మతం పేరుతో ప్రజల్ని విభజిస్తోంది
గిరిజనుల నుంచి జల్, జంగల్, జమీన్‌ను లాగేసుకోవాలనుకుంటోంది
బీజేపీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ధ్వజం
లోహార్‌దాగా/సిండెగా(జార్ఖండ్): కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలను తీవ్రతరం చేశారు. కాషాయ పార్టీ మణిపూర్‌కు మంటపెట్టిందని, దేశ ప్రజలను మతం ప్రాతిపదికగా విభజించేందుకు ప్ర యత్నిస్తోందని మండిపడ్డారు. దేశంలోని 90 శాతం మంది ప్రజల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. రాహు ల్ శుక్రవారం జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొని, ప్రసంగించారు. ‘బీజేపీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులను ఒకరిపై మరొకరిని ఉసిగొల్పుతోంది.
ఇటీవల హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జాట్లు, జాట్‌యేతరుల మధ్య చిచ్చుపెట్టింది. ఇదే బీజేపీ నైజం’అని అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలకు బదులు ప్రేమను పెంచేందుకే కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ‘దళితులు, గిరిజనుల కోసం గళం వినిపించినప్పుడల్లా దేశాన్ని విభజిస్తున్నానంటూ నాపై బీజేపీ విమర్శలు చేస్తోంది. కానీ, నేను దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు, బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా. దేశం జనాభాలో 90 శాతం ఉన్న గిరిజనులు, దళితులు, ఓబీసీలకు పాలనలో భాగస్వామ్యం కోసం మాట్లాడటమే తప్పయినట్లయితే, ఇకపైనా ఇదే పనిని కొనసాగిస్తా’అని రాహల్ అన్నారు.
రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తాం
అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని హామీ ఇచ్చా రు. జార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే ఎస్‌టీల రిజర్వేషన్లను 26 శాతం నుంచి 28 శాతానికి, ఎస్‌సీల కోటాను 10 నుంచి 12 శాతానికి, ఓబీసీలకు 14 నుంచి 27 శాతానికి రిజర్వేషన్లను పెంచుతామన్నారు. కులగణనతో గిరిజనులు, దళితులు, ఓబీసీల ప్రాతినిధ్యం తగు రీతిలో పెరుగుతుందని చెప్పారు.
బీజేపీ రైతు రుణాలు మాఫీ చేసిందా?
యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు తీసుకున్న రూ.72 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందంటూ విమర్శలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం..దేశంలోని 25 మంది పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిందని రాహుల్ చెప్పారు. ‘జార్ఖండ్‌లోని రైతుల రుణాలను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందా? లేదు..ఎందుకంటే మీరంతా గిరిజనులు, దళితులు, ఓబీసీలు కాబట్టి. పెట్టుబడిదారుల రుణాలను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం మీరు తీసుకున్న అప్పులను మాత్రం మాఫీ చేయదు’అని ఎద్దేవా చేశారు. గిరిజన ప్రజల నుంచి నీరు, భూమి, అడవి(జల్, జంగల్, జమీన్)ని లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’అని ఆయన ఆరోపించారు.
ఇది సైద్ధాంతిక పోరాటం
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ఇండియా కూటమి, బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ల మధ్య జరుగుతున్న సైద్థాంతిక పోరుగా రాహుల్ అభివరి్ణంచారు. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ల లక్ష్యం దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే, ఇండియా కూటమి లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణే అన్నారు. జలం, అడవి, భూమి తమవేనని కాషాయ పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్, పెట్టుబడిదారులు భావిస్తున్నారు..అందుకే, ప్రధాని మోదీ గిరిజనులను వనవాసీలంటూ సంబోధిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment