
న్యూఢిల్లీ: టీనేజీ విద్యార్థులకు ఏదైనా ఒక విషయాన్ని సమాజం.. తప్పుడు కోణంలో చెప్పేలోపే దానిని స్పష్టమైన భావనతో, సహేతుకమైన విధానంలో పాఠంగా చెప్పడం మంచిదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) సీబీఎస్‌ఈ నిర్ణయించుకుంది. పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి విముఖత చూపే డేటింగ్, రిలేషన్‌షిప్ వంటి సున్నితమైన అంశాలపై టీనేజీ విద్యార్థుల్లో సుస్పష్టమైన ఆలోచనను పాదుకొల్పే సదుద్దేశంతో సీబీఎస్‌ఈ ముందడుగు వేసింది.
ఇందులో భాగంగా డేటింగ్, రిలేషన్‌షిప్ వంటి ఛాప్టర్‌లను తమ 9వ తరగతి ‘వాల్యూ ఎడిషన్’ పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో తోటి వయసు వారిపై ఇష్టం, కలిసి మెలసి ఉండటం వంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా చెబుతూ ప్రత్యేకంగా పాఠాలను జతచేశారు.
‘డేటింగ్ అండ్ రిలేషన్‌షిప్స్: అండర్‌స్టాండింగ్ యువర్‌సెల్ఫ్ అండ్ ది అదర్ పర్సన్’ పేరుతో ఉన్న ఒక పాఠం, కొన్ని పదాలకు అర్ధాలు, ఇంకొన్ని భావనలపై మీ అభిప్రాయాలేంటి? అనే ఎక్సర్‌సైజ్ సంబంధ పేజీలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఫొటోలవంటి ఇతరుల సమాచారాన్ని దొంగతనంగా సేకరించి వాటితో ఇంకొకరిని ఆకర్షించే ‘క్యాట్‌ఫిషింగ్’, సంజాయిషీ లేకుండా బంధాన్ని హఠాత్తుగా తెగతెంపులు చేసుకునే ‘ఘోస్టింగ్’, ‘సైబర్ బులీయింగ్’ పదాలకు అర్ధాలను వివరిస్తూ చాప్టర్లను పొందుపరిచారు. ‘క్రష్’, ‘స్పెషల్’ ఫ్రెండ్ భావనలను చిన్న చిన్న కథలతో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment