దర్యాప్తులో నిష్పక్షపాతం లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపణ
ఆమె బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ
రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు
విచారణను 4వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు సంస్థలా కాకుండా వేధించే సంస్థలా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈడీ దర్యాప్తులో నిష్పక్షపాతం కనిపించడం లేదని, కక్షగట్టి వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోందని విమర్శించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టైన కవిత తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం విచారణ జరిపారు.
ఈ సందర్భంగా కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ‘‘ఈడీ దర్యాప్తు సంస్థలా కాకుండా వేధించే ఏజెన్సీలా వ్యవహరిస్తోంది. న్యాయం, నిష్పక్షపాతం కనిపించడంలేదు. అంతా ప్రీమోటివేటెడ్ విధానంలా ఉంది. అరెస్టు చేసినా, చేయకపోయినా నిత్యం వేధింపులు తప్పవన్నట్టు వ్యవహరిస్తోంది. రోజూ ఒక ఆపిల్ తింటే ఆరోగ్యమని డాక్టర్లు చెప్పినట్టు..రోజూ సమన్లు ఇవ్వడం ఈడీకి సంతోషంగా ఉంటున్నట్టుంది..’’ అని పేర్కొన్నారు. ఈడీది ప్రత్యేక సామ్రాజ్యమన్నట్టు, కోర్టుకు, రాజ్యాంగానికి అతీతమన్నట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కవితను అరెస్టు చేయాల్సిన అవసరమేంటి?
ఈడీ విచారణకు కవిత సహకరించారని, ఆమెను అరెస్టు చేసి ఉండాల్సిన అవసరమే లేదని సింఘ్వి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్న కారణంగానే కవిత ఈడీ విచారణకు హాజరుకాలేదని వివరించారు. ‘‘ఇదేమైనా హత్య కేసా? పీఎంఎల్‌ఏ సెక్షన్ 19ను ఐపీసీ సెక్షన్ 302లా చూపుతున్నారు. కవిత సమాజంలో పేరున్న మహిళ. ప్రకటిత నేరస్తురాలు కాదు. ఆమె ఎక్కడికీ పారిపోరు..’’ అని స్పష్టం చేశారు. ఈడీ సమన్లు ఇచ్చిన తర్వాత ఎన్ని ప్రశ్నలు వేశారు? ఇంకా ఎన్ని మిగిలిఉన్నాయో చెప్పాలని కోరారు.
అరుణ్‌పిళ్‌లై స్టేట్‌మెంట్లు విభిన్నంగా ఉన్నాయని.. ఈడీ దాఖలు చేసిన చార్జిషీటు, అదనపు చార్జిషీటులో నిందితురాలుగా గానీ, ముద్దాయిగా గానీ కవిత పేరు ఎక్కడా లేదని వివరించారు. కాగా.. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్ కోర్టును కోరారు. కవిత బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ ఈడీ తరఫున కౌంటర్ దాఖలు చేశారు. దీనితో కవిత తరఫున న్యాయవాది సింఘ్వి.. ఈడీ కౌంటర్‌పై రిజాయిండర్‌ను ఈ నెల 3 కల్లా దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. దీనితో విచారణను న్యాయమూర్తి ఈ నెల 4వ తేదీకి వాయిదా వేశారు.
కవితకు ఇంటి భోజనం, పుస్తకాలు ఇవ్వండి..
తనకు అందించాల్సిన సౌకర్యాలపై కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. జైలు అధికారులు పాటించడం లేదంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. కవితకు ఇంటి భోజనం, పుస్తకాలు, మెడిటేషన్ చేసుకొనేందుకు జపమాల, బూట్లను అనుమతించాలని తాజాగా ఆదేశాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment