
సాక్షి, న్యూఢిల్లీ: ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్టానం బుధవారం ప్రకటించింది. గుజరాత్ నుంచి బాబు బాయి జేసంగ్ బాయ్, కే శ్రీదేవన్స్ జాలా, బెంగాల్ నుంచి అనంత్ మహారాజ్‌కు అవకాశం ఇచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి చోటు దక్కలేదు. కాగా ఇప్పటికే గుజరాత్ నుంచి కేంద్రమంత్రి జైశంకర్ పేరును నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
జులై 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో ఆరు స్థానాలకు, గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జులై 6న విడుదలవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. జూలై 13 వరకు నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణకు జులై 17న చివరి తేదీగా పేర్కొంది. 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.