ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్ జిల్లాలో దుండగుల అమానుషత్వానికి బలైన పందొమ్మిదేళ్ల దళిత యువతికి మరణానంతరం కూడా అగౌరవమూ, అవమానమూ తప్పలేదు. ఇందుకు సాక్షాత్తూ రాజ్యమే కారణం కావడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఊహకందనిది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో పది రోజులపాటు మృత్యువుతో పోరాడి మంగళవారం ఉదయం కన్నుమూసిన ఆ యువతి భౌతిక కాయాన్ని కుటుంబసభ్యుల ప్రమేయం లేకుండా పోలీసులే అర్థరాత్రి ఆమె గ్రామానికి తరలించుకు పోవడం, కుటుంబసభ్యులెవరూ లేకుండా వారే అంత్యక్రియలు పూర్తి చేయడం ఎలాంటివారికైనా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. వాహనానికి అడ్డొచ్చిన యువతి తల్లిదండ్రుల్నీ, ఆమె అన్నాచెల్లెళ్లనూ పక్కకు నెట్టి, ఆ తర్వాత వారిని వారింట్లోనే బంధించి ఈ తతంగమంతా పూర్తిచేయడం దేశం మొత్తం సిగ్గుతో తలదించుకునే విషయం. ఆమె భౌతికకాయాన్ని అప్పగిస్తే ఇంటికి తీసుకెళ్తామని ఆ యువతి తల్లిదండ్రులు అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో పోలీసుల కాళ్లావేళ్లాపడిన తీరు హృదయ విదారకమైనది.
ఆ దృశ్యాలు చాన్నాళ్లవరకూ అందరినీ వెంటాడుతూనే వుంటాయి. అసలు ఆ మృత దేహం పోలీసులు స్వాధీనం చేసుకున్న తీరే పెద్ద మిస్టరీగా వుంది. తెల్లారుజామున 4 గంటలకు ఆమె మరణించిందని తెలిసి, స్వగ్రామానికి తీసుకెళ్లడానికి కుటుంబం ఏర్పాట్లు చేసుకుని 6 గంటల సమయంలో అడిగేసరికే ఆసుపత్రి అధికారులు పోలీసులకు అప్పగించామని చెప్పారు. ఆ సమయం నుంచి అర్థరాత్రి వరకూ ఆ యువతి భౌతికకాయం ఎక్కడుంచారో తెలియదు. కనీసం స్వాధీనం చేసుకున్న వెంటనే ఆమె స్వస్థలానికి తరలించినా మధ్యాహ్నానికి అంత్యక్రియలు పూర్తయ్యేవి. ఈ మొత్తం వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టు గురువారం సుమోటాగా తీసుకుని ఉన్నతాధికారులను తన ఎదుట హాజరుకావాలని ఆదేశించడం మంచి పరిణామం. ఆ మృతదేహానికి పోలీసులు నిర్వ హించినవి ఏ ప్రమాణాలతో చూసినా అంత్యక్రియలు కాదు. మీడియా కథనాలనుబట్టి పోలీసులు తమవెంట తెచ్చిన ప్లాస్టిక్ డబ్బానుంచి ఒక ద్రవాన్ని చితిపై పోసి నిప్పుపెట్టారు.
తాము నమ్మే హిందూ మత విశ్వాసాల ప్రకారం పవిత్ర జలాలను చితిపై జల్లి, అనంతరం దహనం చేయాలని... దానికి ముందు ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులు చెబుతున్నారు. పైగా అర్థరాత్రి శవదహనం చేయడం తమ ఆచారానికి విరుద్ధమని జిల్లా మేజిస్ట్రేట్ కాళ్లావేళ్లా పడ్డారు. తమ కుమార్తెను చివరి సారి చూసుకోలేకపోయామని చింతిస్తున్నారు. శాంతిభద్రతల పరిస్థితి తలెత్తకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్న కారణం చెల్లదు. అలాంటి సమస్య తలెత్తుతుందనుకుంటే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత వారిదే. అంతేతప్ప ఆ మాటున పౌరుల విశ్వాసాలను కాలరాసే హక్కు వారికి లేదు. హథ్రాస్‌లో అమానుషంగా వ్యవహ రించిన పోలీసులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఉండకపోవచ్చుగానీ... ఏ మతస్తులకైనా చావుపుట్టు కల సమయాల్లో పాటించాల్సిన విధివిధానాలపై విశ్వాసాలుంటాయి.
