సాక్షి, న్యూఢిల్లీ: ఆరేళ్ళలో దేశంలోని కార్పోరేట్లకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపుల రూపంలో రూ.6,07,583.04 కోట్లను మినహాయించినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం రాజ్యసభలో సీపీఐ (ఎం) ఎంపీ కెకె రాగేష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,15,176.50 కోట్లు, 2016–17లో రూ.1,30,184.41 కోట్లు, 2017–18లో రూ.1,20,069.67 కోట్లు, 2018–19లో రూ.1,25,891.78 కోట్లు, 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,16,260.68 కోట్లు దేశంలోని పెట్టుబడిదారులకు పన్ను మినహాయిం పులు ఇచ్చినట్టు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
చట్టం ప్రకారమే..
ఆదాయ పన్ను చట్టం–1961 ప్రకారమే కార్పోరేట్లకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. దేశంలో ప్రాంతీయ అసమానతలను తొలగించే చర్యల్లో భాగంగా పెట్టుబడిదారులకి కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపులిచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. ఒక నిర్దిష్ట రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి లేదా ప్రాంతీయ అసమాన పరిస్థితులను తగ్గించడానికి సాధారణంగా పన్ను ప్రోత్సాహకం అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం పేర్కొన్న ప్రాంతాలలో వివిధ పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆయా పెట్టుబడిదారులు ఈ పన్ను మినహాయింపులను వినియోగిస్తారని మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment