అమీన్‌పూర్‌లో మరో ‘ముజఫ్ఫర్‌పూర్‌’ | Molestation on dalit girl in ameenpur she departed | Sakshi
Sakshi News home page

అమీన్‌పూర్‌లో మరో ‘ముజఫ్ఫర్‌పూర్‌’

Published Thu, Aug 13 2020 1:06 AM | Last Updated on Thu, Aug 13 2020 3:58 PM

Molestation on dalit girl in ameenpur she departed - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : నిర్భయ వంటి చట్టాలు ఎన్ని వచ్చినా.. దిశ తరహా ఘటనలతో పోలీసు శాఖ గట్టి చర్యలు తీసుకుంటున్నా.. ఆడపిల్లలపై అకృత్యాలు మాత్రం ఆగడంలేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్ల చేతిలో అమాయకులైన అమ్మాయిలు బలైపోతూనే ఉన్నారు. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫ్ఫర్‌పూర్‌ షెల్టర్‌హోం కేసును తలపించే తరహా ఘటన మన రాష్ట్రంలోనే చోటుచేసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథాశ్రమంలో ఉంటున్న ఓ 14 ఏళ్ల దళిత క్రైస్తవ బాలిక కామాంధుడి చేతిలో ఏడాదిపాటు చిత్రహింసలు అనుభవించి.. చివరకు ప్రాణాలు కోల్పోయింది. చనిపోయే ముందు ఆమె అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. అనాథాశ్రమంలో ఏడాదిపాటు అత్యాచారానికి గురైన ఆ బాలిక.. అనంతరం దూరపు బంధువుల చేతిలో దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది. చివరకు సరైన వైద్యానికి నోచుకోక బుధవారం ప్రాణాలు విడిచింది.

బాత్‌రూంలో జారిపడిందని...
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన ఓ బాలిక 2015లో తల్లిని, రెండేళ్లకు తండ్రిని కోల్పోయింది. ఈ క్రమంలో వరుసకు మేనమామ అయిన సామ్యూల్‌ అనే వ్యక్తి ఆమెను 2015లో నగర శివార్లలోని అమీన్‌పూర్‌ పరిధిలో ఉన్న మారుతి అనాథశ్రమంలో చేర్పించాడు. అక్కడే ఐదో తరగతి వరకు చదుకుంది. ప్రతి ఏటా సెలవుల్లో కొన్నిరోజులపాటు దూరపు బంధువులైన బావ అనిల్, పిన్ని ప్రీతి ఇళ్లలో ఉంటుండేది. ఈ నేపథ్యంలో ఆ బాలిక బాత్‌రూంలో జారిపడటంతో గాయమైందని, ఇంటికి తీసుకెళ్లాలని అనాథాశ్రమం నిర్వాహకులు నుంచి అనిల్‌కు ఫోన్‌ వచ్చింది. దీంతో ఆయన ఈ ఏడాది మార్చి 21న ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలిక.. నియంత్రణ లేకపోవడంతో బట్టల్లోనే మలవిసర్జన చేసేది. అన్నం తినేటప్పుడు వాంతులు చేసుకునేది. దీంతో వారు జూలై 29న తిరిగి ఆమెను అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. అయితే, అనాథశ్రమం నిర్వాహకురాలు విజయ ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించడంతో ప్రీతి ఇంటికి తీసుకెళ్లారు. బాలిక పరిస్థితిని చూసి ఆమె గట్టిగా ప్రశ్నించడంతో అనాథశ్రమంలో తనపై జరిగిన అకృత్యాలను బయటపెట్టింది. అనంతరం జూలై 31న బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

జ్యూస్‌ తాగించి ఘాతుకం...
అనాథశ్రయం నిర్వాహకురాలు, ప్రిన్స్‌పల్‌ విజయ ఆ బాలికను భవనంలోని ఐదో అంతస్తులోకి పంపించేది. అక్కడికి వేణుగోపాల్‌ అనే వ్యక్తి వచ్చి బాలికతో బలవంతంగా జ్యూస్‌ తాగించేవాడు. అది తాగిన వెంటనే ఆమె స్పృహ కోల్పోయేది. మెలకువ వచ్చేసరికి ఒంటిపై దుస్తులు లేకుండా తీవ్ర గాయాలతో ఉండేది. వివస్త్రగా స్పృహ లేకుండా పడి ఉన్న ఆ బాలికను తోటి బాలికలు లేపి దుస్తులు తొడిగేవారు. ఇలా ఏడాది పాటు విజయ సహకారంతో వేణుగోపాల్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక పేర్కొంది. వేణుగోపాల్‌ తనతో చెడుగా ప్రవర్తిస్తున్నాడని విజయ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె తనను బెదిరించినట్టు తెలిపింది. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిందని, దీంతో ఏ దిక్కూమొక్కూ లేని తనకు ఉన్న ఆశ్రయం కూడా పోతుందనే భయంతో ఏడాదిపాటు మౌనంగా భరించానని వెల్లడించింది. వేణుగోపాల్‌ నుంచి విజయ డబ్బులు తీసుకునేదని.. ఇతర దాతల నుంచి విరాళాలు కూడా తెచ్చి ఆమెకు ఇచ్చేవాడని తెలిపింది. 

వైద్యం అందక నరకయాతన..
బాత్‌రూంలో జారిపడి గాయపడిన బాలికకు అనాథశ్రమం నిర్వహకురాలు విజయ వైద్యం అందించలేదు. అనంతరం మార్చి 21న అనాథశ్రమం నుంచి ఆ బాలికను అనిల్‌ ఇంటికి తీసుకెళ్లగా.. అప్పటి నుంచి దాదాపు మూడు నెలలపాటు ఎలాంటి వైద్యం లేకుండానే తీవ్ర అనారోగ్యంతో గడిపింది. పలుమార్లు అత్యాచారానికి గురికావడంతో ఆమె మర్మాంగాల్లో ఇన్‌ఫెక్షన్‌ తీవ్ర స్థాయిలో వ్యాపించింది. మలద్వారం వద్ద మలాన్ని నియంత్రించి ఉంచే కండరం పనిచేయడం మానేయడంతో ఆమె బట్టల్లోనే మలవిసర్జన చేసుకునేది. మూత్రాశ్రయంలో ఇన్‌ఫెక్షన్‌తో అప్పటికే బాలిక నడవలేని స్థితికి చేరుకుందని దూరపు బంధువులు పేర్కొంటున్నారు. జూలై 31న భరోసా కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్థారించారు. అయితే, బాలిక తీవ్ర అనారోగ్యంతో ఉన్నా భరోసా కేంద్రం నిర్వాహకులు ఆమెను ప్రీతితోపాటు ఇంటికి పంపించారు. ఈ విషయం చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి తెలియడంతో వారు బాలికను పిలిపించి వాంగ్మూలం తీసుకున్నారు.

అనంతరం నింబోలి అడ్డాలోని మరో బాలికల సంరక్షణ గృహానికి తరలించారు. ఆరోగ్యం పూర్తిగా విషమించిన తర్వాత ఈ నెల 4న ఆమెను నీలోఫర్‌ ఆస్పత్రిలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. తలకు తగిలిన గాయం వల్ల మెదడులో రక్తం గడ్డకట్టడంతో బాలిక బ్రెయిన్‌డెడ్‌ అయిందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు దుస్తుల్లో మలవిసర్జన చేస్తుండటంతో అనిల్, అతడి భార్య కీర్తన ఆ బాలిక తీవ్రంగా కొట్టారనే ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుగోపాల్‌తోపాటు అతడికి సహకరించిన విజయ, ఆమె సోదరుడు జయపాల్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అనాథాశ్రమంలో ఉన్న 60 మందికి పైగా బాలికలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నగరంలోని ఇతర సంరక్షణ గృహాలకు తరలించింది.

విచారణకు కమిటీ...
అనాథాశ్రమంలో అత్యాచారానికి గురై బాలిక మృతిచెందడంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మేల్కొంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపడానికి బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు బి.అపర్ణ, బాలల సంక్షేమ సంఘం కమిటీ సభ్యురాలు అన్నపూర్ణ దేవి, వుమెన్స్‌ సేప్టీ వింగ్‌ డి.ప్రతాప్, మహిళా కమిషన్‌ కార్యదర్శి జీకే సునందలతో కమిటీని ఏర్పాటు చేస్తూ స్టేట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీ కమిషనర్‌ డి.దివ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి ఈ నెల 20లోగా నివేదిక సమర్పించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించి వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన అన్ని కేసులను ఒక చోట చేర్చి ఏఎస్పీ/ఏసీపీ స్థాయి అధికారితో దర్యాప్తు జరిపించాలని, నిందితులకు శిక్షణ పడేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement