
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడందుకుంటున్నాయి. ఈ క్రమంలో యూపీలోని పిలిభిత్ లోక్‌సభ స్థానంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి వరుణ్ గాంధీ ఎంపీగా ఉన్నారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ వస్తుందా లేదా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
వరుణ్ సొంత పార్టీ ప్రభుత్వంపై ఎప్పుడూ ఏవో విమర్శలు చేస్తుంటారు. ఫలితంగా ఈసారి బీజేపీ నుంచి వరుణ్ గాంధీకి టికెట్ రాదని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్థానిక నేతలతో పాటు బయటి బీజేపీ నేతలు కూడా ఈ స్థానం నుంచి బరిలో దిగేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఇప్పటివరకూ 33 దరఖాస్తులు వచ్చాయని పిలిభిత్‌కు చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఈ దరఖాస్తులను పార్టీ హైకమాండ్‌కు పంపుతామని, వీటిపై అగ్రనేతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాజ్‌వాదీ నుంచి ఇప్పటివరకు నాలుగు దరఖాస్తులు వచ్చాయని, వాటిని అధిష్టానానికి పంపిస్తామని సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదేవ్ సింగ్ జగ్గా తెలిపారు.
90వ దశకంలో నైనిటాల్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న బల్‌రాజ్ పాసి గత ఆరు నెలలుగా పిలిభిత్‌లోనే ఉంటూ, ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. బిత్రీ చైన్‌పూర్ ఎమ్మెల్యే పప్పు భరతౌల్ కూడా పిలిభిత్ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీ వరుణ్ గాంధీ తన సొంత ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం ప్రారంభించినప్పటి నుండి స్థానిక నేతలు ఈ పార్లమెంట్ సీటుపై కన్నువేశారు.
Comments
Please login to add a commentAdd a comment