Class 12 exam
-
2022లో రెండు టర్మ్‌లుగా విద్యా సంవత్సరం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాదికి 10, 12 బోర్డు పరీక్షలకు ప్రత్యేక మూల్యాంకన విధానాన్ని అనుసరించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది. విద్యా సంవత్సరాన్ని రెండు టర్మ్‌లుగా విభజిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత 2021–22 విద్యాసంవత్సరం కోసం సిలబస్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు ఇంటర్నల్ అసెస్మెంట్, ప్రాజెక్ట్ వర్క్‌లను మరింత పారదర్శకంగా చేసేందుకు అనుసరించనున్న ప్రణాళికలను బోర్డు ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు గతేడాది కొన్ని సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేయగా, ఈ ఏడాది బోర్డు పరీక్షలను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రకటించిన ప్రణాళికల ప్రకారం ఈ ఏడాది నవంబర్–డిసెంబర్లో మొదటి టర్మ్ పరీక్షలను నిర్వహించనున్నారు. రెండో టర్మ్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీబీఎస్ఈ డైరెక్టర్ (అకాడమిక్) జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. విభజించిన సిలబస్ ఆధారంగా బోర్డు ప్రతి టర్మ్ చివరిలో పరీక్షలు నిర్వహిస్తుంది. విద్యాసంవత్సరం చివర్లో 10, 12వ తరగతి పరీక్షలను నిర్వహించే అవకాశాన్ని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. ప్రస్తుత 2021–22 విద్యాసంవత్సరం సిలబస్‌ను గత విద్యాసంవత్సరం మాదిరిగా క్రమబద్ధీకరించి ఈ నెలలో ప్రకటిస్తారు. పాఠశాలలు విద్యాప్రణాళికలను కొనసాగించేందుకు ఎన్సీఈఆర్టీ నుంచి ప్రత్యామ్నాయ అకాడమిక్ క్యాలెండర్, ఇన్‌పుట్స్‌ని తీసుకొనే అవకాశాన్ని కల్పించారు. -
ఆ రెండు పరీక్షలు మళ్లీ నిర్వహిస్తాం: సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: పదో తరగతి గణితం, 12వ తరగతి ఆర్థికశాస్త్రం పరీక్షలను మళ్లీ నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. ఇటీవల జరిగిన పదో తరగతి మ్యాథమెటిక్స్, 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీకైనట్టు వెలుగుచూడటం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు.. ప్రశ్నాపత్రాలు లీక్ కావడం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించామని, ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షల తేదీని తమ వెబ్సైట్లో వెల్లడిస్తామని సీబీఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ రెండు పరీక్షలు మళ్లీ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన ఈ రెండు పరీక్షలకు దాదాపు 28లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. సీబీఎస్ఈ నిర్ణయంతో పదో తరగతిలో 16,38,428 మంది విద్యార్థులు, 12వ తరగతిలో 11,86,306మంది విద్యార్థులు మరోసారి పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. టెన్త్ మ్యాథమెటిక్స్ ప్రశ్నాపత్రం చాలా సులువుగా రావడం, 12వ తరగతి ఎకనామిక్స్ ప్రశ్నాపత్రం లీకై.. వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడం పరీక్షల సందర్భంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
షాలిని.. ఓ విజేత
బెంగళూరు: వయసు 17 ఏళ్లే. కానీ నూరేళ్లకు సరిపడా బాధలున్నాయి ఆమె జీవితంలో. అయినా మొక్కవోని దీక్షతో, కష్టాల కడలిని ఈదుతూనే 12వ తరగతి పరీక్షల్లో 84 శాతం మార్కులు సాధించింది. అయిదిళ్లలో పాచి పనిచేసుకుంటూ ఈ ఘనతను సాధించింది బెంగళూరుకు చెందిన షాలిని. తండ్రి మంచానికే పరిమితం.. తమ్ముడికి బ్లడ్ క్యాన్సర్.. సినిమా కష్టాలు అంటే ఇవేనేమో... ఇంలాంటి కష్టాలన్నిటినీ తోసి రాజని విజేతగా నిలిచింది షాలిని. వివరాల్లోకి వెళితే.. కూలి పనిచేసుకునే షాలిని తండ్రి ప్రమాదవశాత్తూ గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఆమె తల్లి మంగళ కుటుంబానికి పెద్ద దిక్కయ్యింది. అమ్మకు సాయంగా షాలిని కూడా పనిలోకి దిగక తప్పలేదు. ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క పనిమనిషిగా మారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తోంది. 'పొద్దున్నే నాలుగున్నర నిద్రలేచి తొమ్మిది గంటలకు వరకు అయిదిళ్లలో పనిచేస్తా. అంట్లు తోముతా.. ముగ్గులు పెడతా.. బట్టలు ఉతుకుతా.. అన్నీ పనులు చేస్తా.. రాత్రికి చదువుకుంటా...' అంటూ మీడియాకు గడగడా ఇంగ్లీషులో చెప్పింది. తన కుటుంబంలో మొదటి ఇంజనీర్ కావాలనేది తన ఆశయమని చెప్పింది. మొదట తమిళ మీడియం, తరువాత కన్నడ, ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటోంది షాలిని. తన భర్త చదువుకోలేదని, తాను ఐదవతరగతి వరకు చదువుకున్నానని...తన కూతురి కలలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని అంటోంది ఆమె తల్లి మంగళ. అయితే షాలిని తమ్ముడు సూర్య బ్లడ్ కేన్సర్ తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.