
ఉన్నావ్: యూపీలోని ఉన్నావ్ దళిత బాలిక అత్యాచార ఘటనలో నిందితులు మళ్లీ రెచ్చిపోయారు. మరికొందరితో కలిసి బాధితురాలిపై దాడికి తెగబడ్డారు. ఆమె ఉంటున్న గుడిసెకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో బాధితురాలి ఆరు నెలల కొడుకుతోపాటు, రెండు నెలల వయస్సున్న సోదరి తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉన్నావ్‌కు చెందిన 11 ఏళ్ల బాలికపై గత ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భం దాల్చి, కుమారుడికి జన్మనిచ్చింది.
ఈ కేసులో జైలుకు వెళ్లిన నిందితులు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. కేసును వెనక్కి తీసుకునేందుకు బాధితురాలు నిరాకరించిందనే కోపంతోనే దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన శిశువుల పరిస్థితి విషమంగా మారడంతో కాన్పూర్ తరలించినట్లు పోలీసులు చెప్పారు. తమ కుమార్తెను అంతం చేసేందుకే నిందితులు ఇంటికి నిప్పుపెట్టారంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఉండగా, ఈ కేసులో నిందితులతో రాజీకి నిరాకరిస్తున్నాడనే కారణంతో గత నెలలో బాధితురాలి తాత, మామ కలిసి జరిపిన దాడిలో బాధితురాలి తండ్రి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment