
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాదికి 10, 12 బోర్డు పరీక్షలకు ప్రత్యేక మూల్యాంకన విధానాన్ని అనుసరించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ప్రకటించింది. విద్యా సంవత్సరాన్ని రెండు టర్మ్‌లుగా విభజిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత 2021–22 విద్యాసంవత్సరం కోసం సిలబస్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు ఇంటర్నల్ అసెస్‌మెంట్, ప్రాజెక్ట్ వర్క్‌లను మరింత పారదర్శకంగా చేసేందుకు అనుసరించనున్న ప్రణాళికలను బోర్డు ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సీబీఎస్‌ఈ బోర్డు గతేడాది కొన్ని సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేయగా, ఈ ఏడాది బోర్డు పరీక్షలను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో సోమవారం ప్రకటించిన ప్రణాళికల ప్రకారం ఈ ఏడాది నవంబర్–డిసెంబర్‌లో మొదటి టర్మ్ పరీక్షలను నిర్వహించనున్నారు. రెండో టర్మ్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీబీఎస్‌ఈ డైరెక్టర్ (అకాడమిక్) జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. విభజించిన సిలబస్ ఆధారంగా బోర్డు ప్రతి టర్మ్ చివరిలో పరీక్షలు నిర్వహిస్తుంది. విద్యాసంవత్సరం చివర్లో 10, 12వ తరగతి పరీక్షలను నిర్వహించే అవకాశాన్ని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. ప్రస్తుత 2021–22 విద్యాసంవత్సరం సిలబస్‌ను గత విద్యాసంవత్సరం మాదిరిగా క్రమబద్ధీకరించి ఈ నెలలో ప్రకటిస్తారు. పాఠశాలలు విద్యాప్రణాళికలను కొనసాగించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ప్రత్యామ్నాయ అకాడమిక్ క్యాలెండర్, ఇన్‌పుట్స్‌ని తీసుకొనే అవకాశాన్ని కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment