ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి అప్పగించడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. సుశాంత్ మృతి కేసులో ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సీబీఐ గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో రియాతో పాటు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, షోయిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరంద, శ్రుతి మోదీ ఇతరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. జూన్ 14న ముంబైలోని బాంద్రా అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తునకు సీబీఐ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం సుశాంత్ మృతిపై దర్యాప్తు సాగిస్తుంది. విచారణను డీఐజీ గగన్‌దీప్ గంభీర్ పర్యవేక్షిస్తారు.
అనిల్ యాదవ్ దర్యాప్తు అధికారి కాగా, సీబీఐ అధికారులు ఇప్పటికే అవసరమైన పత్రాల కోసం బిహార్ పోలీసులను సంప్రదిస్తున్నారు. మరోవైపు సుశాంత్ కేసులో మనీల్యాండరింగ్ కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టింది. రాజ్‌పుత్ ఖాతాల నుంచి ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తికి రూ 15 కోట్లు బదిలీ అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ దిశగా ఆరా తీస్తోంది. ఈడీ వర్గాలు ఇప్పటికే సుశాంత్ సీఏ సందీప్ శ్రీధర్, రియా సన్నిహితుడు శ్యామ్యూల్ మిరందాను ప్రశ్నించారు. రియాను ఈనెల 7న తమ ఎదుట హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. రియా ఆస్తులపైనా ఈడీ ఆరా తీస్తోంది. చదవండి : సుశాంత్ ఆత్మహత్య: వెలుగులోకి రియా కాల్‌డేటా
Comments
Please login to add a commentAdd a comment