ఆశించడం కంటే చనిపోవడం మేలు: మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ | BJP Women Supporters Emotional With Ex CM Shivraj Singh | Sakshi
Sakshi News home page

ఆశించడం కంటే చనిపోవడం మేలు: మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ ఆవేదన

Dec 13 2023 8:10 AM | Updated on Dec 13 2023 9:28 AM

BJP Women Supporters Emotional With Ex CM Shivraj Singh - Sakshi

భోపాల్‌: సీఎం పదవి నుంచి దిగిపోయినవేళ మధ్యప్రదేశ్‌ బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా మోహన్‌ యాదవ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టనుండగా, మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లి తనకు ఏదో ఒక పదవి కావాలని అధిష్టానాన్ని కోరుకోవడం కంటే చనిపోవడం మేలని పేర్కొన్నారు. అలా తాను అడగలేనని చెప్పారు. తన ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొత్త సీఎం కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇక, ఈ విషయంలో ఆయనకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న మహిళా కార్యకర్తలు కొందరు కంటనీరు పెట్టుకోవడం, శివరాజ్‌సింగ్‌ భావోద్వేగానికి గురైనట్లుగా ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.  

బీజేపీ అనూహ్య నిర్ణయం..
మరోవైపు.. మధ్యప్రదేశ్‌ సీఎం ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గం నాయకుడు మోహన్‌ యాదవ్‌(58) పేరును ఖరారు చేసింది. ఆయన ఉజ్జయిని సౌత్‌ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన వారిలో తొలుత మోహన్‌ యాదవ్‌ పేరు లేదు.
రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)తో మొదటి నుంచి సంబంధాలు ఉండడం, రాష్ట్రంలో 48 శాతం జనాభా ఉన్న ఓబీసీ నేత కావడంలో బీజేపీ పెద్దలు ఆయనవైపు మొగ్గు చూపారు. 

కరడుగట్టిన హిందుత్వావాది
మోహన్‌ యాదవ్‌ విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారు. కరడుగట్టిన హిందుత్వావాదిగా ముద్రపడ్డారు. కళాశాలల్లో ‘రామచరిత మానస్‌’ను ఆప్షనల్‌ సబ్జెక్టుగా ప్రవేశపెడతామని 2021లో ప్రకటించారు. మోహన్‌ యాదవ్‌ 1965 మార్చి 25న ఉజ్జయినిలో జని్మంచారు. 1982లో ఉజ్జయినిలోని మాధవ్‌ సైన్స్‌ కాలేజీలో జాయింట్‌ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. 1984లో అదే కాలేజీలో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు.

ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏతోపాటు పీహెచ్‌డీ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉంది. 1993 నుంచి 1995 దాకా ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీసు బేరర్‌గా పనిచేశారు. తొలిసారిగా 2013లో ఉజ్జయిని సౌత్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018, 2023లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. 2020లతో మొదటిసారిగా మంత్రి అయ్యారు. ఉజ్జయిని ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి నాయకుడు ఆయనే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement