నాడు సీబీఐ.. నేడు ఈడీ | CBI interrogated Kavitha on December 11 in the Delhi liquor scam case | Sakshi
Sakshi News home page

నాడు సీబీఐ.. నేడు ఈడీ

Published Thu, Mar 9 2023 3:07 AM | Last Updated on Thu, Mar 9 2023 3:07 AM

CBI interrogated Kavitha on December 11 in the Delhi liquor scam case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి గతేడాది డిసెంబర్‌ 11న హైదరాబాద్‌లో కవితను సీబీఐ విచారించిన విషయం విదితమే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుంభకోణంలో సౌత్‌ గ్రూపునకు చెందిన పలువురు కీలకపాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.

గతేడాది ప్రధాన నిందితుడు సమీర్‌ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జిషీ టులో పలుసార్లు కవిత పేరు ప్రస్తావించిన విషయం విదితమే. సాక్ష్యాలు ధ్వంసం చేసే క్రమంలో కవిత కూడా తన ఫోన్లు ధ్వంసం చేశారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈడీ విచారణలో నిందితులు సమీర్‌ మహేంద్రు, దినేష్‌ అరోరా, అరుణ్‌ పిళ్‌లై, వి.శ్రీనివాసరావులు కవిత పేరు ప్రస్తావించారు.

సోమవారం రాత్రి అరుణ్‌పిళ్‌లైను అరెస్టు చేసిన ఈడీ మంగళవారం ప్రత్యేక కోర్టులో హాజరు పరిచింది. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండు రిపోర్టులో అరుణ్‌పిళ్లై .. కవిత బినామీ అని పేర్కొంది. తాజాగా ఆమెకు కూడా  నోటీసులు జారీ చేయడంతో వీరిద్దరినీ కలిపి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈడీ రికార్డు చేసిన స్టేట్‌మెంట్లు ఇలా ఉన్నాయి. 

సమీర్‌ మహేంద్రు
ఇండో స్పిరిట్స్‌ వెనక ఉన్నవారెవరని అరుణ్‌ పిళ్‌లైను సమీర్‌ మహేంద్రు అడగగా  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారని సమీర్‌కుపిళ్లై చెప్పారని ఈడీ పేర్కొంది.

‘ఇండో స్పిరిట్స్‌ దరఖాస్తుపై సమస్యలు వస్తే తన స్థాయిలో పరిష్కరిస్తానని, అరుణ్‌పిళ్లై ద్వారా తనకు తెలియజేయాలని సమీర్‌ మహేంద్రుకు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హైదరాబాద్‌ వెళ్లినపుడు కవిత ఇంట్లో ఆమె భర్త అనిల్‌తో కలిసి సమీర్‌ భేటీ అయ్యారు. అరుణ్‌ తమ కుటుంబానికి సన్నిహితుడని, ఇప్పటికే కలిసి వ్యాపారం చేస్తున్నామని సమీర్‌కు కవిత తెలిపారు.’ అని ఈడీ తెలిపింది.
 
అరుణ్‌పిళ్లై స్టేట్‌మెంట్‌
ఎమ్మెల్సీ కవిత, సమీర్‌ మహేంద్రులు ఫేస్‌ టైంలో మాట్లాడుకొనే ఏర్పాటు చేశాననిపిళ్లై తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నట్లు ఈడీ తెలిపింది. హైదరాబాద్‌లో వారిద్దరూ సమావేశం అయ్యేలా ఏర్పాటు చేశానని, ఇండో స్పిరిట్స్‌లో అసలు పెట్టుబడిదారు కవిత అని సమీర్‌కు వివరించారని పేర్కొంది.  

దినేష్‌ అరోరా
ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌లో తాను ఎమ్మెల్సీ కవిత, అరుణ్‌ పిళ్‌లై, విజయ్‌నాయర్‌లు సమావేశమైనట్టుగా దినేష్‌ తెలిపారని ఈడీ పేర్కొంది. ‘మద్యం వ్యాపారంపై చర్చించడంతో పాటు ఆప్‌ నేతలకు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.100 కోట్లు రికవరీ పైనా చర్చించారు’ అని ఈడీ తెలిపింది.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement