
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యోగీ ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకుంటే బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ‍్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ సమయంలోపు ఆయన వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని ఈసీ వెల్లడించింది.
అయితే.. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండు విడతల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తైంది. త్వరలో మూడో విడతలో పోలింగ్ జరుగనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. యూపీలో ఉండాలంటే యోగీకి ఓటు వేయాల్సిందేనని హెచ్చరించారు. యోగీకి ఓటు వేయకపోతే జేసీబీలు, బుల్డోజర్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఆయనకు నోటీసులు పంపించింది.