పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచించింది. ముఖ్యంగా బాలికలను ఉద్ధేశించి.. రెండు నిమిషాల సుఖం కోసం లొంగిపోవద్దని, ఇది సమాజంలో ఆమె గౌరవాన్ని తగ్గిస్తుందనే విషయాన్ని నొక్కి చెప్పింది. అబ్బాయిలు కూడా మహిళల విషయంలో గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని పేర్కొంది. పరస్పర సమ్మతితో సెక్స్‌లో పాల్గొనే కేసుల్లో పోక్సో చట్టాన్ని ప్రయోగించే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
మైనర్ అయిన తన భార్యతో శారీరక సంబంధంలో పాల్గొనందుకు గతేడాది ఓ టీనేజర్‌కు సెషన్స్ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై యువకుడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్ చిత్తరంజన్ దాస్, పార్థ సారథి సేన్‌లతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అత్యాచారం కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు టీనేజీ అబ్బాయిలు, అమ్మాయిలకు పలు సూచనలు చేసింది.
విచారణ సందర్భంగా... తన ఇష్టపూర్వకంగానే టీనేజర్‌తో రిలేషన్‌లో ఉన్నానని కోర్టుకు సదరు బాలిక కోర్టుకు తెలిపింది. అతన్ని పెళ్లి కూడా చేసుకున్నానని పేర్కొంది. అయితే 18 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం అనే విషయాన్ని కూడా ఆమె అంగీకరించింది. కాగా, పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు వస్తుంది.
చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి!
టీనేజీలో సెక్స్ అనేది సాధారణమైన విషయమని, అయితే అలాంటి కోరికలను ప్రేరేపించడం అనేది వ్యక్తుల చర్యలపై ఆధారపడి ఉంటుందని బెంచ్ పేర్కొంది. యుక్త వయసు బాలికలు రెండు నిమిషాల సుఖం కోసం బాలికలు మొగ్గు చూపరాదని, లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచించింది. రెండు నిమిషాల సుఖం కోసం ఆశపడితే సమాజంలో చెడ్డపేరు వస్తుందని, అలాంటి పనులకు పాల్పడవద్దని హితవు పలికింది. బాలికలకు వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం అన్నిటికంటే ముఖ్యమని చెప్పింది.
అదే విధంగా టీనేజీలోని అబ్బాయిలు కూడా అమ్మాయిలను గౌరవించాలని తెలిపింది. వారి హక్కులను, గోప్యతను, ఆత్మగౌరవవాన్ని, ఆమె శరీర స్వయంప్రతిపత్తిని కాపాడేలా వ్యవహరించాలని తెలిపింది. ఇలాంటి విషయాల్లో పిల్లల తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులుగా ఉండాలని, మంచి-చెడుల గురించి చెప్పాలని సూచించింది.
మగపిల్లలకు తల్లిదండ్రులు మహిళలను ఎలా గౌరవించాలో చెప్పాలని, లైంగిక కోరికతో ప్రేరేపించబడకుండా వారితో ఎలా స్నేహం చేయాలో చెప్పాలని సూచించింది. యుక్త వయస్సులో లైంగిక సంబంధాల వల్ల తలెత్తే చట్టపరమైన సమస్యలను నివారించడానికి పాఠశాలలో లైంగిక విద్య అవసరమని నొక్కి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment