
నీవు కమిషనర్‌వా?, అయ్యా, తూ, నీ జన్మకు సిగ్గుండాలి.. అని పోలీసు కమిషనర్ పై
మైసూరు: రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై కర్నాటకలో తీవ్ర వివాదాస్పదమవుతోంది. సోమవారం సాయంత్రం మైసూరు రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదం సంఘటనలో దాడికి గురైన పోలీసులను మెచ్చుకుని, ప్రశంసాపత్రాలను ఇచ్చిన పోలీసు కమిషనర్ డా. చంద్రగుప్తపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మైసూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రింగ్‌రోడ్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల బైక్ మీద వస్తున్న వ్యక్తి మరణిస్తే, ఆ పోలీసులకు మీరెలా ప్రశంసా పత్రాలిస్తారు? నీవు కమిషనర్‌వా?, అయ్యా, తూ, నీ జన్మకు సిగ్గుండాలి’ అని విశ్వనాథ్ మండిపడ్డారు.
‘మైసూర్ నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న నువ్వు రోడ్డుపైకి వచ్చేది లేదు. సిటీలో ఏం జరుగుతుందో తెలియదు. కనీసం సిటీలో రౌండ్స్ వేయవు. ఎన్ని సంవత్సరాలు అయ్యింది నీవు మైసూర్‌కు వచ్చి?. ఎంత మంది సీసీపీలు, ఏసీపీలు వచ్చి పని చేశారు? ట్రాఫిక్ పోలీసులకు మైసూర్‌లో ట్రాఫిక్ కంట్రోల్ చెయ్యడం రాదా?. ప్రజా ప్రతినిధులంటే గౌరవం లేదా?’ అని మండిపడ్డారు. సోమవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేస్తుండగా, ఒక బైకర్ కిందపడి మరణించడం, దాంతో స్థానికులు ఆగ్రహంతో ముగ్గురు పోలీసులను చితకబాదడం తెల్సిందే. తర్వాత కమిషనర్ ఆ ముగ్గురు పోలీసులను పిలిపించి బాగా పనిచేశారని కితాబిస్తూ ప్రశంసాపత్రాలను అందజేయడం విమర్శలకు తావిచ్చింది.