వాటిని నిర్వర్తించలేకపోవ డాన్ని వారు అపచారంగా భావిస్తారు. అది జీవితాంతం వారిని వెంటాడుతుంది. కశ్మీర్‌లో ఉగ్రవా దులు పోలీసుల చేతుల్లో మరణించిన సందర్భాల్లో ఈ విధానం అమలవుతోందని చెబుతున్నారు. కానీ ఈ ఉదంతంలో మరణించినామె ఒక సాధారణ దళిత కుటుంబానికి చెందిన యువతి. అసలు అత్యాచారం జరిగిందని ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు వ్యవహరించిన తీరు అక్కడి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికిగానీ, పోలీసు విభాగానికి గానీ ప్రతిష్ట తెచ్చేది కాదు. గత నెల 14న ఫిర్యాదు వస్తే ఎంతో జాప్యం తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తొలుత అత్యాచారం ఆరోపణ చేర్చడానికి పోలీసులు సిద్ధపడలేదు. ఆ యువతికి చెందిన వాల్మీకి కులస్తులు ఒత్తిడి చేశాకే ఆ పనిచేశారు. ఇప్పుడు ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు కూడా అయ్యాక అత్యాచారం జరగలేదని, తీవ్ర గాయాలు కూడా లేవని పోలీసులు మాట్లాడుతున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది.
ఫోరెన్సిక్ నివేదికను అందుకు సాక్ష్యంగా చూపుతున్నారు. యువతి చావుబతుకుల్లో వుండగా ఇచ్చిన వాంగ్మూలంలో తనపై నలుగురు యువకులు అత్యాచారం చేశారని చెప్పింది. మరణ వాంగ్మూలాన్ని మన చట్టాలు నూరుశాతం నమ్ముతాయి. ఆఖరి ఘడియల్లో వున్నవారు అబద్ధం చెప్పరన్నది దానికి ప్రాతిపదిక. పైగా యువతి మర్మావయవంపై తీవ్ర గాయాలున్నాయని తొలుత పరీక్షించిన లేడీ డాక్టర్ నిర్ధారించారు. అత్యాచారం జరిగిందో లేదో తేల్చాల్సింది ఫోరెన్సిక్ నిపుణులే. అయితే నిర్భయ చట్టం ప్రకారం అత్యాచారానికి సంబంధించిన ఇతరత్రా సాక్ష్యం లభ్యం కానప్పుడు మర్మావయవంపై గాయం ఆధారంగా అత్యాచారం జరిగిందని భావించవచ్చు. అంటే దుండగులపై అత్యాచారం కేసు పెట్టడానికి లేడీ డాక్టర్ ఇచ్చిన నివేదికే సరిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది గమ నిస్తే యువతికి న్యాయం చేయడం కంటే ఆ దుండగులను కాపాడటానికే పోలీసులు ప్రాధాన్య మిస్తున్నట్టు కనబడుతోంది.
ఒకపక్క హథ్రాస్ ఉదంతాన్ని చల్లార్చడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగానే బలరాంపూర్ అనేచోట కాలేజీలో చేరడానికి ఇంటినుంచి వెళ్లిన 22 ఏళ్ల దళిత యువతి అత్యాచారానికి గురై, శవమై ఇంటికొచ్చింది. ఆమె ఒంటినిండా గాయాలున్నాయని మీడియా కథనాలు చెబుతుండగా హథ్రాస్ మాదిరే ఇక్కడ కూడా పోలీసులు వేరే కథనం వినిపిస్తున్నారు. ఆమె ఒంటిపై గాయాలే లేవంటు న్నారు. గత రెండు మూడు నెలలుగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అత్యాచారాల పరంపరపై ఇప్పటి కైనా యోగి ప్రభుత్వం మేల్కొనాలి. అమానుష ఘటనలు జరిగినప్పుడు ఫిర్యాదు సమయంలోనే కప్పెట్టే ప్రయత్నాలు, అది సాధ్యంకాకపోతే అసలు అత్యాచారమే జరగలేదన్న దబాయింపులు పరి స్థితిని ఏమాత్రం మెరుగుపరచవు. అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి, బాధితులపట్ల సున్ని తంగా వ్యవహరించే సంస్కృతిని పెంపొందిస్తే తప్ప అది సాధ్యం కాదు.
Comments
Please login to add a commentAdd a comment