షాలిని.. ఓ విజేత
బెంగళూరు: వయసు 17 ఏళ్లే. కానీ నూరేళ్లకు సరిపడా బాధలున్నాయి ఆమె జీవితంలో. అయినా మొక్కవోని దీక్షతో, కష్టాల కడలిని ఈదుతూనే 12వ తరగతి పరీక్షల్లో 84 శాతం మార్కులు సాధించింది. అయిదిళ్లలో పాచి పనిచేసుకుంటూ ఈ ఘనతను సాధించింది బెంగళూరుకు చెందిన షాలిని.
తండ్రి మంచానికే పరిమితం.. తమ్ముడికి బ్లడ్ క్యాన్సర్.. సినిమా కష్టాలు అంటే ఇవేనేమో... ఇంలాంటి కష్టాలన్నిటినీ తోసి రాజని విజేతగా నిలిచింది షాలిని. వివరాల్లోకి వెళితే..
కూలి పనిచేసుకునే షాలిని తండ్రి ప్రమాదవశాత్తూ గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఆమె తల్లి మంగళ కుటుంబానికి పెద్ద దిక్కయ్యింది. అమ్మకు సాయంగా షాలిని కూడా పనిలోకి దిగక తప్పలేదు. ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క పనిమనిషిగా మారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తోంది.
'పొద్దున్నే నాలుగున్నర నిద్రలేచి తొమ్మిది గంటలకు వరకు అయిదిళ్లలో పనిచేస్తా. అంట్లు తోముతా.. ముగ్గులు పెడతా.. బట్టలు ఉతుకుతా.. అన్నీ పనులు చేస్తా.. రాత్రికి చదువుకుంటా...' అంటూ మీడియాకు గడగడా ఇంగ్లీషులో చెప్పింది. తన కుటుంబంలో మొదటి ఇంజనీర్ కావాలనేది తన ఆశయమని చెప్పింది. మొదట తమిళ మీడియం, తరువాత కన్నడ, ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటోంది షాలిని.
తన భర్త చదువుకోలేదని, తాను ఐదవతరగతి వరకు చదువుకున్నానని...తన కూతురి కలలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని అంటోంది ఆమె తల్లి మంగళ. అయితే షాలిని తమ్ముడు సూర్య బ్లడ్ కేన్సర్ తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.