కర్ణాటకా: కర్ణాటకాలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం నూతన విధానాలను అమలుపరుస్తోంది. ఈ క్రమంలో పిల్లల పాఠ్యపుస్తకాలను కూడా సంస్కరిస్తామని ఇప్పటికే తెలిపింది. అయితే..పుస్తకాల్లో ఆర్‌ఎస్‌ఎస్ స్థాపకుడు హెడ్గేవర్ అంశాన్ని తొలగిస్తారనే అంశంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈ చర్య భారత చరిత్రను సెన్సార్ చేయడంలాంటిదని ఆరోపించారు. 'యువతపై నేరం' చేస్తున్నారని దుయ్యబట్టారు. హెడ్గేవర్ అంశాన్ని పుస్తకాల నుంచి తొలగిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరి ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా 'హెడ్గేవర్ ఓ ఫేక్ ఫ్రీడమ్ ఫైటర్' అని ఆరోపించారు. ఈ ఆరోపణలపై బీజేపీ మండిపడింది.
విద్యార్థుల భవిష్యత్ కోసమే..
ఈ ఏడాది నుంచే పాఠ్యపుస్తకాలను సవరిస్తామని విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. తగు సవరణలు చేసి కొత్త పుస్తకాలను పాఠశాలలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ అంశాన్ని పేర్కొన్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సవరణలు చేస్తామని అన్నారు. పూర్తిగా టెక్నికల్ బృందం చేత సవరణలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థుల మెదళ్లలోకి విషాన్ని ఎక్కించే ప్రయత్నాన్ని గత ప్రభుత్వం చేసిందని ఆరోపించారు.
ఇదీ చదవండి:కర్ణాటక: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అక్కడ తప్ప!
ఆ హక్కు కాంగ్రెస్‌కు లేదు..
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలని బీజేపీ నాయకుడు సీఎన్ అశ్వత్ నారాయణ్ అన్నారు. ప్రభుత్వం అంటే అందరిదని చెప్పారు. దేశభక్తిపై కాంగ్రెస్‌కు అసహనం ఉందని బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ సీటీ రవి అన్నారు. సిద్ధాంత పరంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకించే హక్కు ఉండొచ్చు గానీ హెడ్గేవర్‌కు దేశం పట్ల ఉన్న నిబద్ధతను ప్రశ్నించే హక్కు లేదని అన్నారు. 'మావో, మార్క్స్ భావాజాలం ఈ దేశానిది కాదు. వారి సిద్ధాంతం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అయినప్పటికీ పుస్తకాల్లో చేర్చారు.కానీ దేశభక్తుడైన హెడ్గేవర్ అంశం మాత్రం లేదు. ఇది నిజంగా అసహనం.' అని ఆయన అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రసంగాన్ని అధ్యాయంగా చేర్చి పుస్తకాలను కాశాయంగా మార్చారని బీజేపీ హయాంలోనే కాంగ్రెస్ ఆరోపించింది. అప్పటి పాఠ్యపుస్తకాల సమీక్ష కమిటీ చీఫ్ రోహిత్ చక్రతీర్థను తొలగించాలని డిమాండ్ చేసింది. అప్పటి నుంచి కర్ణాటకాలో పాఠ్యపుస్తకాల వివాదం కొనసాగుతోంది.
ఇదీ చదవండి:శరద్ పవార్‍ను హత్య చేస్తామంటూ బెదిరింపులు!
Comments
Please login to add a commentAdd a comment