుకు పోతే నన్ను పట్టించుకునేవారు ఎవరు? నాకూ, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు న్యాయం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment