పల్నాడు జిల్లా జూలకల్లులో ఘోరం
వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని మనీషాని వేధిస్తున్న టీడీపీ నేత, సమీప బంధువులు
భరించలేక సాగర్ కెనాల్‌లో దూకినట్టు అనుమానం
కాలువ గట్టుపై యువతి చెప్పులు, చున్నీ, సూసైడ్ లెటర్ గుర్తింపు
సాక్షి, నరసరావుపేట/పిడుగురాళ్ల రూరల్: టీడీపీ నేతల వేధింపులు తాళలేక ఓ దళిత యువతి మంగళవారం సాగర్ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. జూలకల్లుకు చెందిన రాముడు, కుమారి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. ప్రభుత్వ రేషన్ డిపో నడిపే రాముడు గతేడాది అక్టోబర్ 6న చనిపోయాడు. అప్పటినుంచి మూడో కుమార్తె మనీషా ఆ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది.
ఎన్నికల్లో మనీషా కుటుంబం వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటు వేసిందన్న కక్షతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఆయన అనుచరులైన ఆమె సమీప బంధువులు రేషన్ షాపు వదులుకోవాలని బెదిరించి, దాడులకు దిగారు. వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ దగ్గరకు పిలిపించి షాపు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయడంతో ఆమె అంగీకరించక తప్పలేదు. ఆ దుకాణం మనీషా తల్లి పేరిట ఉండటంతో ఆమె చేత వేలి ముద్ర వేయించుకొని గత నెల నుంచి రేషన్‌ను టీడీపీ నాయకులే పంపిణీ చేశారు. అది చాలదన్నట్టు మనీషా కుటుంబం రేషన్ వాడుకున్నారని, దానికి డబ్బులు చెల్లించాలని అధికారులు, టీడీపీ నాయకులు హుకుం జారీ చేశారు.
అంత డబ్బు ఇవ్వలేమని, కొంత కడతామని చెప్పినా వినకుండా వరుసకు అన్న అయ్యే లంజపల్లి వెంకటేశ్వర్లు, ఆయన తండ్రి పిచ్చయ్య మనీషాపై దాడిచేసి, మానసికంగా హింసించారు. అప్పటి నుంచి చనిపోతానంటూ మనీషా ఏడుస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆమె కనిపించకపోవడంతో బంధువులు, గ్రామస్తులు వెతగ్గా సాగర్ కెనాల్ గట్టుపై చెప్పులు, చున్నీ, ఓ లేఖ కనిపించాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రేషన్ షాపు వదులుకోకపోతే ఏం చేస్తారోనన్న భయంతోనే తన బిడ్డ చనిపోయిందని తల్లి కుమారి కన్నీరు మున్నీరవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment